ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు

Telangana Mobility Valley: Minister Ktr Says Govt Aims At Rs 50,000 Cr Investments In E Mobility - Sakshi

పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం.. 

3–4 లక్షల ఉద్యోగాల సృష్టి  

రెండు వారాల్లో రూ.3వేల కోట్ల పెట్టుబడుల ప్రకటన రానుంది 

రాష్ట్రంలో నాలుగు ఈవీ మెగా క్లస్టర్ల అభివృద్ధి

తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (టీఎంవీ) ద్వారా రానున్న ఐదేళ్లలో రూ.50వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఈ రంగంలో పెట్టుబడులతో రాష్ట్రంలో నాలుగు లక్షలకుపైగా ఉద్యోగాలు సృష్టించవచ్చని చెప్పారు. హైదరాబాద్‌ ఈ–మొబిలిటీ వీక్‌లో భాగంగా తెలంగాణ మొబిలిటీ ఫోకస్డ్‌ క్లస్టర్, తెలంగాణ మొబిలిటీ వ్యాలీలను ఏర్పాటుచేస్తున్నట్లు సోమవారమిక్కడ ప్రకటించారు.

టీఎంవీ.. ఉత్తమ మౌలిక సదుపాయాలను కలి్పంచడంతోపాటు, దేశంలో తయారీని ప్రోత్సహిస్తుందన్నారు. అలాగే, ఆర్‌ అండ్‌ డీలో తెలంగాణను అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘టీఎంవీలో ముఖ్యంగా హైదరాబాద్‌ చుట్టుపక్కల నాలుగు మెగా క్లస్టర్‌లను అభివృద్ధి చేస్తున్నాం. వీటిలో జహీరాబాద్‌లో ఈవీ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్, సీతారాంపూర్‌లో ఈవీ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్, దివిటిపల్లిలో ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ క్లస్టర్, యెంకతల వద్ద ఇన్నొవేషన్‌ క్లస్టర్‌ అభివృద్ధి చేస్తున్నాం’అని కేటీఆర్‌ తెలిపారు.  

త్వరలో రూ.3వేల కోట్ల పెట్టుబడులపై ప్రకటన 
రాష్ట్రానికి త్వరలో రూ.3 కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయని, రెండు వారాల్లో వివరాలు ప్రకటిస్తామని కేటీఆర్‌ చెప్పారు. ఈ పెట్టుబడులు తెలంగాణలో ఎలక్ట్రిక్‌ 2–వీలర్, 3–వీలర్, చార్జింగ్‌ పరికరాల తయారీ ఎకో సిస్టమ్స్‌ను మరింత బలోపేతం చేస్తాయన్నారు. ‘అడ్వాన్స్‌డ్‌ సెల్‌ కెమిస్ట్రీ, హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్స్, ఆటో ఇంజనీరింగ్‌లో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రంగాల్లో ఆయా కంపెనీల కార్యకలాపాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ పనిచేస్తుంది’అని తెలిపారు. ఈ రంగంలోని నిపుణులు, గ్లోబల్‌ ఆటోమోటివ్‌ ఎకోసిస్టమ్‌ భాగస్వాములను ఒకచోట చేర్చేందుకు హైదరాబాద్‌ ఈ–మొబిలిటీవీక్‌ను క్రమం తప్పకుండా నిర్వహిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మూడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటిలో తెలంగాణ ప్రభుత్వంతో ఏటీఎస్‌–టీయూవీ రైన్‌ల్యాండ్, బిట్స్‌ హైదరాబాద్‌తో బోష్‌ గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్, షెల్‌తో తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్‌్క)లు కుదుర్చుకున్న ఒప్పందాలున్నాయి. అపోలో టైర్స్‌ లిమిటెడ్‌ చీఫ్‌ డిజిటల్‌ ఆఫీసర్‌ హిజ్మీ హాసెన్‌ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఆటోమోటివ్‌ పరిశ్రమకు ప్రాధాన్యతనిస్తూ ఈ–మొబిలిటీ వీక్‌ నిర్వహించడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో వోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌ ఇండియా, సేల్స్, మార్కెటింగ్‌ అండ్‌ డిజిటల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ క్రిస్టియన్‌ వాన్‌ సీలెన్, వోల్వో గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ కమల్‌ బాలి, ఉబర్‌ ఇండియా, సౌత్‌ ప్రెసిడెంట్‌ ప్రభ్‌జీత్‌ సింగ్, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టాస్క్‌ తెలంగాణ సీఈఓ శ్రీకాంత్‌ సిన్హా తదితరులు పాల్గొన్నారు.  

బిట్స్‌పిలానీలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ 
ఇందులోభాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌) పిలానీ ఒప్పందం చేసుకుంది. నూతన మొబిలిటీలో అభివద్ధి చెందుతున్న ఆవిష్కరణలను అన్వేషించడంలో ముందుండాలనే ప్రభుత్వ ప్రయత్నాలకు తోడ్పాటునందించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆ సంస్థ తెలిపింది. నూతన మొబిలిటీ కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను బిట్స్‌పిలానీ, హైదరాబాద్‌ క్యాంపస్‌లో ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొంది. నూతన మొబిలిటీ కోసం భారత తొలి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ హైదరాబాద్‌లో ఏర్పాటుకావడం సంతోషంగా ఉందని కేటీఆర్‌ చెప్పారు.  

   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top