జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తా

Telangana: MLC Kalvakuntla Kavitha About Journalists Housing - Sakshi

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పటాన్‌చెరు టౌన్‌: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారులోని జీఎంఆర్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు రాష్ట్ర మహాసభలు, ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ పదో ప్లీనరీ మహాసభలకు ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సమాజంలో వార్తల మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చిందని, ఇది బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. తమది తెలంగాణ వాదమని అన్నారు. కొన్ని పేపర్లకు పేరు ఉండదు.. ఊరు ఉండదు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తాయని విమర్శించారు. ప్రధాని మోదీ తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రెస్‌మీట్‌ పెట్టిందిలేదన్నారు. కానీ సీఎం కేసీఆర్‌ 300 మంది జర్నలిస్టులతో సమావేశం పెడతారని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించిందని, దమ్ముంటే మోదీ కూడా కేటాయించాలని డిమాండ్‌ చేశారు.  

రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 
రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ఉద్యమంలో వారు చేసిన పోరాటాలు మరచిపోలేమని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. వార్తలను ఉన్నది ఉన్నట్లు రాయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రెడిటేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులు ఇచ్చి వారి సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు.

జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ప్లీనరీలో ఆదివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేశారో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులు గమనించాలని కోరారు. ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులకు బలం వచ్చిందని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top