సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీతో చర్చలకు సిద్ధమని పొన్నం ప్రభాకర్ మరోసారి ప్రకటించారు. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా తక్షణమే సమ్మె విరమించాలని ఆయన ఉద్యోగులను కోరారు. బుధవారం సచివాలయంలో రవాణా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఆయన అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
32 అంశాల్లో 29 అంశాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. విలీనంతో జరిగే లాభనష్టాలను అంచనా వేస్తున్నాం. సమర్థవంతమైన అధికారులతో కమిటీ వేశాం. కమిటీ వేశాం.. నాలుగు వారాల సమయం అడిగాం. 41 రోజులు ఆగినవాళ్లు.. 4 వారాలు ఆగలేరా?. గత ప్రభుత్వం చేపట్టిన చర్యలు గుర్తు లేదా?. కమిటీలతో కాలయాపన చేసే ప్రభుత్వం మాది కాదు..
2018లో ఈవీ బస్సులు ప్రారంభమయ్యాయి. ఈవీ బస్సులు కేంద్ర నిర్ణయం. ఈ నిర్ణయం ఆధారంగా ఒక్క ఆర్టీసీ ఉడ్యోగిని కూడా తొలగించలేదు. ఆర్టీసీని నిర్వీర్యం చేసుకోవద్దు. సమ్మె విరమించి చర్చలకు రండి అని పొన్నం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంలో ఆర్టీసీ సమ్మె వెనుక మాజీ మంత్రి హరీష్‌రావు ప్రమేయం ఉందని ఆరోపించారాయన.

సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ అంటోంది. సమ్మె ప్రభావంతో ఆరు వేలకు పైగా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో అద్దె బస్సులు.. ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడిపించే ప్రయత్నాలు చేస్తోంది ఆర్టీసీ యాజమాన్యం.


