పారిశ్రామిక పెట్టుబడులకు హైదరాబాద్‌ అనుకూలం 

Telangana Minister KTR Meets Taiwanese Business Delegation - Sakshi

మంత్రి కేటీఆర్‌తో తైవాన్‌ వాణిజ్య ప్రతినిధుల బృందం భేటీ

సాక్షి, హైదరాబాద్‌: పారిశ్రామిక, వాణిజ్య పెట్టుబడులకు హైదరాబాద్‌ అత్యంత అనుకూలమని, తైవాన్‌ కంపెనీల కోసం తెలంగాణలో ప్రత్యేక పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీ రామారావు అన్నారు. తైపీ ఎకనమిక్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ బౌ షాన్‌ జెర్‌ నేతృత్వంలోని తైవాన్‌ వాణిజ్య ప్రతినిధుల బృందం శుక్రవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసింది.

ఈ సందర్భంగా వాణిజ్యం, ఆర్థిక సహకారం, పరస్పర సంస్కృతి కార్య క్రమాల మార్పిడి సహా అనేక అంశాల గురించి ఈ భేటీలో చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలను కేటీఆర్‌ తైవాన్‌ ప్రతినిధుల బృందానికి తెలిపారు. లైఫ్‌సైన్సెస్, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, ఆటో మొబైల్స్, డిఫెన్స్, ఏరోస్పేస్‌ రంగాలతోపాటు పలురంగాల్లో రాష్ట్రం పురోగమిస్తున్న తీరునుతెఇయజేశారు.

సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానం టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఎనిమిదేళ్లుగా సాధించిన పెట్టుబడులు, ఉపాధి కల్పన తదితరాలను తైవాన్‌ బృందానికి కేటీఆర్‌ వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వాణిజ్య రంగం స్థితిగతులను అధ్యయనం చేసేందుకు తైవాన్‌ బృందం రాష్ట్రానికి వచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ‘సాక్షి’కి వెల్లడించారు.

కాగా కేటీఆర్‌ను కలిసిన ప్రతినిధుల బృందంలో తైవాన్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ రిచర్డ్‌ లీతో పాటు తైవాన్‌కు చెందిన పలువురు వాణిజ్యవేత్తలున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ వారిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ భేటీలో రాష్ట్ర ఎలక్ట్రానిక్స్‌ విభాగం డైరెక్టర్‌ సుజయ్‌ కారంపూరి పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top