మునుగోడులో గోల్ కొట్టేదెవరు..? కాంగ్రెస్,టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు...

Telangana: Leaders all Set To Descend On Munugode ByElection - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడులో టికెట్‌ కోసం టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల్లో ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసూ్తనే ఉన్నారు. ఆ రెండు పార్టీలు సర్వేలు చేయిస్తున్నందున చివరికి టికెట్‌ ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. బీజేపీ అభ్యర్థి విషయంలో స్పష్టత ఉన్నా మిగతా రెండు ప్రధాన పార్టీల్లో ఎవరికి టికెట్‌ వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. మరోవైపు ఆయా పార్టీల్లో టికెట్‌ ఆశిస్తున్నవారు బయటికి కలిసి తిరుగుతున్నా అంతర్గతంగా అసమ్మతి కొనసాగుతూనే ఉంది. ఉప ఎన్నికల్లో టికెట్‌ తెచ్చుకోగలిగితే రాజకీయ ఎదుగుదలకు మార్గం మరింత సుగమం అవుతుందనే ఆలోచనతో పలువురు ఆశావహులు ఉన్నారు. ఇప్పుడు టికెట్‌ సంపాదిస్తే భవిష్యత్తులో ఎంతో ఉపయోగం ఉంటుందని, అధిష్టానం దృష్టిలో ఉంటామన్న ఆలోచనతో వేగంగా పావులు కదుపుతున్నారు.

అలకలు.. బుజ్జగింపులు 
టీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రాథమికంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డినే పోటీలో నిలిపే ఆలోచన చేసింది.  నియోజకవర్గంలోని పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా తమకు టికెట్‌ ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తులు పంపారు. మరోవైపు.. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తమను ఇబ్బందులపాలు చేశారని, ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దని ఇటీవల నియోజకవర్గంలోని మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు లేఖలు రాశారు. దీంతో అధిష్టానం ఆదేశాలతో మంత్రి జగదీశ్‌రెడ్డి రంగంలోకి దిగి నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులను హైదరాబాద్‌కు పిలిపించుకొని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. 

అధిష్టానం టికెట్‌ ఇచ్చిన వారికి సపోర్టు చేయాలని బుజ్జగించారు. అప్పుడు సరేనన్న నేతలు కొంతమంది ఆ తరువాత రెండు రోజులకే మల్కాపూర్‌లో సమావేశమై కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దని తీర్మానం చేశారు. దీంతో టీఆర్‌ఎస్‌లో అసమ్మతి పూర్తిగా చల్లారలేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో అధిష్టానం చేయిస్తున్న సర్వేల ఆధారంగానే అభ్యర్థిని ప్రకటించనుంది. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను మరోసారి ముమ్మరం చేశారు. తమ గాడ్‌ ఫాదర్‌లను ఆశ్రయిస్తున్నారు. కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే కర్నాటి విద్యాసాగర్, మంత్రి జగదీశ్‌రెడ్డికి సన్నిహితంగా ఉండే నారబోయిన రవి, బొల్లా శివకుమార్, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సన్నిహితంగా ఉండే డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డే!
మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్‌ రెడ్డి ఖరారయ్యే అవకాశం ఉంది. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన ఈ నెల 21న అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. దీంతో ఆయనే బీజేపీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. పైగా బీజేపీలో ఇంతవరకు తమకు టికెట్‌ కావాలని ఎవరూ అడిగిన దాఖలాలు కూడా లేవు. 

కాంగ్రెస్‌లోనూ అదే పరిస్థితి..
కాంగ్రెస్‌ పార్టీలోనూ టికెట్‌ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పాల్వాయి స్రవంతితోపాటు పున్న కైలాస్‌నేత, డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చలమల్ల కృష్ణారెడ్డికి టికెట్‌ ఇస్తారన్న ప్రచారం సాగడంతో.. ముందునుంచి పార్టీలో ఉన్న వారికే టికెట్‌ ఇవ్వాలని నియోజకవర్గ నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top