ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌గా రాష్ట్రం

Telangana: KTR Inaugurates ITCs Food Processing Unit Worth Rs 450 Crore - Sakshi

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ 

దండుపల్లిలో ఐటీసీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీని ప్రారంభించిన మంత్రి  

స్థానికులకు ఉపాధి, రైతులకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచన  

తూప్రాన్, మనోహరాబాద్‌(తూప్రాన్‌): దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌గా ఆవిర్భవిస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం దండుపల్లిలో రూ.450 కోట్ల పెట్టుబడితో 59 ఎకరాల్లో ఐటీసీ సంస్థ నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫెసిలిటీని పరిశ్రమ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌పూరితో కలసి కేటీఆర్‌ ప్రారంభించారు.

అనంతరం పరిశ్రమలో తయారు చేసిన ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో ఇంత పెద్ద పరిశ్రమ రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కంపెనీ భవిష్యత్‌లో మరో రూ.350 కోట్లు వెచ్చించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనుందన్నారు. పరిశ్రమ యాజమాన్యం స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు కంపెనీలో తయారు చేసే చిప్స్, బిస్కెట్ల కోసం ఆలుగడ్డలు, గోధుమలను ఇక్కడే కొనుగోలు చేయాలన్నారు. ఇందుకోసం స్థానిక రైతులను ప్రోత్సహించాలని కోరారు. అప్పుడే రైతులు ఆర్థికంగా ఎదుగుతారన్నారు.  

కాళేశ్వరం ద్వారా 10 టీఎంసీల నీరు.. 
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో ఒకటైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తక్కువ సమయంలో పూర్తి చేసి నీటి వనరుల్లో విప్లవం సాధించామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. దీనితో సాగునీరు, తాగునీటికి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ద్వారా పరిశ్రమలకు 10 టీఎంసీల నీటిని అందిస్తున్నామని తెలిపారు. అలాగే మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్న ఘనత తెలంగాణకే దక్కుతుందని, మిషన్‌ కాకతీయ ద్వా రా 46 వేల చెరువులను బాగు చేశామని వివరించారు. పాడిపంటలతోనే రాష్ట్రం సుభిక్షం అవుతుందని, అందుకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు.  

20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌: పాడి అభివృద్ధికి కృషి చేయడంతో పాటు విజయ డెయిరీ ద్వారా పాల ఉత్పత్తులను కూడా పెంపొందిస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌ కోసం ప్రత్యేకంగా సెజ్‌ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందేనని అన్నారు. రాష్ట్రంలో విస్తృతంగా ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నామని, వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేయడం ద్వారా ఇతర దేశాల నుంచి వంట నూనెల దిగుమతిని తగ్గించడానికి చర్యలు చేపట్టామని వివరించారు.

ఇక్కడ ఏర్పాటు అవుతున్న పరిశ్రమలకు స్థానికులు, నాయకులు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ హేమలతాశేఖర్‌ గౌడ్, సర్పంచ్‌ మహిపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top