ఐటీ కంపెనీల వ‌ర్క్ ఫ్రం హోంపై తెలంగాణ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

Telangana IT Principal Secretary Tells Techies To Return To Office - Sakshi

ఐటీ కంపెనీల‌తో జ‌యేశ్ రంజ‌న్ భేటీ

హైదరాబాద్: దేశంలో క‌రోనా విజృంభ‌ణ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఐటీ సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం సౌక‌ర్యాన్ని క‌ల్పించిన విష‌యం తెలిసిందే. క‌రోనా పూర్తిగా త‌గ్గేవ‌ర‌కు వారు ఇంటి నుంచే ప‌ని చేసుకోవచ్చ‌ని ఆయా సంస్థ‌లు ప‌లుసార్లు ప్ర‌క‌టించాయి. ఇప్ప‌ట్లో పూర్తి స్థాయిలో కార్యాల‌యాల‌ను తెర‌వ‌డానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా లేవు. ఉద్యోగుల ర‌క్ష‌ణే త‌మకు ముఖ్య‌మని అంటున్నాయి. అయితే, వ‌ర్క్ ఫ్రం హోం వ‌ద్ద‌ని, ఉద్యోగుల‌ను క్ర‌మంగా కార్యాల‌యాల‌కు పిలిపించాల‌ని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్ ఆయా కంపెనీల‌ను కోరారు. తాజాగా, ఆయా కంపెనీల ప్ర‌తినిధుల‌తో నిర్వ‌హించిన ఓ స‌మావేశంలో ఆయ‌న ప‌లు సూచ‌న‌లు చేశారు. 

ప్ర‌భుత్వ కార్యాల‌యాల నుంచి కూడా 100 శాతం మంది ఉద్యోగులు ప‌ని చేసేలా చూస్తున్నామ‌ని ఆయ‌న చెప్పిన‌ట్లు తెలిసింది. ఐటీ కంపెనీల‌న్నీ 100 శాతం మంది ఉద్యోగుల‌ను కార్యాల‌యాల నుంచే ప‌నిచేసేలా చూడాల‌ని ఈ సంద‌ర్భంగా తెలంగాణ స‌ర్కారు సూచించింది. ఈ మేర‌కు సెప్టెంబ‌రు 1 నుంచే కార్యాల‌యాల‌ నుంచే ఉద్యోగుల‌తో ప‌నులు చేయించేలా చూడాల‌ని చెప్పింది. ఇందుకు ఐటీ సంస్థ‌లు అన్ని ఏర్పాట్లు చేసుకోవాల‌ని కోరింది. అయితే, ప్ర‌భుత్వ సూచ‌న ప‌ట్ల ప‌లు ఐటీ సంస్థ‌లు విముఖ‌త వ్య‌క్తం చేశాయి. వ‌ర్క్‌-ఫ్రం-హోం వ‌ల్ల త‌మ ఉద్యోగులు మ‌రింత మెరుగ్గా ప‌నిచేస్తున్నార‌ని చెప్పాయి. 

గూగుల్, కాగ్నిజెంట్ వంటి పెద్ద కంపెనీలు కూడా అక్టోబ‌రు వ‌ర‌కు వ‌ర్క్-ఫ్రం-హోం ఇస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయ‌ని ప‌లు కంపెనీల ప్ర‌తినిధులు గుర్తు చేశారు. వ‌ర్క్ ఫ్రం హోం వ‌ల్ల ఔట్ పుట్ ఎక్కువ‌గా వ‌స్తోంద‌ని చెప్పారు. దేశంలో మూడో ద‌శ క‌రోనా విజృంభ‌ణ త‌ప్ప‌ద‌ని ప‌లువురు నిపుణులు హెచ్చ‌రించిన అంశాన్ని కూడా ఆయా కంపెనీల ప్రతినిధులు జ‌యేశ్ రంజ‌న్‌కు గుర్తు చేశారు. దీంతో ఉద్యోగుల‌కు వైర‌స్ సోకకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, ఐటీ ఉద్యోగులంద‌రి కోసం స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించి వ్యాక్సిన్లు వేస్తామ‌ని జ‌యేశ్ రంజ‌న్ చెప్పారు. అంతేగాక‌, ఆయా కంపెనీల వెలుప‌ల క‌రోనా ప‌రీక్ష‌ల కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. 

అయిన‌ప్ప‌టికీ ఆయా ఐటీ కంపెలు త‌మ ఉద్యోగులను రిస్క్‌లో పెట్టలేమ‌ని తేల్చి చెప్పాయి. దీంతో ఈ అంశంపై ఐటీ శాఖ ఉన్న‌తాధికారులు, ఐటీ కంపెనీల ప్ర‌తినిధుల‌తో ప్ర‌భుత్వం ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది. కార్యాల‌యాల్లో ఉద్యోగుల‌తో విధులు నిర్వ‌హించేలా చేయ‌డం, అందుకు త‌గ్గ విధివిధానాల‌ను ఖ‌రారు చేయ‌డం వంటి అంశాల‌పై ఈ క‌మిటీ నివేదిక అందించ‌నుంది. కొన్ని రోజుల్లో ఈ క‌మిటీ స‌మావేశం కానుంది. ఐటీ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం ఇవ్వ‌డం వ‌ల్ల ఐటీ కంపెనీలు, ఆ సంస్థ‌ల ఉద్యోగుల‌కు మేలు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ వారి మీద ప‌రోక్షంగా ఆధార‌ప‌డి వ్యాపారాలు చేసుకుంటోన్న వారికి మాత్రం న‌ష్టాలు వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. అంటే రియ‌ల్ ఎస్టేట్, ట్రాన్స్‌పోర్ట్, ఆతిథ్య రంగాల వంటి  వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐటీపై ఇత‌ర రంగాలు ఆధార‌ప‌డ‌డంతో ప్ర‌భుత్వం ఆ సంస్థ‌ల ఉద్యోగుల‌ను కార్యాల‌యాల నుంచే ప‌నిచేసుకోనివ్వాల‌ని భావిస్తోంది. దీనిపై ఏర్పాటు చేసిన క‌మిటీ ఆగ‌స్టు మొద‌టి వారంలో తుది నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top