IT Secretary Ranjan jayes
-
వర్క్ ఫ్రం హోంపై తెలంగాణ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: దేశంలో కరోనా విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. కరోనా పూర్తిగా తగ్గేవరకు వారు ఇంటి నుంచే పని చేసుకోవచ్చని ఆయా సంస్థలు పలుసార్లు ప్రకటించాయి. ఇప్పట్లో పూర్తి స్థాయిలో కార్యాలయాలను తెరవడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా లేవు. ఉద్యోగుల రక్షణే తమకు ముఖ్యమని అంటున్నాయి. అయితే, వర్క్ ఫ్రం హోం వద్దని, ఉద్యోగులను క్రమంగా కార్యాలయాలకు పిలిపించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆయా కంపెనీలను కోరారు. తాజాగా, ఆయా కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి కూడా 100 శాతం మంది ఉద్యోగులు పని చేసేలా చూస్తున్నామని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఐటీ కంపెనీలన్నీ 100 శాతం మంది ఉద్యోగులను కార్యాలయాల నుంచే పనిచేసేలా చూడాలని ఈ సందర్భంగా తెలంగాణ సర్కారు సూచించింది. ఈ మేరకు సెప్టెంబరు 1 నుంచే కార్యాలయాల నుంచే ఉద్యోగులతో పనులు చేయించేలా చూడాలని చెప్పింది. ఇందుకు ఐటీ సంస్థలు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. అయితే, ప్రభుత్వ సూచన పట్ల పలు ఐటీ సంస్థలు విముఖత వ్యక్తం చేశాయి. వర్క్-ఫ్రం-హోం వల్ల తమ ఉద్యోగులు మరింత మెరుగ్గా పనిచేస్తున్నారని చెప్పాయి. గూగుల్, కాగ్నిజెంట్ వంటి పెద్ద కంపెనీలు కూడా అక్టోబరు వరకు వర్క్-ఫ్రం-హోం ఇస్తామని ఇప్పటికే ప్రకటించాయని పలు కంపెనీల ప్రతినిధులు గుర్తు చేశారు. వర్క్ ఫ్రం హోం వల్ల ఔట్ పుట్ ఎక్కువగా వస్తోందని చెప్పారు. దేశంలో మూడో దశ కరోనా విజృంభణ తప్పదని పలువురు నిపుణులు హెచ్చరించిన అంశాన్ని కూడా ఆయా కంపెనీల ప్రతినిధులు జయేశ్ రంజన్‌కు గుర్తు చేశారు. దీంతో ఉద్యోగులకు వైరస్ సోకకుండా చర్యలు తీసుకుంటామని, ఐటీ ఉద్యోగులందరి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వ్యాక్సిన్లు వేస్తామని జయేశ్ రంజన్ చెప్పారు. అంతేగాక, ఆయా కంపెనీల వెలుపల కరోనా పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఆయా ఐటీ కంపెలు తమ ఉద్యోగులను రిస్క్‌లో పెట్టలేమని తేల్చి చెప్పాయి. దీంతో ఈ అంశంపై ఐటీ శాఖ ఉన్నతాధికారులు, ఐటీ కంపెనీల ప్రతినిధులతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కార్యాలయాల్లో ఉద్యోగులతో విధులు నిర్వహించేలా చేయడం, అందుకు తగ్గ విధివిధానాలను ఖరారు చేయడం వంటి అంశాలపై ఈ కమిటీ నివేదిక అందించనుంది. కొన్ని రోజుల్లో ఈ కమిటీ సమావేశం కానుంది. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వడం వల్ల ఐటీ కంపెనీలు, ఆ సంస్థల ఉద్యోగులకు మేలు జరుగుతున్నప్పటికీ వారి మీద పరోక్షంగా ఆధారపడి వ్యాపారాలు చేసుకుంటోన్న వారికి మాత్రం నష్టాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అంటే రియల్ ఎస్టేట్, ట్రాన్స్పోర్ట్, ఆతిథ్య రంగాల వంటి వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐటీపై ఇతర రంగాలు ఆధారపడడంతో ప్రభుత్వం ఆ సంస్థల ఉద్యోగులను కార్యాలయాల నుంచే పనిచేసుకోనివ్వాలని భావిస్తోంది. దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ ఆగస్టు మొదటి వారంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
ఇక జిల్లాల్లో మినీ ఐటీ హబ్‌లు..
♦ కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మంలో ఏర్పాటు ♦ ముందుకొచ్చే కంపెనీలకు రాయితీలు ♦ హైదరాబాద్‌కు మరో 20 ఐటీ సంస్థలు ♦ తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగరికి పరిమితమైన ఐటీ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం జిల్లాలకూ విస్తరిస్తోంది. దీనికోసం నూతన ఐటీ విధాన ముసాయిదాను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మంలో మినీ ఐటీ హబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ హబ్‌లలో కార్యాలయాలను నెలకొల్పే కంపెనీలకు ప్రోత్సాహకాలతోపాటు అదనపు ప్రయోజనాలు కల్పిస్తామని ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ శుక్రవారం తెలిపారు. హైసియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ హబ్‌లలో మౌలిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు. ‘డేటా అనలిటిక్స్ రంగ కంపెనీలకు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు అనువైనవి. తక్కువ ఖర్చుతో కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవచ్చు. కొన్ని స్థాయిల వరకు సాధారణ నైపుణ్యం ఉన్న ఉద్యోగులు సరిపోతారు’ అని అన్నారు. నూతన ఐటీ పాలసీని జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ప్రకటిస్తామన్నారు. మరో 20 ఐటీ సంస్థలు.. హైదరాబాద్‌లో కార్యాలయాలను స్థాపించేం దుకు దేశ, విదేశాలకు చెందిన 20 కంపెనీల దాకా ఆసక్తిగా ఉన్నాయని జయేశ్ తెలిపారు. ఏడాదిలో ఇవి ఏర్పాటు అవుతాయన్నారు. ఈ కంపెనీలే తమ ప్రణాళికను త్వరలో వెల్లడిస్తాయని, చర్చలు పురోగతి దశలో ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్న ప్రతిపాదిత భారీ క్యాంపస్ కోసం గూగుల్‌కు స్థలం బదలాయించామని చెప్పారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఈ క్యాంపస్ కోసం భూమి పూజ జరిగే అవకాశం ఉందన్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకలు..: సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎం టర్ప్రైసెస్ అసోసియేషన్(హైసియా) 15 మంది సభ్యులతో 1991లో ప్రారంభమైంది. రాష్ట్ర జీడీపీకి హైసియా సభ్య కంపెనీలు సుమారు రూ. 70,000 కోట్లు సమకూరుస్తున్నాయని టెక్ మహీంద్రా బీపీవో సీఈవో విజయ్ రంగినేని తెలి పారు. ప్రత్యక్షంగా 4 లక్షలు, పరోక్షంగా 10 లక్షల మంది ఐటీ రంగంలో ఉపాధి పొందుతున్నారని చెప్పారు. 4 లక్షల మందిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 60% ఉంటారని హైసియా ప్రెసిడెంట్ రమేశ్ లోగనాథన్ పేర్కొన్నారు. భారత్‌పై తీవ్ర ప్రభావం.. యూఎస్ ప్రభుత్వం హెచ్1బీ, ఎల్1 వీసా ఫీజుల పెంపు ప్రభావం భారత్‌పై తీవ్రంగా ఉంటుందని సైయంట్ ఫౌండర్, నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి అన్నా రు. ‘భారత ఐటీ కంపెనీలతో యూ ఎస్ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రయోజనం కలిగింది. ఇక్కడి కంపెనీలను ఇబ్బందులకు గురిచేసే చర్యలు అంత శ్రేయస్కరం కాదు. యూఎస్‌లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో నిపుణుల కొరత ఇంకా ఉంది’ అని చెప్పారు.