వక్ఫ్‌బోర్డు సీఈవోపై హైకోర్టు ఆగ్రహం

Telangana High Court Serious On Wakf Board CEO - Sakshi

సీఈవో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ మండిపాటు 

ఆయనపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: వక్ఫ్‌బోర్డు ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నా చట్టపరంగా సరైన చర్యలు చేపట్టడం లేదంటూ బోర్డు సీఈవో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ జంటనగరాల పరిధిలో 86 ముస్లిం శ్మశానాలను కబ్జాదారులు ఆక్రమించారని తేలినా.. కేవలం 5 చోట్ల మాత్రమే కేసులు నమోదు చేయించడం ఏమిటని నిలదీసింది. వక్ఫ్‌ ఆస్తులను కాపాడటంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన సీఈవోను ఇంటికి పంపడమే మేలంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. సీఈవోపై వెంటనే తగిన చర్యలు చేపట్టాలని మైనారిటీ వెల్ఫేర్‌ శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జంటనగరాలలోని ముస్లింల శ్మశానాలు ఆక్రమణకు గురవుతున్నాయని,  అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా వక్ఫ్‌బోర్డు చర్యలు చేపట్టడం లేదని నగరానికి చెందిన సామాజిక కార్యకర్త మహ్మద్‌ ఇలియాస్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం  విచారించింది. (చదవండి: మెరూన్‌ పాస్‌బుక్‌ ఇవ్వకండి)

ఈ సందర్భంగా వక్ఫ్‌బోర్డు సీఈవో మహ్మద్‌ కాసీం విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఆక్రమణలపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులకు లేఖలు రాశామని కాసీం వివరించారు. అయితే ఇది సివిల్‌ వివాదమని, కేసులు నమోదు చేయలేమంటూ వారు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారని తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేయకపోతే జిల్లా ఎస్పీని ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించింది. అక్కడా కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇవ్వకపోతే నేరుగా న్యాయస్థానం ముందు ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసుకునే అవకాశం ఉన్నా ఎందుకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదంటూ మండిపడింది. తనకు సీఆర్‌పీసీ గురించి తెలియదని కాసీం వ్యాఖ్యానించడంపై ధర్మాసనం స్పందిస్తూ ఇంత చేతగానీ సీఈవో ఉంటే వక్ఫ్‌బోర్డు ఆస్తులకు రక్షణ ఎక్కడ ఉందంటూ అసహనం వ్యక్తం చేసింది. అక్రమణదారులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, 18 ఏళ్లు గడిచినా వాటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. అక్రమార్కులపై వెంటనే చట్టపరంగా తగిన చర్యలు చేపట్టాలని మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలను వివరిస్తూ మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top