
తరాలు మారుతున్నా మున్సిపల్ అధికారులు పని తీరు మాత్రం మారడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేయడమేగానీ, సమస్యను వెంటనే పరిష్కరిద్దాం అనే ఆలోచన చేయరని తప్పుబట్టింది. ఇంకా ఎన్నాళ్లు ఇలా వ్యవహరిస్తారో అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని ఆదేశి స్తూ.. విచారణ వాయిదా వేసింది.
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ తాలూకా ఖానామెట్‌లోని తమ భూమిలో రాయపాటి ప్రతిభ, రాయపాటి శ్రీహర్ష, జీబీ ప్రసాద్ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ సయ్యద్ రహీమున్నిసా సహా మరో ఏడుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘నోటీసులిస్తారు కూల్చి వేతలు ఉండవు. వచ్చే సోమవారం నుంచి ప్రతీ వారం చేపట్టిన కూల్చివేతల వివరాలు కోర్టు ముందు ఉంచేలా స్టాండింగ్ కౌన్సెళ్లకు ఆదేశాలిస్తా.
అనధికారిక నిర్మాణాలకు, నగర విధ్వంసానికి ఈ స్టాండింగ్ కౌన్సెళ్లు, అధికారులే బాధ్యులు. ఎవరికి వారు మా పని మేం చేశామంటూ చేతులు దులుపుకుంటున్నారు. స్పీకింగ్ ఆర్డర్ జారీ చేశామని స్టాండింగ్ కౌన్సెళ్లు.. ఉత్తర్వులిచ్చాం, టాస్‌ఫోర్స్‌కు బదిలీ చేశామని జీహెచ్‌ఎంసీ కమిషనర్.. ఈ లేఖను పోలీసులకు అందజేశామని టాస్‌ఫోర్స్.. శాంతిభద్రతల్లో తలమునకలై మేం ఆ పనిని వాయిదా వేశామని పోలీసులు.. ఇలా ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి అధికారులు, స్టాండింగ్ కౌన్సెళ్ల పేర్లు రాత్రి పూట కూడా స్పష్టంగా కనిపించేలా ట్యాంక్‌బండ్ నెక్లెస్ రోడ్‌పై విద్యుత్ దీపాలతో పోస్టర్లు వేయించాలి’అని అసహనం వ్యక్తంచేశారు.