గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు విద్యార్థి స్థానికతే కీలకం..వారికే సగం సీట్లు

Telangana Gurukul 50 Percent Seats For Local Students - Sakshi

50 శాతం సీట్లు స్థానిక విద్యార్థులతోనే భర్తీ 

అసెంబ్లీ సెగ్మెంట్‌ యూనిట్‌గా స్థానికత

జిల్లా యూనిట్‌గా మిగతా సీట్ల భర్తీకి ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు విద్యార్థి స్థానికతే కీలకం కానుంది. రెండు కేటగిరీల్లో స్థానికతను విశదీకరిస్తూ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. శాసనసభ నియోజకవర్గం యూనిట్‌గా స్థానికతను గుర్తించి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాత జిల్లా యూనిట్‌గా స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. 2022–23 విద్యాసంవత్సరానికి సంబం ధించిన ప్రవేశాల ప్రక్రియను స్థానికత ఆధారంగానే నిర్వహించాలని గురుకుల విద్యా సంస్థలు నిర్ణయించాయి. ప్రతి గురుకుల పాఠశాలలో 50 శాతం సీట్లను అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని స్థానిక విద్యార్థులకే కేటాయించనున్నారు.

నాలుగు సొసైటీల్లో అడ్మిషన్లకు ఒకే పరీక్ష.. 
గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా అర్హత పరీక్ష ఉంటుంది. మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీలు కలసి ఐదోతరగతిలో ప్రవేశాలకు ఉమ్మడిగా వీటీజీసెట్‌ నిర్వహిస్తున్నాయి.

పరీక్ష ఉమ్మడిగా నిర్వహించినప్పటికీ విద్యార్థులను కేటగిరీలుగా విభజించి ప్రవేశాలు కల్పిస్తున్నారు. కాగా, తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ మాత్రం ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించి సీట్లను భర్తీ చేస్తోంది.  నియోజకవర్గం, జిల్లా యూనిట్ల ఆధారంగా సీట్లు భర్తీ చేసినా.. ఇంకా మిగిలితే అప్పుడు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు. 

వచ్చే వారం ఫలితాలు? 
నాలుగు గురుకుల సొసైటీల్లో ఐదోతరగతిలో ప్రవేశాలకు మే 8న వీటీజీసెట్‌–2022 అర్హత పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు వచ్చే వారం వెలువడే అవకాశం ఉన్నట్లు సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. ఫలితాలు ప్రకటించిన వెంటనే అర్హత సాధించిన విద్యార్థులకు సంబంధిత పాఠశాలల్లో సీట్లు కేటాయిస్తారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top