సులభతర వాణిజ్యం ర్యాంకులెప్పుడు? 

Telangana Govt Waiting Two Years For Rank Announcement By Central Govt - Sakshi

రెండేళ్లుగా ర్యాంకులు ప్రకటించని కేంద్రం 

2019లో 3వ స్థానంలో తెలంగాణ 

పెట్టుబడుల ఆకర్షణలో కీలకమవుతున్న ర్యాంకులు 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం ప్రభుత్వం ప్రకటించే సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ) ర్యాంకుల కోసం రాష్ట్రాలు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల పాలన తీరుకు అద్దం పట్టే ఈ ర్యాంకులు పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలోనూ కీలకమవుతున్నాయి. ఈఓడీబీ ర్యాంకుల్లో ఒక్కసారి మినహా ప్రతిసారి తొలి మూడు స్థానాల్లో నిలిచిన తెలంగాణ కూడా ఈ ర్యాంకులు ఎప్పుడు వస్తాయోనని చూస్తోంది.

ఏడాదవుతున్నా కొలిక్కిరాని మదింపు ప్రక్రియ 
కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉన్న పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) 2015 నుంచి ఈఓడీబీ ర్యాంకులను ప్రకటిస్తూ వస్తోంది.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే పాలన సంస్కరణల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. ర్యాంకుల ప్రకటనలో కేంద్రం సూచించే బిజినెస్‌ రిఫారŠమ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ (బీఆర్‌ఏపీ) పాయింట్లు కీలకంగా మారుతున్నాయి. 2015 ఈఓడీబీ ర్యాంకుల్లో 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ 2016లో ఆంధ్రప్రదేశ్‌తో కలిసి మొదటి స్థానంలో, 2018లో రెండు, 2019లో మూడో స్థానంలో నిలిచింది.

2017లో కేంద్రం ఈఓడీబీ ర్యాంకులను ప్రకటించలేదు. 2020 ఈఓడీబీ ర్యాంకులకు సంబంధించి డీపీఐఐటీ 301 బీఆర్‌ఏపీ సంస్కరణలను సూచించి గతేడాది సెప్టెంబర్‌ను గడువుగా నిర్దేశించింది. డీపీఐఐటీ సూచించిన సంస్కరణలను అమలు చేసిన ప్రభుత్వం అందుకు అవసరమైన పత్రాలనూ డీపీఐఐటీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. వివిధ రాష్ట్రాల సంస్కరణల వివరాలను పరిశీలించి, సంబంధిత వర్గాల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని వాటన్నింటినీ డీపీఐఐటీ మదింపు చేస్తుంది. 2020 ఈఓడీబీ ర్యాంకులకు సంబంధించి వివరాలు సమర్పించి ఏడాదవుతున్నా ఈ మదింపు ప్రక్రియ కొలిక్కి రావట్లేదు.

మెరుగైన స్థానం వస్తుందనే ఆశతో తెలంగాణ 
ఈఓడీబీ ర్యాంకుల్లో 2015 మినహా మిగతా అన్ని సందర్భాల్లో రాష్ట్రం తొలి మూడు స్థానాల్లో నిలుస్తూ వస్తోంది. 2019 ర్యాంకింగులో ఉత్తరప్రదేశ్‌ రెండో స్థానం, తెలంగాణ మూడో స్థానంలో నిలిచాయి. దీంతో మదింపు ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని తెలంగాణ అసంతృప్తి వ్యక్తం చేసింది. 2020లో సూచించిన 301 సంస్కరణలను నిర్దేశిత గడువులోగా అమలు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీఆర్‌ఏపీ సంస్కరణలపై సంబంధిత వర్గాలు సానుకూలంగా స్పందించాయని సమాచారం తమకు అందినట్లు అధికారులు వెల్లడించారు. ఈఓడీబీ సంస్కరణలు ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగు పరుచుకునేందుకు ఓ అవకాశంగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. 2020 ర్యాంకుల్లో రాష్ట్రం మెరుగైన ర్యాంకు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top