తెలంగాణ: భద్రాచలం వద్ద తగ్గిన నీటిమట్టం.. మిగతా చోట్ల వరద ఉధృతి

Telangana Floods Update: Badrachalam Godavari reach Normal Level - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 48 అడుగులకు చేరింది.  ఎగువ నుంచి గోదావరిలోకి వస్తున్న 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఇప్పుడిప్పుడే ముంపునకు గురైన  కాలనీలలో సాధారణ పరిస్థితిలు కనిపిస్తున్నాయి. దీంతో శానిటేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. 

వరదలతో సర్వం కోల్పోయిన భద్రాచలం స్థానికులు.. భరించలేని దుర్వాసనతో ఇళ్లలో ఉండలేకపోతున్నారు. ఒక పక్క సిబ్బంది.. మరోవైపు ప్రజలూ మాస్కులు ధరించి రంగంలోకి దిగారు. ఇంకోపక్క గోదావరి వరద లతో విద్యుత్‌ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. భద్రాచలం, పినపాక నియోజక వర్గాల్లోని  ఏడు మండలాల్లో 630కి పైగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బ తిన్నాయి. వారం రోజుల పాటు వరద నీటిలోనే ఉండిపోయింది పర్ణశాల సబ్‌స్టేషన్‌. సమారు 16 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారుల అంచనా వేస్తున్నారు. అలాగే 143 గ్రామాల్లో 5,620 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 

సహాయక చర్యలు..
భద్రాచలం వరదలు తగ్గుముఖం పట్టాక వేగంగా వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇతర జిల్లాలో నుంచి వచ్చి విధుల్లో చేరిన 4,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనులు చేస్తున్నారు. శిల్పినగర్, విస్తా కాంప్లెక్స్‌తోపాటు ఆలయ ఉత్తర ద్వారం వైపునకు వస్తున్న భద్రాచలం కరకట్ట వద్ద ఉన్న స్లూయిస్‌ల ద్వారా నీరు లీకవుతోంది. దీంతో.. ఇరిగేషన్‌ శాఖ ఏర్పాటు చేసిన ఐదు మోటార్లకు అదనంగా మరో 15 మోటర్లు తెప్పించించింది సింగరేణి. మొత్తం 20 మోటార్ల ద్వారా వరదనీటిని తోడి తిరిగి గోదావరిలోకి ఎత్తిపోసే ప్రక్రియ నడుస్తోంది.

ఉన్నతాధికారిపై వేటు

భద్రాచలం డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ డా. కె. రాజ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. గోదావరి వరదల సమయంలో హెడ్ క్వార్టర్‌లో లేకుండా, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పోవడం సర్కార్ దృష్టికి వెళ్లింది. దీంతో రాజ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి వరదనీరు పొటెత్తింది.  డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా.. ప్రస్తుతం 402.40 అడుగులు చేరింది. ఇన్ ఫ్లో 4వేల క్యూసెక్కులు కాగా  4 గేట్లు ఎత్తి 18వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.

నిజామాబాద్ జిల్లా: శ్రీరాంసాగర్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లోస్ 59 వేల క్యూసెక్కులుగా ఉంది. పద్దెనిమిది  గేట్లెత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. మొత్తం  90 టీఎంసీలకుగాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 77 టీఎంసీలు.. 1091 అడుగులకుగాను.. నీటిమట్టం 1088 అడుగులుగా ఉంది.

భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం వద్ద 12.600 మీటర్ల ఎత్తులో క్రమంగా పెరుగుతూ  ప్రవహిస్తోంది గోదావరి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్  లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి 10,71,720 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 10,71,720 క్యూసెక్కులుగా ఉంది. లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసిలు. అన్నారం సరస్వతీ బ్యారేజ్ సరస్వతీ బ్యారేజ్ మొత్తం 66 గేట్లు ఎత్తి 1,46,,353 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 1,46,353 క్యూసెక్కులు గా ఉంది. సరస్వతీ బ్యారేజ్ పూర్తి నీటి సామర్ధ్యం 10.87 టీఎంసిలు.. ప్రస్తుత నీటి సామర్ధ్యం 0.33 టిఎంసిలుగా ఉంది.

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు  కొనసాగుతున్న వరద. ఇన్ ఫ్లో : 29,365 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో: 4,138 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 312.0450 టిఎంసీ లు, ప్రస్తుత నీటి నిలువ: 173.6640 టిఎంసి లు. పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం: 532.80 అడుగులు,

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top