బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలతో ఇద్దరు మృతి!

Telangana: Covid Recovered Patients Black Fungus Cases Nirmal - Sakshi

నిర్మల్‌ జిల్లా భైంసా డివిజన్‌లో ఘటన 

గాంధీ ఆస్పత్రిలో 3 కేసుల నిర్ధారణ 

సాక్షి, గాంధీ ఆస్పత్రి/ భైంసా/భైంసా టౌన్‌ (ముథోల్‌): కరోనా నుంచి కోలుకున్న తర్వాత, కరోనా చికిత్స పొందుతున్న కొందరిలో బ్లాక్‌ ఫంగస్‌ సోకుతున్నట్లు వైద్యులు గుర్తిస్తున్నారు. తాజాగా నిర్మల్‌ జిల్లా భైంసా డివిజన్‌లో ఈ ఫంగస్‌ సోకి ఇద్దరు చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్‌ ఫంగస్‌ తీవ్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. అలాగే కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో మూడు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదైనట్లు తెలిసింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు కూడా వేరే ఆస్పత్రులు, ప్రాంతాల నుంచి రిఫరల్‌పై వచ్చారని తెలిసింది. ఫంగస్‌ సోకిన ముగ్గురికి చికిత్స అందిస్తున్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు స్పష్టం చేశారు. బ్లాక్‌ ఫంగస్‌ సాధారణ వ్యాధేనని, కరోనా మొదటి వేవ్‌లో కూడా పలువురు బ్లాక్‌ ఫంగస్‌ బారినపడ్డారని గుర్తుచేశారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, కరోనా రోగులు, కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు, స్టెరాయిడ్‌ మందులు వినియోగించేవారిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వారికి బ్లాక్‌ ఫంగస్‌ సోకుతుంది.  

ఇద్దరి మృతిపై అనుమానాలు..? 
భైంసా డివిజన్‌లో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలతో ఇద్దరు మృతి చెందారన్న అనుమానాలు స్థానికులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. భైంసా మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి, కుభీర్‌ మండల కేంద్రానికి చెందిన మరో వ్యక్తి బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలతోనే మృతి చెందారని అనుమానిస్తున్నారు. స్థానికంగా ఉండే మరో వ్యక్తి, కుభీర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఇవే లక్షణాలతోనే హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కంటి చూపు కోల్పోవడం, ముక్కులో ఇన్ఫెక్షన్‌ తదితర లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు బ్లాక్‌ ఫంగస్‌తో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించలేదు. భైంసా డివిజన్‌.. మహారాష్ట్రకు సరిహద్దున ఉండటం, ఇదే రకం కేసులతో అక్కడ చాలామంది మృతి చెందినట్లు తెలిసింది. 

లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయొద్దు.. 
కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొందరిలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కన్పిస్తున్నాయి. కోవిడ్‌ బారిన పడి కోలుకున్న మధుమేహం బాధితులు, క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నవారు ఈ ఫంగస్‌ బారిన పడుతున్నారు. భైంసా డివిజన్‌లో ఈ లక్షణాలతోనే ఇద్దరు మృతి చెందినట్లు తెలిసింది. అలాగే భైంసా డివిజన్‌కు చెందిన మరో ఇద్దరు ఇవే లక్షణాలతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఈ ఫంగస్‌ బారిన పడినవారు వెంటనే ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం చేస్తే కంటిచూపుతో పాటు కోలుకునే అవకాశాలు తక్కువ. అందుకే కరోనా నుంచి కోలుకున్న తరువాత ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 
– కాశీనాథ్, ఏరియాస్పత్రి సూపరింటెండెంట్, భైంసా 

బ్లాక్‌ ఫంగస్‌ ఏంటి?
బ్లాక్‌ ఫంగస్‌, ‘మ్యూకోర్‌మైకోసిస్‌’గా పిలిచే ఈ వ్యాధి కొత్తదేం కాదు. గతంలో కూడా ఉంది. కానీ తాజాగా కోవిడ్‌ సోకిన వారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వాతావరణంలో సహజంగానే ఉండే ‘మ్యూకోర్‌’ అనే ఫంగస్‌ వల్ల ఇది వస్తుంది. అరుదుగా మనుషులకు సోకుతుంటుంది. ముఖ్యంగా కరోనా సోకిన వారిలో, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో అధిక మొత్తంలో స్టెరాయిడ్స్‌ వినియోగించిన వారికి ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉంది. గాలి పీల్చుకొన్నప్పుడు ఈ ఫంగస్‌ ఊపిరితిత్తుల్లో, సైనస్‌ వద్ద చేరుతుంది. ఇది మెదడుకు చేరితో ప్రాణాపాయం తప్పదు అంటున్నారు నిపుణులు. 

బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని గుర్తించడం ఎలా...
బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారిలో చాలా వరకు కోవిడ్‌-19 లక్షణాలే కనిపిస్తాయి. ఒళ్లునొప్పులు, కళ్లు, ముక్కుచుట్టూ ఎర్రబారిపోవడం, జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పంటి నొప్పి, దంతాలు కదిలిపోవడం, కళ్ల నొప్పి, చూపు మందగించడం, వాంతులైతే రక్తపు జీరలు పడటం, మతి భ్రమించడం, శరీరంలో షుగర్‌ లెవల్స్‌ సడెన్‌గా పడిపోవడం, గతంలో ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టడం వంటి తదితర లక్షణాలు కనిపిస్తే బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని అనుమానించాలి.  

( చదవండి: మీరు డాక్టరా..? అయితే రూ.2 వేలు )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top