ఆర్థిక ఆరోగ్యం యథాతథం | Telangana climbs to 7th in Niti Aayog fiscal health index | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఆరోగ్యం యథాతథం

Mar 28 2026 5:33 AM | Updated on Mar 28 2026 5:33 AM

Telangana climbs to 7th in Niti Aayog fiscal health index

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పదేళ్ల కాలంలోనూ మారని ఆర్థిక ఆరోగ్య సూచీ

2023–24 లోనూ ఏడో స్థానంలోనే తెలంగాణ 

0.7 పాయింట్లు తగ్గి 44.3 స్కోరు సాధించిన రాష్ట్రం 

ఖర్చులో నాణ్యత విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంత మెరుగుదల 

రెవెన్యూ సమీకరణ సూచీలో గణనీయమైన వృద్ధి  

నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తి కేవలం మనుషులకే కాదు వ్యవస్థలకు కూడా వర్తిస్తుంది. మనిషి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉన్నట్టే.. రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యం ఎంత మెరుగ్గా ఉంటే అంత ఎక్కువ కాలం పురోగతిలో పయనించేందుకు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు వీలవుతుంది. రాష్ట్రాలకు సంబంధించి అలాంటి ఆర్థిక ఆరోగ్య సూచీలను నీతి ఆయోగ్‌ ఇటీవల విడుదల చేసింది. ఆర్థిక ఆరోగ్య సూచిక–2026 పేరుతో 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మార్కులతో కూడిన ర్యాంకులు ఇచ్చింది.

ఒడిశా ఆర్థిక ఆరోగ్యం 73.1 స్కోరుతో అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉండగా, కేవలం 12.4 స్కోరుతో పంజాబ్‌ చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఇక తెలంగాణ 44.3 స్కోరుతో ఏడో స్థానంలో నిలవడం గమనార్హం. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలి పదేళ్ల అనంతరం కూడా రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యంలో మార్పు ఏమీ రాలేదని స్పష్టమవుతోంది. 2014–15లో 45 పాయింట్ల స్కోరుతో ఏడో స్థానంలో నిలిచిన తెలంగాణ, పదేళ్ల తర్వాత 2023–24లోనూ ఏడో స్థానంలోనే నిలవడం గమనార్హం. నిజానికి అప్పుడు సాధించిన స్కోరు కంటే 0.7 పాయింట్లు తగ్గి 44.3 స్కోరుకే పరిమితం అయింది. అంతకుముందు 2021–22లో 34.8 స్కోరుతో తొమ్మిదో స్థానంలో ఉండగా, ఆ తర్వాత కొంత పుంజుకుని 2014–15 కల్లా ఏడో స్థానానికి చేరింది. 

ఐదు అంశాల ఆధారంగా.. 
ఖర్చులో నాణ్యత, రెవెన్యూ సమీకరణ, ఆర్థిక వివేచన, రుణసూచిక, రుణ స్థిరత్వం అనే ఐదు అంశాల ఆధారంగా ఈ ఆరోగ్య సూచీని లెక్కకట్టిన నీతి ఆయోగ్‌.. దేశంలోని 18 పెద్ద రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలకు వేర్వేరుగా ర్యాంకులు ఇచి్చంది. మొత్తం ఖర్చులో అభివృద్ధి వ్యయం, జీఎస్‌డీపీలో మూల ధన వ్యయం ఆధారంగా ఖర్చులో నాణ్యత నిర్ధారించింది.

జీఎస్‌డీపీలో రాష్ట్ర సొంత రాబడులు, మొత్తం ఖర్చులో సొంత రెవెన్యూ ఆధారంగా రెవెన్యూ సమీకరణను పరిశీలించింది. జీఎస్‌డీపీతో పోలిస్తే స్థూల ద్రవ్యలోటు, రెవెన్యూలోటు ఆధారంగా ఆర్థిక వివేచన, రెవెన్యూ రాబడుల్లో వడ్డీల చెల్లింపులు, జీఎస్‌డీపీతో పోలిస్తే మొత్తం అప్పుల ఆధారంగా రుణ సూచిక, జీఎస్‌డీపీ వృద్ధి, అప్పులకు వడ్డీల చెల్లింపులో పెరుగుదల ఆధారంగా రుణ స్థిరత్వం.. అంశాల్లో స్కోరు నమోదు చేసింది.  

తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలు.. 
దేశంలోని 18 పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఖర్చులో నాణ్యత విషయంలో గత పదేళ్ల కాలంలో కొంత మెరుగుదల నమోదైంది. 2014–15లో ఈ సూచీకి సంబంధించి 55.3 స్కోరు సాధించిన రాష్ట్రం ఆ తర్వాత వరుసగా దిగజారింది. 42.0 (2018–19), 39.4 (2021–22), 36.9 (2022–23) స్కోర్లు నమోదు చేసింది. కానీ 2023–24కు వచ్చేసరికి ఖర్చులో నాణ్యత విషయంలో అత్యధికంగా 57.1 స్కోరు సాధించగలిగింది.  

రెవెన్యూ సమీకరణ సూచీలో తెలంగాణ గణనీయమైన వృద్ధి సాధించిందని నీతి ఆయోగ్‌ గణాంకాలు చెబుతున్నాయి. 2014–15లో వనరుల సమీకరణ అంశంలో 50.7 మాత్రమే స్కోరు సాధించిన రాష్ట్రం.. ఆ తర్వాత వరుసగా 54.1, 59.7 స్కోర్లు సాధించింది. ఇక 2022–23లో ఏకంగా 75.2 స్కోరుతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. కానీ 2023–24కు వచ్చేసరికి కొంత దిగజారి 60.8 స్కోరు సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకుంది.  

ఆర్థిక వివేచన అంశంలోనూ తొలి పదేళ్ల కాలంలో తెలంగాణ ఒడిదుడుకులను ఎదుర్కొంది. రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో 29.4 స్కోరుతో 10వ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఆ తర్వాత మరింత దిగజారింది. 22.5 స్కోరుతో 2019–20లో 10వ స్థానం, 21.6 స్కోరుతో 2021–22లో మళ్లీ 10వ స్థానంలోనే ఉంది. అయితే 2022–23లో 40.8 స్కోరుతో 9వ స్థానానికి చేరింది. అలాగే 2023–24లోనూ 30 స్కోరుతో మళ్లీ తొమ్మిదో స్థానాన్ని నిలబెట్టుకుంది.  

రుణసూచిక విషయంలో రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో 83.7 స్కోరుతో నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణ.. ఆ తర్వాత 2019–20 నాటికి 63.4 స్కోరుతో ఎనిమిదో స్థానానికి దిగజారింది. ఆ తర్వాత 49.8 స్కోరుతో 2021–22 నాటికి పరిస్థితి మరింత చేయిదాటిపోయింది. అంటే ఈ మధ్యకాలంలో అప్పులకు వడ్డీల చెల్లింపులు ఎక్కువయ్యాయన్నమాట. కాగా 2022–23లో కొంత మెరుగుపడి 52.3, 2023–24లో 53.5 స్కోరు సాధించింది. 

ఆర్థిక క్రమశిక్షణతో టాప్‌లో ఆ రాష్ట్రాలు 
స్థిరమైన ఆదాయం, రుణాల స్వయం నియంత్రణ కారణంగా 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి ఒడిశా ఆర్థిక ఆరోగ్య సూచీలు దృఢంగా ఉన్నాయి. బలమైన ఆర్థిక క్రమశిక్షణ, వనరులు సమకూర్చుకోవడంలో సమర్థత కారణంగా ఒడిశాతో పాటు గోవా, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్రలు టాప్‌–5 ర్యాంకుల్లో ఉన్నాయి. అదే సమయంలో పెరుగుతున్న అప్పులు, స్థిరమైన లోటు, రెవెన్యూ వృద్ధిలో మందగమనం కారణంగా పంజాబ్, కేరళ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు ఆర్థిక ఒత్తిడులను ఎదుర్కొంటున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement