ఎంపీ అర్వింద్‌ కాన్వాయ్‌పై దాడి  | Telangana BJP MP Arvind Dharmapuri Alleges Attack By TRS Men | Sakshi
Sakshi News home page

ఎంపీ అర్వింద్‌ కాన్వాయ్‌పై దాడి 

Jan 26 2022 2:13 AM | Updated on Jan 26 2022 10:51 AM

Telangana BJP MP Arvind Dharmapuri Alleges Attack By TRS Men - Sakshi

బీజేపీ నాయకులపై దాడి చేస్తున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు 

ఆర్మూర్‌: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను టీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకుని, దాడికి దిగాయి. బీజేపీ నేతలు, కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో అర్వింద్‌ కారుతోపాటు ఐదు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు బీజేపీ నేతలు, కార్య కర్తలకు తీవ్రగాయాలయ్యాయి.  ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందిపేట మండలం నూత్‌పల్లి, నికాల్‌పూర్, దత్తాపూర్‌ గ్రామాల్లో ఎంపీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల కోసం మంగళవారం ఎంపీ అర్వింద్, పలువురు బీజేపీ నాయకులు బయలుదేరారు.

అర్వింద్‌ పర్యటనను అడ్డుకునేందుకు అప్పటికే వందల సంఖ్యలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆర్మూర్‌ మండ లం ఆలూర్‌లో, నందిపేట మండలం వెల్మల్‌ చౌరస్తాలో గుమిగూడారు. ఆలూర్‌ శివార్లలో రోడ్డుపై ట్రాక్టర్‌ టైర్లను వేసి, నిప్పు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ అర్వింద్‌ ఆర్మూర్‌ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎంపీ హోదాలో అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తుంటే టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాస్‌నగర్‌ మీదుగా వెళ్లా లని పోలీసులు సూచించగా.. ఇస్సాపల్లి, ఆలూర్‌ మీదుగా నందిపేటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. 


నిజామాబాద్‌ కమిషనరేట్‌ వద్ద.. అద్దాలు ధ్వంసమైన అర్వింద్‌ కారు 

వెనక్కి వెళ్లేందుకు సిద్ధమయ్యాక.. 
పోలీసులు శాంతిభద్రతల సమస్య వస్తుందంటూ.. ఎంపీని ఇస్సాపల్లిలోనే ఆపి వెనుదిరిగి పోవాల్సిందిగా కోరారు. దీనిపై అర్వింద్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో మాట్లాడగా.. ‘టీఆర్‌ఎస్‌ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి.. సంయమనం పాటించి వెనక్కి వెళ్లాల’ని సంజయ్‌ సూచించారు. ఈ మేరకు అర్వింద్, బీజేపీ నాయకులు ఇస్సాపల్లి నుంచి వెనుదిరుగుతుండగా వెల్మల్, ఆలూర్‌ల నుంచి వందల మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఇస్సాపల్లికి చేరుకున్నారు.

అర్వింద్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేశా రు. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు వాగ్వాదం మొదలై.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వందల సంఖ్యలో ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.. కర్రలు, రాళ్లతో బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఎంపీ అర్వింద్‌ కారులో ఉండగానే.. దాని అద్దాలు పగలగొట్టారు. కాన్వాయ్‌లోని మరో ఐదు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు వెంటపడి కొడుతుండటంతో 15 మంది బీజేపీ నేతలు పొలాల మీదుగా పరిగెత్తుతూ పారిపోయారు.

మాక్లూర్‌ మండలం మామిడిపల్లి మాజీ సర్పం చ్‌ సంతోష్, నిజామాబాద్‌కు చెందిన బీజేవైఎం నేత విజయ్‌తోపాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసులు ఎంపీ అర్వింద్‌కు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పక్కా ప్లాన్‌తోనే పోలీసుల సహకారంతో తమపై దాడులు చేయించాడని బీజేపీ నేతలు ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement