ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్‌ హెల్త్‌ కార్డులు | Telangana announces cashless health security scheme for government employees | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్‌ హెల్త్‌ కార్డులు

May 16 2026 2:48 AM | Updated on May 16 2026 2:48 AM

Telangana announces cashless health security scheme for government employees

సమస్యలపై సీఎస్‌కు వినతి పత్రం ఇస్తున్న మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, లచ్చిరెడ్డి తదితరులు

జూన్‌ 2వ తేదీన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం 

పీఆర్సీ నివేదికను వీలైనంత త్వరితంగా తెప్పించుకుంటాం  

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్‌ హెల్త్‌కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు స్పష్టం చేశారు. జూన్‌ 2వ తేదీన డిజిటల్‌ హెల్త్‌ కార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటామని, ఆరోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కార్డులు లాంఛనంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వివరించారు. శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం సీఎస్‌ అధ్యక్షతన జరిగింది. 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత జేఎస్సీ సమావేశం జరగడం గమనార్హం.

ఈ సందర్భంగా జేఎస్సీ సభ్యులతో సీఎస్‌ పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ సమస్యలను ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశంలో ప్రస్తావించారు. పీఆర్సీ నివేదిక, హెల్త్‌కార్డులు, పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు, సర్వీస్‌ అంశాలు, ఉద్యోగుల బదిలీలు, 317 జీఓ సమస్యల పరిష్కారం తదితర అంశాలను సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కె.రామకృష్ణారావు మాట్లాడుతూ సమావేశంలో ప్రస్తావించిన ఆర్థికేతర అంశాలను వీలైనంత మేరకు పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పీఆర్సీ నివేదికను వీలైనంత త్వరగా తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆ దిశగా కమిషన్‌ కూడా తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. జిల్లాలు, డైరెక్టరేట్‌ స్థాయిల్లో కూడా జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.  

టీఎన్జీఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీజీఓ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించిన బిల్లులను వేగవంతంగా విడుదల చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన పలు అంశాలకు సంబంధించి నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. 
 రెవెన్యూ శాఖలో 61 ఏళ్లు పైబడిన వీఆర్‌ఏల చట్టబద్ధ వారసులను నియమించాలని అని రెవెన్యూ శాఖలో తొలగించిన 632 కంప్యూటర్‌ ఆపరేటర్లు మరియు ఎఫ్‌టీఎస్‌ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు.  
 రెవెన్యూ శాఖ ఉద్యోగులను బదిలీల నిషేధం నుంచి మినహాయింపు కల్పించాలి ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్‌ ప్రభుత్వాన్ని కోరారు.  

ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు సంఘాల తరపున ఉద్యోగుల సమస్యలపై వేర్వేరుగా వినతిపత్రాలను సీఎస్‌కు అందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మహేశ్‌దత్‌ ఎక్కా, సబ్యసాచి ఘోష్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానీయా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చొంగ్తు, తహసీల్దార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రాములు, ప్రధాన కార్యదర్శి పాక రమేష్ తో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఇవీ నిర్ణయాలు
ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం (ఈహెచ్‌ఎస్‌) జూన్‌ 2 నుంచి అమలు.. ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5% చొప్పున వసూలు చేసి, ప్రభుత్వం కూడా సమానమైన మ్యాచింగ్‌ గ్రాంట్‌ అందిస్తూ ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అమలు
పీఆర్సీ నివేదిక తుది దశకు చేరుకుందని, త్వరలో నివేదిక తెప్పించి దానిపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం.

పెండింగ్‌ బిల్లులను 100 రోజులలోపు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంటాం.
2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌పై చర్చ. పాత పెన్షన్‌ అమలుపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించి, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటాం.

ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విద్యాశాఖ సెక్రటరీకి సూచన.
 ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని విద్యాశాఖ సెక్రటరీకి సూచన.

 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా స్పౌస్‌ కేటగిరీలో పరిగణించేలా చర్యలు.
వారంలో ఐదు రోజుల పని విధానాన్ని కూడా పరిశీలనలోకి తీసుకుంటాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement