మహారాష్ట్రకు ‘కోచ్‌’.. తెలంగాణకు తూచ్‌

Telangana: Allocation Of New Railway Coach Factory - Sakshi

ఇదీ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం తీరు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు కొత్త రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తామంటూనే రిక్తహస్తం చూపిన రైల్వేశాఖ, అదే సమయంలో మహారాష్ట్రకు దానిని కేటాయించి వేగంగా పూర్తిచేస్తోంది. తెలంగాణ ఎదురుచూస్తున్న కోచ్‌ ఫ్యాక్టరీపై ఆశలను ఆవిరి చేస్తూ, మహారాష్ట్రలోని లాతూరుకు దానిని కేటాయించి దాదాపు పూర్తి చేసింది.

ఈ ఏడాది డిసెంబర్‌లో ఉత్పత్తి ప్రారంభించే దశకు చేర్చేపనిలో నిమగ్నమైంది. తాజాగా సమాచార హక్కు చట్టం కింద సామాజిక కార్యకర్త రవికుమార్‌ వివరాలు అడుగగా రైల్వే శాఖ పలు విషయాలు వెల్లడించింది.

ఇదీ సంగతి.. 
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తానని కేంద్రం ఇదివరకు పేర్కొంది. ఈ మేరకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. విభజన చట్టంలో దీన్ని పొందుపరచటంతో కోచ్‌ ఫ్యాక్టరీ వస్తుందేమోనని యావత్తు రాష్ట్రం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూసింది. కానీ, దేశవ్యాప్తంగా ప్రస్తుత రైల్వే అవసరాలను ఇప్పటికే ఉన్న కోచ్‌ ఫ్యాక్టరీలే తీరుస్తున్నాయని, భవిష్యత్తు అవసరాలకు కూడా అవి సరిపోతాయని ఏడాదిన్నర క్రితం రైల్వే శాఖ తేల్చి చెప్పింది.

అప్పట్లోనే సమాచార హక్కు చట్టం రూపంలో రైల్వే శాఖ ఆలోచన లిఖితపూర్వకంగా స్పష్టమైంది. కానీ, కొత్త రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీల అవసరమే లేదన్న రైల్వే శాఖ, 2018 ఏప్రిల్‌లో మహారాష్ట్రలోని లాతూరులో దాని ఏర్పాటు అంశాన్ని ప్రతిపాదించింది. కేవలం ఐదు నెలల్లోనే రూ.625 కోట్లతో మంజూరు చేసింది. ఆ వెంటనే పనులు ప్రారంభించి, ఇప్పటికే రూ.587 కోట్లు ఖర్చు చేసింది.

ఈఏడాది చివరి నాటికి దానిని పూర్తి చేయనున్నట్టు తాజాగా స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుల మంజూరు, తిరస్కరణలన్నీ రాజకీయ కారణాల ఆధారంగానే జరుగుతున్నాయని రవికుమార్‌ ఆరోపించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టును కూడా తెలంగాణ నేతలు సాధించలేకపోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top