గెజిట్‌ అమలుపై అనిశ్చితి!

Suspense Over Krishna And Godavari Boards Gazette Implementation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై అనిశ్చితి నెలకొంది. ప్రాజెక్టుల అప్పగింత విషయంగా తెలంగాణ ముం దుకురాకపోవడం, పలు అభ్యంతరాల నేపథ్యంలో గందరగోళం నెలకొంది. గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు ఎజెండాతో ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల మినిట్స్‌ (చర్చించిన అంశాలు)ను కృష్ణా, గోదావరి బోర్డుల సభ్యకార్యదర్శులు డీఎం రాయ్‌పురే, బీపీ పాండే బుధవారం రెండు రాష్ట్రాలకు పంపారు. ఈ మినిట్స్‌ ప్రకారం.. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులను అప్పగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

అయితే శ్రీశైలం, సాగర్‌ జలవిద్యుత్‌ కేంద్రాలను అప్పగించడంపై తెలంగాణ సర్కారు అభ్యంతరం వ్య క్తం చేసింది. ప్రాజెక్టులను బోర్డులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు మొగ్గుచూపలేదు. రెండు రాష్ట్రాలు కూడా ప్రాజెక్టులను అప్పగిస్తూ ఉత్తర్వులిస్తే గానీ.. వాటిని బోర్డులు తమ పరిధిలోకి తీసుకోలేవు. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో.. నిర్దేశించిన గడువు అయిన గురువారం (అక్టోబర్‌ 14న) రోజు న గెజిట్‌ నోటిఫికేషన్‌ను అమలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లినట్టు రెండు బోర్డుల అధికారవర్గాలు తెలిపాయి. ఈ విషయంలో కేంద్రం జారీ చేసే మార్గదర్శకాల మేరకు చర్యలు చేపడతామని వెల్లడించాయి. 

ఏపీ రెడీ.. తెలంగాణ నో.. 
మంగళవారం జరిగిన సమావేశంలో ఇరురాష్ట్రాల వాదనలు విన్న కృష్ణాబోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌.. తొలుత ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను పూర్తిస్థాయిలో బోర్డు పరిధిలోకి తీసుకుంటామని తీర్మానం ప్రవేశపెట్టారు. దానిని ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. తమ భూభాగంలోని ఆరు ఔట్‌లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు అంగీకరించింది. కానీ తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ట్రిబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసే వరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు చేయవద్దని వాదించింది. తెలంగాణకు విద్యుత్‌ అవసరాలు అధికంగా ఉన్నాయని.. శ్రీశైలం, సాగర్‌ విద్యుత్‌ కేంద్రాలను బోర్డుకు అప్పగించాలనడం సరికాదని పేర్కొంది. అయితే తెలంగాణ విద్యుత్‌ ప్లాంట్లను బోర్డుకు అప్పగించకపోతే.. గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఏపీ సర్కారు అభిప్రాయం వ్యక్తం చేసింది. విద్యుదుత్పత్తి పేరుతో తె లంగాణ సర్కారు అనధికారికంగా నీటిని వినియోగిస్తోందని, దీనిని నియంత్రించినప్పుడే రెండు రా ష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. 

పెద్దవాగుకు కృష్ణా ప్రాజెక్టులకు లంకె.. 
గోదావరి బోర్డుకు పెద్దవాగు ప్రాజెక్టును అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు ఏపీ సర్కారు సిద్ధమైనా.. తెలంగాణ మాత్రం వెనుకడుగు వేస్తోంది. పెద్దవాగును గోదావరి బోర్డుకు అప్పగిస్తే.. శ్రీశైలం, సాగర్‌లలో పది ఔట్‌లెట్లను కృష్ణాబోర్డుకు అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని భావిస్తున్నట్టు తెలిసింది.

‘గెజిట్‌’పై తెలంగాణ నిపుణుల కమిటీ 
కృష్ణా, గోదావరి బోర్డులు గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు విషయంగా ప్రతిపాదించిన అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని తెలంగాణ నిర్ణయించింది. దీనిపై సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు.. ఈఎన్‌సీ మురళీధర్‌ నేతృత్వంలో పలువురు సీనియర్‌ ఇంజనీర్లతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ ప్రకటించింది. కృష్ణా, గోదావరి బోర్డులు ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులు, సిబ్బంది, విద్యుత్‌ కేంద్రాలు, ఇతర ఔట్‌లెట్లను అప్పగిస్తే.. ఏర్పడే పరిణామాలు, పరిస్థితులపై సమగ్రంగా అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ముఖ్యంగా ప్రాజెక్టులను బోర్డులకు స్వాధీనం చేస్తే.. వరదల నిర్వహణ (ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌), విపత్తుల నిర్వహణ (డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) ఏవిధంగా చేయాల్సి ఉంటుంది, బోర్డుకు ఉండే అధికారాలేమిటి, రాష్ట్రాలకు ఉండే అధికారాలేమిటన్న అంశాలపై పరిశీలన జరపాలని సూచించింది.

ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించి అంతా అనుకూలంగా ఉందని కమిటీ పరిశీలనలో వెల్లడైతేనే.. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందని, లేకుంటే అభ్యంతరాలను మరోసారి బోర్డులు, కేంద్రం దృష్టికి తీసుకెళుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గెజిట్‌ అమలుకు తెలంగాణ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకొనే పరిస్థితి కనిపించడం లేదని.. ఈ అనిశ్చితి మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నాయి.  

కేంద్రం కోర్టులో బంతి! 
గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు ఏపీ సర్కారు సహకరిస్తోందని, తెలంగాణ ప్రభుత్వం దాటవేత వైఖరి అవలంబిస్తోందని.. కృష్ణా, గోదావరి బోర్డులు కేంద్ర జలశక్తి శాఖకు విన్నవించాయి. ప్రత్యేక సమావేశాల్లో చర్చించిన అంశాల(మినిట్స్‌)ను కేంద్రానికి పంపాయి. దీంతో ఈ అంశం కేంద్రం పరిధిలోకి వెళ్లింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు దిశగా కేంద్రం ఏ చర్యలు తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top