విచిత్ర ఘటన.. ఈ మృతదేహం నా భర్తది కాదు..! | Strange incident in hanamkonda | Sakshi
Sakshi News home page

విచిత్ర ఘటన.. ఈ మృతదేహం నా భర్తది కాదు..!

Jul 12 2025 10:18 AM | Updated on Jul 12 2025 10:18 AM

Strange incident in hanamkonda

దహన సంస్కారాలు చేసే సమయంలో కుటుంబ సభ్యుల గుర్తింపు

 తిరిగి ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు 

పోలీసుల వినతి మేరకు పోస్టుమార్టం 

లేకుండా బంధువులకు అప్పగించాం

ఎంజీఎం ఆర్‌ఎంఓ శశికుమార్‌ వెల్లడి 

హన్మకొండ: ‘రోడ్డు ప్రమాదంలో నీ భర్త మృతిచెందాడ’ని పోలీసులు సమాచారం అందించడంతో వరంగల్‌ ఎంజీఎంకు వెళ్లిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు చేసే క్రమంలో మృతదేహం తమవారిది కాదని గుర్తించి.. తిరిగి ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ విచిత్ర ఘటన శుక్రవారం వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. 

మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి( 55), రమకు ముప్పయి ఏళ్లక్రితం వివాహమైంది. వారికి ఒక కూతురు. ఇరవై ఏళ్ల క్రితం కుమారస్వామి మతిస్థిమితం కోల్పోగా అప్పటినుంచి రమ వేరుగా ఉంటున్నారు. అతను మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు పట్టణకేంద్రంలో యాచిస్తూ జీవిస్తున్నాడు. తొర్రూరులో ఈనెల 09వ తేదీన రోడ్డుపక్కన అపస్మారకస్థితిలో పడి ఉండగా స్థానికులు, పోలీసుల సాయంతో అంబులెన్స్‌లో ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు గురువారం మృతిచెందాడు. ఈ క్రమంలో ఎంజీఎంనుంచి పోలీసులు ‘నీ భర్త చనిపోయాడని’ మైలారానికి చెందిన గోక రమకు సమాచారం అందించారు. 

ఆస్పత్రికి వెళ్లిన రమ, కుటుంబ సభ్యులకు మార్చురీనుంచి చాపతో చుట్టిన మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో నేరుగా మైలారంలోని దహనసంస్కారాలు చేసే స్థలానికి తీసుకొచ్చారు. కిందికి దించి చాప విప్పిచూడగా కుమార్తె స్వప్న ఆ మృతదేహాన్ని చూడగా తన తండ్రి చేతిపై శ్రీ అనే పచ్చబొట్టు ఉంటుందని, ఈ మృతదేహానికి పచ్చబొట్టు లేదని, తమ నాన్న కాదని తేల్చిచెప్పింది. భార్య, బంధువులు సైతం చూసి తమవారిది కాదని చెప్పడంతో తిరిగి మృతదేహాన్ని అదే అంబులెన్స్‌లో ఎంజీఎంకు తరలించారు. రమ తన భర్తను చాలా ఏళ్లుగా చూడకపోవడం.. చాపలో చుట్టి ఇవ్వడం వల్ల గుర్తించలేకపోయినట్లు కొందరు అంటున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, ఆ మృతదేహం ఎవరిది అన్నది గుర్తించాల్సి ఉంది. 

పోలీసుల వినతి మేరకే..
ఎంజీఎం : ఈ నెల 9వ తేదీన అపస్మారకస్థితిలో ఉన్న ఓ వ్యక్తిని ఎంజీఎంకు తీసుకువచ్చారని, చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎంజీఎం ఆర్‌ఎంఓ శశికుమార్‌ తెలిపారు. కాగా, సద రు వ్యక్తి మృతదేహం రాయపర్తి మండలం మైలా రం గ్రామానికి చెందిన కుమారస్వామిగా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. పోస్టుమార్టం లేకుండా అప్పగించాలనే పోలీసుల వినతి మేరకు ఆ మృతదేహాన్ని భార్య, బంధువుల అంగీకారం మేరకు అప్పగించినట్లు ఆర్‌ఎంఓ తెలిపారు. మృతదేహాన్ని ఇంటికి తీ సుకెళ్లిన కుటుంబ సభ్యులు తమది కాదని పేర్కొని తిరిగి ఎంజీఎం మార్చరీకి తరలించినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement