‘కృష్ణా’లో మా వాటా తేల్చండి 

State Govt Demand Over Finalize Krishna Water Shares To Krishna Tribunal 2 - Sakshi

నీటి వాటా ఖరారు అంశాన్ని కృష్ణా ట్రిబ్యునల్‌–2కు అప్పగించండి 

కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్ర నీటిపారుదల శాఖ లేఖ 

తాత్కాలిక కేటాయింపులతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం 

574.6 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాను ఖరారు చేసే అంశాన్ని తక్షణమే కృష్ణా ట్రిబ్యునల్‌–2కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 84 (3) (4) కింద జల వివాదాలను నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్‌కు అప్పగించాలని అపెక్స్‌ కౌన్సిల్‌ తీసుకు న్న నిర్ణయమే అంతిమమని స్పష్టం చేసింది.

ఈ విషయంలో విరుద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి కేంద్రంతో సహా ఏ అథారిటీకి అధికారం లేదంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ) 1956లోని సెక్షన్‌–3 కింద 2014 జూలై 14న ఏపీపై చేసిన ఫిర్యాదును దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంచడం.. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా హక్కులను తెలంగాణకు నిరాకరించడమేనని అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ గురువారం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. 

574.6 టీఎంసీలు కేటాయించాలి 
కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు కేటాయిస్తూ 2015లో తీసుకున్న తాత్కాలిక నిర్ణయం ఆధారంగానే ఇప్పటికీ కృష్ణా బోర్డు రెండు రాష్ట్రా లకు కేటాయింపులు చేయడంపై రాష్ట్రం అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర పరిధిలోని కృష్ణా బేసిన్‌లో సాగు విస్తీర్ణం, కరువు ప్రభావిత ప్రాంతాలు, జనాభాను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి 574.6 టీఎంసీలను కేటాయించాలని కోరినా బోర్డు పట్టించుకోవడం లేదంది. ఈ అంశం తమ పరిధిలో లేదని, ట్రిబ్యునల్‌ మాత్రమే సమీక్షించగలదని బోర్డు పేర్కొందని వెల్లడించింది.  

ట్రిబ్యునల్‌కు అప్పగించండి: సుప్రీంకోర్టులో కేసును ఉపసంహరించుకుంటే ఫిర్యాదును ట్రిబ్యునల్‌కు అప్పగించాలని 2020 అక్టోబర్‌ 6న జరిగిన రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేసును ఉపసం హరించుకున్నామని తెలంగాణ తెలిపింది. న్యాయ సల హా మేరకు కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలా లేదా కృష్ణా ట్రిబ్యునల్‌–2కు బాధ్యత అప్పగించాలా అనే అం శంపై నిర్ణయిస్తామని అప్పట్లో అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయించిందని గుర్తు చేసింది.

కృష్ణా ట్రిబ్యునల్‌–2 రద్దు కానందున తెలంగాణ ఫిర్యాదును దీనికే అప్పగించడం సముచితమని అభిప్రాయపడింది. కృష్ణా జలాల్లో తమ చట్ట బద్ధ హక్కులనే కోరామని.. ఇతర రాష్ట్రాల హక్కులు, ప్ర యోజనాలకు భంగం కలుగుతుందని భావించొద్దని స్ప ష్టం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టానికి పరిమితులుండటంతోనే ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ–1956 చట్టం కింద ఫిర్యాదు చేసినట్టు తెలిపింది.

75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకాలు జరుపుతూ కృష్ణా ట్రిబ్యునల్‌–2 జారీ చేసిన మధ్యంతర నివేదికలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, కర్ణాటక, మహారాష్ట్రల ప్రయోజనాలకు ఈ కేసుతో నష్టం ఉండదని అభిప్రాయపడింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top