విద్యా సంస్థలు ఎప్పుడు తెరుద్దాం?

State Government Debating The Restart Educational Institutions - Sakshi

కోవిడ్‌ తీవ్రత ఎంత.. వైద్య, విద్య శాఖల నివేదిక కోరిన సర్కార్‌

ప్రత్యక్ష బోధనతోపాటు ఆన్‌లైన్‌?

సాక్షి, హైదరాబాద్‌: కరోనా థర్డ్‌ వేవ్‌ కారణంగా మూతబడిన విద్యాసంస్థలను తిరిగి ప్రారంభిం చాలన్న డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. స్కూళ్లు, కాలేజీలను తెరిస్తే వచ్చే ఇబ్బందులపై ఆరా తీస్తోంది. ఈ మేరకు విద్యా, ఆరోగ్య శాఖల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరినట్టు తెలిసింది. ఆయా విభాగాల అభిప్రాయాలకు అనుగుణంగా సర్కార్‌ నిర్ణయం తీసుకోవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కోవిడ్‌ తగ్గుముఖం పడితే, తల్లిదండ్రులు తమ పిల్లలను పంపడానికి సుముఖంగా ఉంటే వచ్చే నెల 5 నుంచి స్కూళ్లను తెరవాలని ప్రభుత్వం యోచి స్తోంది.

తాజా పరిస్థితిపై ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వైద్య అధికారులతో సమీక్ష జరిపినట్టు సమాచారం. రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి కొనసాగు తున్నా దాని ప్రభావం స్వల్పంగానే ఉందని వైద్య అధికారులు తెలిపినట్టు తెలిసింది. థర్డ్‌ వేవ్‌ ప్రభావం తగ్గితే యథావిధిగా విద్యాసంవత్సరం ముగించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఒకవేళ సెలవులు పొడిగించాల్సి వస్తే పరీక్షల షెడ్యూల్లోనూ స్వల్ప మార్పులుండే అవకాశముందని చెబుతున్నారు. విద్యా సంస్థలు తిరిగి తెరవాల్సి వస్తే స్కూలుకు రావాలంటూ బలవంతం చేయకుండా, ప్రత్యక్ష బోధనకుతోడు ఆన్‌లైన్‌ బోధనా కొనసాగించాలని భావిస్తున్నారు. మరో రెండు రోజుల్లో విద్యాసంస్థలను తెరవడంపై స్పష్టత వచ్చే అవకాశముంది.

విద్యాసంవత్సరం పొడిగించాలి: వై.శేఖర్‌రావు (ట్రస్మ అధ్యక్షుడు)
కోవిడ్‌ నేపథ్యంలో సెలవుల పొడిగింపు వల్ల విద్యాబోధన కుంటుపడింది. ఆన్‌లైన్‌ విద్యాబోధన చేపట్టినా అది అన్ని స్థాయిల్లోకి వెళ్లడం కష్టంగానే ఉంది. ఇప్పటికే ఏ క్లాసులోనూ సిలబస్‌ పూర్తవ్వలేదు. ప్రత్యక్ష బోధన చేపట్టినా, విద్యా సంవత్సరాన్ని మే నెల వరకూ పొడిగిస్తేనే సిలబస్‌ పూర్తి చేయడం సాధ్యమవుతుంది.
  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top