అంత్యక్రియల్లో పాల్గొంటే కరోనా రాదు

Srinivas Goud Says No Attack Of Coronavirus In Funeral Place - Sakshi

సాక్షి, పాలమూరు : మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో సోమవారం కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తి అంత్యక్రియల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. ఈ వైరస్‌పై భయపడుతున్న వారందరికీ భరోసా కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాతో మృత్యువాత పడిన వారి అంతిమ సంస్కారాలకు కుటుంబసభ్యులు సైతం ముందుకు రాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం నిర్వహించినంత మాత్రాన కరోనా సోకదన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ తదితర ఆస్పత్రుల్లో మృతి చెందిన రోగులను వారి పిల్లలే తీసుకెళ్లడానికి ముందుకు రాకపోవడం చూస్తుంటే మానవత్వం మంటగలుస్తోందన్నారు. కోవిడ్‌ నిబంధనల ప్రకారం ఐదుగురి నుంచి పది మంది వరకు పీపీఈ కిట్లు వేసుకుని అంత్యక్రియల్లో పాల్గొనవచ్చన్నారు. ఈ సందేశాన్ని అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో ఓ ప్రముఖుడి అంత్యక్రియలకు హాజరయ్యానన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ఆప్తులకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top