మా మంచి నాన్న..

Special Story On fathers Day   - Sakshi

తప్పటడుగులు వేసే వేళ వేలు పట్టుకు నడిపిస్తాడు.. భుజాన కూర్చోబెట్టుకుని ప్రపంచాన్ని చూపిస్తాడు.. ముళ్లబాటలో పయనించేవేళ హెచ్చరించి సన్మార్గంలో నడిపిస్తాడు..తాను చిరిగిన దుస్తులు ధరించైనా పిల్లలకు కొత్తవి కొనిస్తాడు.. తిన్నా తినకపోయినా వారి కడుపునింపే ప్రయత్నం చేస్తాడు.. పిల్లల్లో పిల్లల్లా కలిసిపోతూ వారి సరదాలు, ఆనందాలు, బాధలు అన్నింట్లో పాలుపంచుకుంటాడు.. వారి విజయాన్ని తాను సాధించినట్లుగా సంబరపడిపోతాడు.. ఓడినప్పుడు ఈసారి నీదేలే గెలుపని భుజం తట్టి ప్రోత్సహిస్తాడు.. కష్టసుఖాల్లో తోడు, నీడగా నిలుస్తాడు.. ‘నేనున్నా’నంటూ భరోసా కల్పిస్తాడు. మొదటిగురువుగా మారి అక్షరాలు దిద్దించి బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తాడు.. ఇవన్నీ నాన్న కాక ఇంకెవరు చేస్తారు. అందుకే ‘ఓ నాన్న.. నీ మనసే వెన్న.. అమృతం కన్నా అది ఎంతో మిన్న..’  

వెన్నుతట్టి.. ప్రోత్సహించి.. 
మీర్‌పేట: ఆడపిల్లలు పుడితేనే భారంగా భావించే రోజులు.. పుట్టిన నాటి నుంచి పెళ్లీడు ఎప్పుడు వస్తుందా.. ఓ అయ్యకిచ్చి పెళ్లి తంతు జరిపించేస్తే బాధ్యత పూర్తవుతుందని వేచి చూసేవారు ఎందరో.  కానీ ఆ తండ్రి అలా కాదు.. పుట్టింది ఆడపిల్ల అయినప్పటికీ మగపిల్లాడి కంటే మిన్నగా చిన్న నాటి నుంచి చదువుతో పాటు నచ్చిన రంగాల్లో వెన్నంటి ప్రోత్సహించాడు. తండ్రి ప్రోత్సాహంతో ఆ కూతురు ఉన్నత శిఖరాలకు చేరి ప్రస్తుతం దేశంలోనే అత్యున్నత భద్రత సంస్థ అయిన సీఆర్‌పీఎఫ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా వైద్య సేవలందించే స్థాయికి ఎదిగింది. అవసరమైనప్పుడు దేశ రక్షణకు తుపాకీ చేత పట్టి పహారా కాస్తోంది. ఆమే మీర్‌పేట నందీహిల్స్‌కు చెందిన నారాయణరెడ్డి చిన్న కుమార్తె డా.కె.షర్మిళారెడ్డి.   

ప్రతి అడుగులో నాన్న తోడున్నారు.. 
గాంధీ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశాను. 2020 జూలై 18న విధుల్లో చేరాను. ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొనేలా భద్రతా బలగాలకు ఎలాంటి శిక్షణ ఇస్తారో అన్ని రకాల శిక్షణలు ఇచ్చారు. వైద్య సేవలు అందిస్తూనే అత్యవసర పరిస్థితుల్లో జవాన్లతో కలిసి విధులు నిర్వర్తిస్తాం. ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా కాంపోజిట్‌ హాస్పిటల్‌ చాంద్రాయణగుట్టలో విధులు నిర్వర్తిస్తున్నాను. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాన్న ఇచ్చిన ప్రోత్సాహమే. ఆయన నా ప్రతి అడుగులోనూ తోడుండి వెన్నుతట్టి ప్రోత్సహించారు. మహిళలు భద్రతా బలగాల్లో ఎలా పనిచేస్తారు అని ఏనాడూ వద్దని చెప్పలేదు. నాన్న, కుటుంబ సభ్యుల సహకారంతోనే ఇది సాధ్యమైంది.  
– డా.కె.షర్మిలారెడ్డి, అసిస్టెంట్‌ కమాండెంట్‌ మెడికల్‌ ఆఫీసర్, సీఆర్‌పీఎఫ్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top