Veera Bairanpally Revolt: విముక్తికి బాట వేసిన  బైరాన్‌పల్లి..!

Special Story About Telangana Veera Bairanpally - Sakshi

రజాకార్ల దుశ్చర్యలపై పోరాడిన బైరాన్‌పల్లి వాసులు

మూడుసార్లు దాడులు, రెండుసార్లు దీటుగా ఎదుర్కొన్న గ్రామ రక్షక దళం.. మూడోసారి దారుణాలకు తెగబడ్డ రజాకార్లు.. 118 మందికిపైగా మృతి

1947 ఆగస్టు 15.. తెల్లదొరలను తరిమిన భారతావనిలో ప్రజలు స్వాతంత్య్ర సంబరాలు చేసుకుంటున్నారు.. కానీ హైదరాబాద్‌ సంస్థానం మాత్రం నిజాం పాలనలో బిక్కుబిక్కుమంటూనే గడిపింది. ఆ రోజే కాదు.. మరో ఏడాదికిపైగా నిజాం నియంతృత్వాన్ని, రజాకార్ల దుర్మార్గాలను భరిస్తూ వచ్చింది. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలన్న ప్రజల ఆకాంక్షలు, ప్రతిఘటనలు, పోరాటాల రూపంలో తెరపైకి రావడం మొదలైంది.

వీటన్నింటికీ పరాకాష్టగా బైరాన్‌పల్లి నరమేధం కలకలం రేపింది. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసుకోవాలన్న ఒత్తిడి తీవ్రస్థాయికి చేరింది. 1948 ఆగస్టు 27న బైరాన్‌పల్లి ఘటన జరిగితే ఆ తర్వాత 21 రోజుల్లో.. అంటే సెప్టెంబర్‌ 17 నాటికి హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైంది.
–సాక్షి, సిద్దిపేట

ఎన్నో పోరాటాలు జరిగినా..
బ్రిటీష్‌వాళ్లు దేశాన్ని వదిలిపెట్టి పోయినా.. నిజాం రాజు హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి నిరాకరించారు. దీనికి తోడు నిజాం సైన్యాధ్యక్షుడు ఖాసీం రజ్వీ వ్యక్తిగత సైన్యం రజాకార్ల అరాచకాలు ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం మొదలైంది. సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలం బైరాన్‌పల్లి కేంద్రంగా కూటిగల్, లింగాపూర్, ధూల్మిట్ట గ్రామాల యువకులతో బలమైన గ్రామ రక్షక దళం ఏర్పడింది.

రజాకార్ల నుంచి తమ గ్రామాన్ని రక్షించుకోవాలన్న లక్ష్యంతో బైరాన్‌పల్లి గ్రామస్తులంతా ఏకమయ్యారు. శత్రువుల దాడిని ఎదుర్కొని, ప్రతిదాడి చేయడానికి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న కోట బురుజును పునర్నిర్మించారు. నాటు తుపాకులు, మందు గుండు సామగ్రి సమకూర్చుకున్నారు. ఆయుధ శిక్షణ తీసుకున్న యువకులు నాటు తుపాకులతో గస్తీ నిర్వహించేవారు.

ప్రతీకారేచ్ఛతో వరుస దాడులకు తెగబడి..
1948లో లింగాపూర్, ధూల్మిట్ట గ్రామాలపై రజాకార్లు దాడి చేసి తగులబెట్టారు. తిరిగి వెళ్తుండగా బైరాన్‌పల్లి సమీపంలోకి రాగానే వారిపై దూబూరి రాంరెడ్డి, ముకుందరెడ్డి, మురళీధర్‌రావు నాయకత్వంలో రక్షణ గెరిల్లా దళాలు దాడిచేసి దోచుకున్న సంపదను స్వాధీనం చేసుకున్నాయి. దాన్ని తిరిగి ప్రజలకు పంచారు. దీనిపై ఆగ్రహంతో రగిలిపోయిన రజాకార్లు బైరాన్‌పల్లిపై దాడి చేశారు.

రక్షక దళం గట్టిగా ప్రతిఘటించింది. ఈ దాడిలో 20 మందికిపైగా రజాకార్లు చనిపోయారు. ఇలా రెండోసారి కూడా విఫలం కావడంతో రజాకార్లు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయారు. నాటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్‌ హషీం ఆదేశాలతో హైదరాబాద్‌ నుంచి 500 మందికిపైగా సైనికులను రప్పించి మూడోసారి దాడి చేశారు.

దారుణంగా కాల్చి చంపారు
ఖాసీంరజ్వీ నేతృత్వంలో రజాకార్లు 1948 ఆగస్టు 27 తెల్లవారుజామున అంతా నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా బైరాన్‌పల్లిని చుట్టుముట్టారు. అయితే ఆ సమయంలో బహిర్భూమికి వెళ్లిన గ్రామస్తుడు వడ్లె వెంకటనర్సయ్య గమనించి కేకలు వేయడంతో.. వెంటనే బురుజుపై ఉన్న కాపలాదారులు నగారా మోగించారు. అప్పటికే దూసుకొచ్చిన రజాకార్ల కాల్పుల్లో బురుజుపై ఉన్న గెరిల్లా దళ సభ్యులు మోగుటం రామయ్య, పోచయ్య, భూమయ్య మృతిచెందారు.

రజాకార్లు ఫిరంగులతో దాడి చేయగా.. బురుజులోని మధ్య గదిలో ఉన్న మందు గుండు సామగ్రిపై నిప్పులు పడి పేలిపోయింది. తర్వాత రజాకార్లు మరింత విజృంభించారు. బురుజుపై తలదాచుకున్న 40 మందిని కిరాతకంగా కాల్చి చంపారు. మరో 56 మంది యువకులను బంధించి ఊరి బయటికి తీసుకొచ్చి కాల్చిచంపారు. మృతదేహాలను పాత బావిలో పడేశారు. ఈ ఘటనల్లో 118 మందికిపైగా మృతిచెందినట్లు చరిత్ర చెబుతోంది.

యువకులను చంపడంతో ఊరుకోని రజాకార్లు మరిన్ని దారుణాలకు తెగబడ్డారు. మహిళలను నగ్నంగా ఆ శవాల చుట్టూ బతుకమ్మ ఆడించారు. వారిపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ దారుణాలను తట్టుకోలేక కొందరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నట్టు బైరాన్‌పల్లి గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నరమేధం నాటి భారత ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో నిజాం సంస్థానాన్ని స్వాధీనం చేసుకునే చర్యలు మొదలయ్యాయి.

నాటి కేంద్ర హోంమంత్రి వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ ఆధ్వర్యంలో జరిగిన పోలీస్‌ యాక్షన్‌తో కొద్దిరోజుల్లోనే హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో వీలినమైంది. బైరాన్‌పల్లి వాసులు నాటి ఘటనను గుర్తు చేసుకుని ఇప్పటికీ కన్నీటిపర్యంతం అవుతున్నారు. ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వాలు పట్టించుకోలేదు
నాటి ఘటనతో బైరాన్‌పల్లి.. వీర బైరాన్‌పల్లి అయింది. ఇంతటి పోరాట పటిమ చూపిన తమ గ్రామాన్ని ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయని స్వాతంత్య్ర సమరయోధులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబం నాటి పోరాటంలో పాల్గొన్నా 28 మందికి మాత్రమే పెన్షన్‌ మంజూరు చేశారని.. నాటి పోరాటంలో పాల్గొని పెన్షన్‌ రానివారు ఇంకా 30 మంది ఉన్నారని చెబుతున్నారు. కూటిగళ్లు గ్రామంలోనూ ఇదే పరిస్థితి ఉందని.. నాడు అమరులైన వారి పేర్లతో గ్రామస్తులే ఓ స్తూపాన్ని నిర్మించుకున్నారని వివరిస్తున్నారు. 2003లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా స్తూపాన్ని ఆవిష్కరించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

బైరాన్‌పల్లి పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి
బైరాన్‌పల్లి పోరాటాన్ని విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చాలి. నాటి ఘనత నేటి తరానికి తెలిసేలా అమరధామం, ఎత్తయిన స్తూపం, భవనం నిర్మించాలి. సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టిపెట్టి అభివృద్ధి చేయాలి. కేసీఆర్‌ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో బైరాన్‌పల్లి గురించి వివరించాం. వస్తానన్నారు. ఇప్పటివరకు రాలేదు. ఇప్పటికైనా పట్టించుకోవాలి.
–చల్లా చంద్రారెడ్డి 

నాటి పోరాటంలో కాలికి గాయమైంది
నాడు రజాకార్లు చందాల పేరుతో పీడించేవారు. వారి దాడుల్లో నా కాలుకు గాయమైంది. అయినా రక్షణ దళంతో కలిసి రజకార్లపై పోరాడాను. నాటి పోరాటకారుల్లో కొందరికి ఇప్పటికీ పెన్షన్‌ మంజూరు చేయలేదు. వెంటనే మంజూరు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలి. గ్రామంలో సర్వే చేసి ఇల్లు లేనివారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలి.    
–ఇమ్మడి ఆగంరెడ్డి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top