జాతీయాలతో జాతి భాష సంపన్నం

Guest Column On Telangana Jateeyalu Vemula Perumallu - Sakshi

తెలంగాణ జాతీయాలు రచయిత వేముల పెరుమాళ్లు వర్ధంతి నేడు

నాటి తెలంగాణ యాస, భాషకు సజీవ సాక్ష్యం 

సెప్టెంబర్‌ 17, 2005. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటోన్న వేళ ఉదయం 10 గంటలకు వేముల పెరుమాళ్లు లేరన్న విషయం తెలిసింది. తెలంగాణ భాష కోసం, తెలంగాణ జాతీయాల కోసం, తెలంగాణ జానపదుల కోసం, తెలంగాణ సామెతల కోసం, తెలంగాణ పల్లె పదాల కోసం జీవితాంతం కృషి చేసిన వేముల పెరుమాళ్లు.. సరిగ్గా తెలంగాణ విమోచనం రోజే లోకాన్ని వీడడం యాధృచ్చికమే కావొచ్చు కానీ మరిచిపోలేని జ్ఞాపకంగా తన మరణాన్ని మార్చుకోవడం మాత్రం గొప్ప విషయం. 

తెలుగు సంస్కృతి అంతా ఒక్కటే! అయినా తెలంగాణ సంస్కృతిలో కొంత భిన్నత్వం ఉంది. భాషలో యాసలో ప్రత్యేకత ఉంది. అందుకు కారణం సుమారు ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా పరాయి పాలనలో తెలుగు చదవడం, రాయడం నిషేధింపబడ్డ రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలు వారి భాషను, యాసను పదిల పరుచుకున్నారు. వారి సామెతల్ని, జాతీయాల్ని , మౌఖిక సాహిత్యాన్ని, లిఖిత సాహిత్యాన్ని భద్ర పరుచుకున్నారు.

నిజాం పాలకులు సృష్టించిన ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ఇక్కడి ప్రజలు వాటిని కాపాడుకోవడం ఒక సాహసవంతమైన చర్య. "సాలు పొంటి సాలు తీరు"గా వారి అవ్వ నుంచి మారుమూల గ్రామీణుల నుంచి వాళ్ల వాక్కును కల్తీ కాకుండా తన భాషగా చేసుకుని కాలగర్భంలో కలిసిపోగా మిగిలిన (పోయింది పొల్లు ఉన్నది గట్టి) జాతీయాల్ని ఏర్చికూర్చి  "తెలంగాణ జాతీయాలు"గా గ్రంథస్తం చేశారు. ఉడుం పట్టు, దీక్ష కార్య శూరత్వం గల వారు ఎలాంటి మహాకార్యాన్నయినా అలవోక గా చేయగలరని తెలంగాణ జాతీయాలు పుస్తకం చూస్తే తెలుస్తుంది.  

వేముల పెరుమాళ్లు స్వస్థలం నాటి కరీంనగర్‌ జిల్లాలోని జగిత్యాల తాలుకా రాయికల్‌ గ్రామం. రాయికల్‌, కోరుట్ల, జగిత్యాలలో విద్యాభ్యాసం చేసిన పెరుమాళ్లు.. శ్రీకాళహస్తిలోని గ్రామసేవక్‌ శిక్షణా కేంద్రం నుంచి గ్రామీణాభివృద్ధిలో డిప్లమో చేశారు. 1963 నుంచి 18 ఏళ్ల పాటు గ్రామీణాభివృద్ధి అధికారిగా మల్యాల, జగిత్యాల పంచాయతీ సమితులలో ఉద్యోగం చేశారు. 1981లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి జగిత్యాల పంచాయతీ సమితి అధ్యక్ష ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాయికల్‌ మొదటి మండలాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉద్యోగం, రాజకీయం.. ఏ రంగంలో ఉన్నా.. సాహిత్యాన్ని మాత్రం మరవలేదు పెరుమాళ్లు. 

దశాబ్దకాలంగా కష్టనష్టాలకు ఓర్చి, పేర్చి కూర్చిన ఈ గ్రంథం తెలంగాణ జాతీయాలకు, సామెతలకు నిఘంటవుగా నేటికి ప్రతిబింబిస్తుంది. నోసుక పుట్టినట్టు వీరి మరణానంతరం తెలంగాణ జాతీయాల్ని ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పాఠ్యాంశంగా స్వీకరించి వీరి శ్రమకు, తెలంగాణ భాషకు, యాసకు సముచిత గౌరవాన్ని కల్పించడం వీరికే కాదు తెలంగాణ జాతీయాలకు అగ్రాసనం వేసినట్టయింది.

పెరుమాళ్లు తాత కైరం భూమదాసు గొప్ప వైష్ణవ భక్తుడు, కవి, గాయకుడు. కైరం భూమదాసు వ్రాతప్రతులను పరిష్కరించిన పెరుమాళ్లు 2002లో "వరకవి కైరం భూమదాసు కృతులు" గ్రంథాన్ని ప్రచురించారు. 1958 నుంచి 1968 మధ్య కాలంలో జరిగిన ఎన్నో జాతీయ పరిణామాలను వీరు పద్యాలుగా మలిచారు. వీరు రచించిన శ్రీ రాజరాజేశ్వర, శ్రీ ధరమపురి నృకేసరి శతకాలు సంబంధిత దేవాలయాలు ప్రచురించాయి. బాల సాహిత్యంలో వీరు చేసిన కృషి ఫలితంగా కిట్టూ శతకం (బాలనీతి), నిమ్ము శతకం (పర్యావరణ) వెలువడ్డాయి. మహాత్ముని మహానీయ సూక్తులను "గాంధీమార్గం" త్రిశతిగా రచించారు. "లోగుట్టు" వీరు రచించిన రాజనీతి చతుశ్శతి. ఎంతో కాలం వీరు సేకరించిన జాతీయాలు, సామెతలతో వెలువడిన గ్రంథం "తెలంగాణ జాతీయాలు".  

పెరుమాళ్లు మరణానంతరం వెలువడిన గ్రంథం మానవతా పరిమళాలు. 1983 నుంచి 2001 వరకు ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం నుంచి చేసిన "జ్యోతిపథం" లఘు ప్రసంగాల సంకలనం. జానపద సాహిత్యం కూరాడుకుండ లాంటిది. దానిని మైల పరచకుండా చూసే బాధ్యతని సాహితీప్రియులందరిపై వేశారు పెరుమాళ్లు. జానపదుడు రుషీసుంటోడు, ఆయన నోట వెలువడ్డ జాతీయం, సామెత గంగలో రాయిలాంటిది. ఎన్నో వందల సంవత్సరాలు అది ప్రజల నోళ్లలో నాని రగిడిల్లింది. తెలంగాణ జాతీయాలు తరతరాల మన సామాజిక చరిత్రకు సజీవ సాక్ష్యం.

చిల్లి బొక్కతీరు లక్షల్లో వున్న తెలంగాణ జాతీయాల్ని వేలలో "పోయింది పొల్లు, ఉన్నది గట్టి తీరు"గా గ్రంథస్తం చేశారు పెరుమాళ్లు. ఇంకా ఎన్నో ప్రాంతాల్లో సజీవంగా జానపదుని నాలుకపై తచ్చాడుతున్న జాతీయాల్ని.. ఔత్సాహికులు మరింత శ్రమించి కొత్త సంపదను జాతికి ఇవ్వాలన్న వారి కోరిక తీర్చాల్సిన తరుణం మళ్లీ వచ్చింది. అదే తెలంగాణ సాహిత్యానికి తిరిగి చెల్లించాల్సిన రుణం.

వి.ప్రభాకర్‌,
తెలంగాణ కవి,
రిటైర్డ్‌ రిజిస్ట్రార్‌,
సహకారశాఖ

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top