
ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలపై ప్రత్యేక కమిటీ నిర్ణయం
లెక్కల ఆడిట్, భూమి అనుమతులపై ప్రత్యేక దృష్టి
ఉప కమిటీలకు బాధ్యతలు అప్పగింత
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని ఫీజులపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ నిర్ణయించింది. కొన్ని కాలేజీలను నేరుగా తనిఖీ చేయాలని భావిస్తోంది. ఫీజుల పరిశీలన కమిటీలో ఆడిట్, టౌన్‌ప్లానింగ్, సాంకేతిక విద్య, ఉన్నత విద్య ఉన్నతాధికారులు ఉన్నారు. వీళ్లంతా ఉప కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీల్లోని నిపుణులు ఆయా విభాగాలకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యమిస్తారు. అఫిలియేషన్ జాబితాలో ఉన్న ప్రతి ప్రైవేటు కాలేజీని అన్ని కమిటీలు పరిశీ లిస్తాయి. వారంరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయా లని తాజా భేటీలో ప్రత్యేక కమిటీ నిర్ణయించింది.
నిబంధనల ఉల్లంఘనపై దృష్టి
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) బృందాలు పూర్తిస్థాయిలో తనిఖీలు చేయకుండానే కాలేజీలకు అనుమతులు ఇస్తున్నాయనే విమర్శలున్నాయి. ముఖ్యంగా కాలేజీలకు ఒక చోట అనుమతులు తీసుకుని, మరో చోట నిర్వహిస్తున్నారు. ఏఐసీటీఈకి సమర్పించిన డాక్యుమెంట్లలో అనేక లొసుగులు ఉంటున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. హైదరాబాద్ పరిధిలో కొన్ని కాలేజీల భూములు నిషేధిత ప్రాంతాల్లో ఉన్నాయి. అయినా అనుమతులు ఎలా వచ్చాయనే అంశాలను నగర ప్లానింగ్ విభాగం అధికారులు పరిశీలిస్తారు.
ఆడిట్ కథేంటి?
ప్రతి కాలేజీ గత మూడేళ్ల (2022–2025) ఆడిట్ నివేదికలను తెలంగాణ అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ)కి సమర్పించాయి. ఎఫ్‌ఆర్‌సీ కొంతమంది ఆడిటర్లను నియమించుకుని కాలేజీల ప్రతిపాదనలను పరిశీలిస్తుంది. ఆడిట్ విభాగం ఉన్నతాధికారులు ప్రతి కాలేజీ డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. ఈ లెక్కల్లో ఎక్కడ తేడా వచ్చినా ఆ కాలేజీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
20 కాలేజీలపై సీరియస్‌గా ఫిర్యాదులు వచ్చాయి. ఫ్యాకల్టీ లేకుండానే ఎమర్జింగ్ కోర్సులు నిర్వహిస్తున్నాయి. అధ్యాపకులు, సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదని తేలింది. ఈ నేపథ్యంలో వాటి బ్యాంకు లావాదేవీలపైనా దృష్టి పెడతామని అధికారులు అంటున్నారు. ఈ కాలేజీలపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.