
సికింద్రాబాద్: వాహనాలు నడుపుతున్న సమయంలో డ్రైవర్లు ఉన్నఫలంగా అనారోగ్యం బారిన పడితే.. ఏం కాదులే అనుకుని డ్రైవర్ వాహనాన్ని నడుపుతూ వెళ్లి ప్రమాదాల బారిన పడిన ఘటనలు లేకపోలేదు. ఇటువంటి సమయాల్లో సదరు డ్రైవరుకు బీపీ పెరిగినా.. గుండె కొట్టుకునే పద్ధతుల్లో మార్పులు చోటుచేసుకున్నా సదరు ప్రమాదకర పరిస్థితులు కనిపెట్టేందుకు స్మార్ట్ గ్లౌజ్‌ను సీతాఫల్‌మండి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని రూపొందించింది. ఈ “స్మార్ట్ గౌజ్’ ప్రాజెక్టు రాష్ట్రస్థాయి అవార్డును గెల్చుకుంది. అదే సమయంలో ఇదే ప్రాజెక్టు జాతీయ ఇన్‌స్పైర్ మేళా ప్రదర్శనకు ఎంపికైంది. గత విద్యాసంవత్సరం (2020–21)లో కరోనా లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా విద్యార్థుల ఇన్‌స్పైర్ మేళాను కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థల అధికారులు ఆన్‌లైన్‌లో నిర్వహించారు. సీతాఫల్‌మండికి చెందిన 8వ తరగతి విద్యార్థిని సఫియాబేగం అనే బాలిక రూపొందిన స్మార్ట్‌గ్లజ్ ప్రదర్శనను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు.
- గతనెలలో ఆన్‌లైన్ ప్రదర్శన జరిగినప్పటికీ..సదరు ప్రదర్శనలకు అవార్డులను శుక్రవారం ప్రకటించారు.
- సఫియాబేగం స్మార్ట్ గ్లజ్ ప్రదర్శనకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రదర్శనగా ఎంపిక చేశారు.
- హైదరాబాద్ జిల్లా నుంచి పోటీ పడిన 12 ప్రదర్శనల్లో స్మార్ట్‌గ్లౌజ్ ప్రదర్శనను ఉత్తమ ప్రదర్శనగా ఎంపిక చేశారు.
- రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక చేయడంతోపాటు జాతీయ ఇన్‌స్పైర్ మేళాలో ప్రదర్శించేదుకు ఎంపిక చేశారు.
కాగా, స్మార్ట్‌గ్లౌజ్ ప్రదర్శనకు అవార్డు రావడం, జాతీయ ప్రదర్శనకు ఎంపిక కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తితోపాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి ప్రదర్శనకు స్మార్ట్‌గ్లౌజ్ ప్రదర్శనలో మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేసేవిధంగా రూపొందించనున్నట్టు హెచ్‌ఎం కృష్ణమూర్తి తెలిపారు.
ప్రస్తుతం రూపొందించి స్మార్ట్‌గ్లౌజ్ అనారోగ్యకర పరిస్థితులను మాత్రమే లైట్లు వెలుగడం ద్వారా డ్రైవరుకు మాత్రమే తెలియజేస్తుందని చెప్పారు.
ఇక ముందు ఇదే గ్లౌజ్ డ్రైవరు అనారోగ్యకర పరిస్థితులు వాహనం నడిపిస్తున్న డ్రైవరుకు తెలియజెప్పడంతోపాటు కుటుంబసభ్యుల సెల్‌ఫోన్‌కు మెస్సేజ్ అందించే విధంగా రూపొందిస్తున్నామని చెప్పారు. సుదూర ప్రాంతాలకు లారీలు, ట్రక్కులు ఇతర భారీ వాహనాలు రోజుల తరబడి నడిపించే డ్రైవర్లుకు స్మార్ట్‌గ్లౌజ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.