క్షణాల్లో ఈ–పాస్‌బుక్‌

Slab Booking Starts In Dharani Portal - Sakshi

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ సులువు

10 రోజుల్లో పోస్టు ద్వారా మెరూన్‌ పాస్‌బుక్‌లు

ఎల్‌ఆర్‌ఎస్‌పై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం

స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని ప్రారంభించిన సీఎస్‌

సాక్షి, హైదరాబాద్ ‌: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను పాత వెబ్‌సైట్‌ ద్వారానే అడ్వాన్స్‌ స్లాట్‌ బుకింగ్‌ విధానంలో పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ ఫీజులను నిర్ణయించే విషయంలో సబ్‌ రిజిస్ట్రార్లకు గతంలో ఉన్న విచక్షణాధికారాలను రద్దు చేసినట్లు తెలిపారు. స్లాట్‌లోని తేదీ, సమయానికి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్తే 5 నుంచి 7 నిమిషాల్లోగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఆ వెంటనే మొబైల్‌ ఫోన్‌కు ఈ–పాస్‌బుక్‌ వస్తుందని, వారం పది రోజుల్లో పోస్టు ద్వారా మెరూన్‌ రంగు పట్టాదారు పుస్తకం ఇంటికి వస్తుందని తెలిపారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం కొత్తగా రూపొందించిన స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని శుక్రవారం ఆయన బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ఆవిష్కరించారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు పునరుద్ధరిస్తామన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ల అనుమతి విషయంలో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

స్లాట్‌ బుకింగ్‌ ఉంటేనే..
స్లాట్‌ బుక్‌ చేసుకుంటేనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ చేస్తారని సీఎస్‌ స్పష్టం చేశారు. https:// registration.telangana.gov.in వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని సూచించారు. స్లాట్‌ బుకింగ్‌లో విక్రయదారు, కొనుగోలుదారు, ఆస్తికి సంబంధించిన వివరాలతో పాటు ఆస్తికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్‌ ఇండెక్స్‌ నంబర్‌ (పీటిన్‌) ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పీటిన్‌ లేని వారు ఇదే వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రెండ్రోజుల్లోగా వారి మొబైల్‌ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో జారీ అవుతుందని చెప్పారు. రిజిస్ట్రేషన్‌ కోసం ఆధార్‌ నంబర్‌ తప్పనిసరి కాదని, అయితే ఆధార్‌ నంబర్‌ ఇచ్చిన వారికి తక్షణ రిజిస్ట్రేషన్, తక్షణ మ్యూటేషన్‌ సేవలు లభిస్తాయని పేర్కొన్నారు. ఆధార్‌ నంబర్‌ ఇవ్వని వారికి ప్రత్యేక ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేస్తారని, దీనికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఆధార్‌ ఉంటే ఆస్తి యజమాని గుర్తింపు నిర్ధారణ సులువు అవుతుందని, మోసాలకు తావుండదని పేర్కొన్నారు.

చలాన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లింపు..
రిజిస్ట్రేషన్‌ కోసం చెల్లించాల్సిన ఫీజులు, డ్యూటీల మొత్తానికి సంబంధించిన చలాన్‌ను ఆటోమెటిక్‌గా సిస్టం జనరేట్‌ చేస్తుందని సీఎస్‌ చెప్పారు. రిజిస్ట్రేషన్ల కోసం స్టాంప్‌ పేపర్, బాండ్‌ పేపర్లు కొనాల్సిన అవసరం లేదని, చలాన్‌లో పేర్కొన్న ఫీజు చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. చలాన్‌ను తీసుకెళ్లి ఏదైనా ఎస్‌బీఐ శాఖలో ఫీజు చెల్లించాలని చెప్పారు. ఆన్‌లైన్‌ బ్యాకింగ్‌ ద్వారా కూడా తక్షణమే చెల్లించొచ్చన్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం ఎక్కడికి వెళ్లాలి? ఎంత మంది సాకు‡్ష్యలను తీసుకెళ్లాలి? ఏమేం తీసుకెళ్లాలన్న వివరాలు ఎస్‌ఎంఎస్‌ రూపంలో దరఖాస్తుదారులకు వస్తుందని చెప్పారు. డాక్యుమెంట్‌ రైటర్ల అవసరం లేకుండానే సొంతంగా దస్తావేజు రాసుకునేందుకు వీలుగా వెబ్‌సైట్‌లో నమూనా దస్తావేజులు (టెంప్లెట్లు) అందుబాటులో ఉంచామన్నారు. రిజిస్ట్రేషన్‌ సమయంలోనే మ్యూటేషన్‌ సైతం పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు. ఒక్కో స్లాట్‌కు 15 నిమిషాల చొప్పున ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌కు రోజుకు 24 స్లాట్ల రిజిస్ట్రేషన్లను కేటాయించామన్నారు. త్వరలో ఈ సంఖ్యను అవసరం మేరకు 48 నుంచి 100కు పెంచుతామన్నారు. అవసరమున్న చోట ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు, ఇద్దరు డీటీపీ ఆపరేటర్లను నియమిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ల డేటా భద్రతకు హైకోర్టు చేసిన సూచనలను తప్పకుండా పాటిస్తున్నామని చెప్పారు. ఎక్కడా డేటా లీక్‌ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని వివరించారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అనుమానాలుంటే రిజిస్ట్రేషన్ల శాఖ ఐటీ కార్యాలయం టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 599 4788కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు.

ధరణిలో పెండింగ్‌ మ్యూటేషన్లకు అవకాశం..
పెండింగ్‌ మ్యూటేషన్లు పూర్తి చేసేందుకు ధరణి పోర్టల్‌లో అవకాశం కల్పించామని సీఎస్‌ తెలిపారు. 16,110 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లో 1.24 కోట్ల క్లిక్కులు, 74 వేల స్లాట్‌ బుకింగ్‌లు, 55,216 లావాదేవీలు జరిగాయని సీఎస్‌ వెల్లడించారు. పోర్టల్‌కు ట్రాఫిక్‌ విపరీతంగా పెరగడం వల్ల సర్వర్‌ స్తంభించగా, వెంటనే పునరుద్ధరించామన్నారు.

తొలిరోజే రూ.85 లక్షల ఆదాయం
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు స్లాట్‌ బుకింగ్స్‌ ప్రారంభించిన తొలి రోజైన శుక్రవారం సాయంత్రం నాటికి 37 స్లాట్లు బుక్‌ కాగా, రూ.85 లక్షలు ఫీజులు, సుంకాల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. 17,567 మంది సైట్‌ను సందర్శించగా, 3,987 వినియోగదారులు సైట్‌లో తమ పేరున ఖాతాలే రిజిస్టర్‌ చేసుకున్నారు. 4,143 లావాదేవీలకు శ్రీకారం చుట్టారు. మీ–సేవ కేంద్రాల ద్వారా కూడా రూ.200 చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని సీఎస్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బిల్డర్లు, డెవలపర్లు ఒకేసారి బల్క్‌గా అన్ని ఆస్తులనూ అప్‌లోడ్‌ చేసేందుకు సైట్‌లో కొత్త విండో సదుపాయం కల్పించారు. 451 మంది బిల్డర్లు, డెవలపర్లు 93,874 ఆస్తులను అప్‌లోడ్‌ చేశారు. 12,699 ఆస్తులకు సంబంధించిన పీటిన్‌లను స్థానిక సంస్థలు జారీ చేశాయి.

ప్రస్తుతం చేపడుతున్న రిజిస్ట్రేషన్లు ఇవే..
సేల్‌ కేటగిరీ కింద సేల్‌ డీడ్, సేల్‌ అగ్రిమెంట్‌ వితౌట్‌ పొసెషన్, డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ కమ్‌ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ, మార్టగేజ్‌ కేటగిరీ కింద మార్టగేజ్‌ వితౌట్‌ పొసెషన్, మార్టగేజ్‌ విత్‌ పొసెషన్, మెమోరాండంఆఫ్‌ డిపాజిట్‌ ఆఫ్‌ టైటిల్‌ డీడ్స్, గిఫ్ట్‌ కేటగిరీ కింద గిఫ్ట్‌ ఇన్‌ ఫేవర్‌ ఆఫ్‌ రిలేటివ్‌ తదితర రిజిస్ట్రేషన్‌ సేవలను పునరుద్ధరించారు. 97 శాతం రిజిస్ట్రేషన్లు ఈ కేటగిరీకి సంబంధించినవే ఉంటాయని సీఎస్‌ తెలిపారు. క్రమంగా మిగిలిన రిజిస్ట్రేషన్‌ సేవలను సైతం పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top