కోలుకుంటున్న మెట్రో నగరాలు..!

Sky Kee Report Said Recruitment and Job Opportunities Increase In Metro Cities - Sakshi

పండుగలు, కోవిడ్‌ ఉన్నా పెరుగుతున్న ఉపాధి అవకాశాలు

పుంజుకుంటున్న ఈ కామర్స్, ఫార్మాసూటికల్స్, ప్యాకేజింగ్, బ్యాంకింగ్, ఐటీ సర్వీసెస్‌

అక్టోబర్‌లో వివిధ రంగాల్లో 5.55 శాతం పెరిగిన నియామకాలు: జాబ్‌ పోర్టల్‌ ‘స్కై కీ’నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారి ప్రభావం నుంచి మెట్రో నగరాలు క్రమంగా కోలుకుంటున్నాయి. కరోనా క్రీనీడ నుంచి బయటపడుతున్నాయి. కరోనా వైరస్‌ ఉధృతి ఉన్న గత నెలలతో పోల్చితే అక్టోబర్‌లో మెట్రోనగరాల్లో జాబ్‌ పోస్టింగ్‌లు, ఉద్యోగ అవకాశాలు సంబంధిత కార్యకలాపాలు (హైరింగ్‌ యాక్టివిటీస్‌) ఐదు శాతానికిపైగా పెరిగినట్టు జాబ్‌ పోర్టల్‌ ‘స్కై కీ’(ఎస్‌సీఐ కేఈవై) తాజా నివేదికలో వెల్లడైంది. పండుగల సీజన్‌తోపాటు కోవిడ్‌ పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నా భారత్‌లోని మెట్రో నగరాల్లో హైరింగ్‌ యాక్టివిటీస్, జాబ్‌ పోస్టింగ్‌లు సెపె్టంబర్‌తో పోల్చితే అక్టోబర్‌లో 5.55 శాతం పెరిగినట్టు ఈ నివేదికలో పేర్కొన్నారు. దేశంలోని వివిధ రంగాలు నెమ్మదిగా పట్టాలెక్కి కరోనాకు పూర్వస్థితిని చేరుకునే దిశగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైరింగ్‌ యాక్టివిటీస్‌ ఏ నెలకు ఆ నెలకు పెరుగుతూ వస్తున్నట్టు, రాబోయే నెలల్లో ఇది మరింత పుంజుకోనున్నట్టు ‘స్కై కీ’సహ వ్యవస్థాపకుడు అక్షయ్‌ శర్మ స్పష్టం చేశారు.

పుంజుకుంటున్న ఐటీ రంగం
కోవిడ్ మహమ్మారి కాలంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) రంగం మరింత పుంజుకుంటోంది. ఈ రంగంలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన జాబ్‌ పోస్టింగ్‌లు పెరుగుతున్నాయి. సుదీర్ఘ లాక్‌డౌన్‌ విధింపు కారణంగా ఐటీ సెక్టార్‌తోపాటు దాదాపుగా అన్ని రంగాల్లో ‘వర్క్‌ ఫ్రం హోం’ పనివిధానాన్ని ప్రవేశపెట్టడం కూడా ఐటీ, దాని ఆధారిత సేవల రంగానికి ప్రాధాన్యత పెరిగింది. ప్రధానంగా టెలికం సెక్టార్‌లో హైరింగ్‌ యాక్టివిటీస్‌ పెరగడానికి ఇంటి నుంచి పనిచేసే పద్ధతి దోహదపడినట్టు ఈ రిపోర్ట్‌ తెలిపింది. సేల్స్, స్ప్రింగ్, ఇంటర్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్స్, ఆటోమేషన్‌ టెస్టింగ్, మైక్రో సర్వీసెస్‌లలో జాబ్‌ పోస్టింగ్స్‌ అవకాశాలు వృద్ధి చెందినట్టు ఈ నివేదిక వెల్లడించింది. (చదవండి: నిరుద్యోగ యువతకు ఊరట..)

ముందంజలోని రంగాలు ఇవే...
రంగాలవారీగా చూస్తే వివిధ రంగాలకు సంబంధించి సెప్టెంబర్, అక్టోబర్‌లలో హైరింగ్‌ యాక్టివిటీస్‌ గణనీయంగా పెరిగాయి. ఈ కామర్స్, ఫార్మాసూటికల్స్, ప్యాకేజింగ్, టెలికాం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, డేటా అనలిటిక్స్, కన్సల్టింగ్, ఐటీ సర్వీసెస్, రెన్యువబుల్‌ ఎనర్జీ, హాస్పాటాలిటీతోపాటు బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సురెన్స్‌ రంగాలు ఉద్యోగ అవకాశాల కల్పన, హైరింగ్‌ యాక్టివిటీస్‌లో అగ్రభాగాన ఉన్నట్టుగా ‘స్కై కీ’నివేదిక స్పష్టం చేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top