హైదరాబాద్‌: స్టాంప్‌ పేపర్లు కావలెను! 

Shortage Of Rs 20 Non Judicial Stamp Papers In Hyderabad - Sakshi

రూ.20 నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్లు నో స్టాక్‌

విద్యార్థుల స్కాలర్‌షిప్‌ దరఖాస్తులకు ఇక్కట్లు

పట్టని రిజిస్ట్రేషన్ల శాఖ

సాక్షి, హైదరాబాద్‌: మహా నగరంలో రూ.20 నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్లకు కొరత ఏర్పడింది. విద్యార్థుల స్కాలర్‌షిప్‌ దరఖాస్తులతో పాటు వివిధ ధృవీకరణలు, న్యాయపరమైన లావాదేవీలకు అత్యధికంగా వినియోగించే రూ.20 స్టాంప్‌ పేపర్ల పంపిణీ స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి నిలిచిపోయింది. జిల్లా రిజిస్ట్రేటర్‌ ఆఫీసులతో పాటు సబ్‌ రిజిస్టర్‌ ఆఫీసుల్లో సైతం నిల్వలేకుండా పోయింది. నగరంలో కేవలం ఏడు ఆఫీసుల్లో మాత్రం నామమాత్రంగా స్టాక్‌ ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్టాంప్‌ వెండర్స్‌ వద్ద పాత స్టాక్‌ ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇప్పటికే  రూ.100 స్టాంప్‌ పేపర్లు సైతం కొరత వెంటాడుతోంది. డిమాండ్‌ ఉన్నా స్టాక్‌ లేకుండా పోయింది. 

ఇండెంట్‌పై అనాసక్తి 
స్టాంప్స్‌ అండ్‌ రిజి్రస్టేషన్ల శాఖ నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్ల ఇండెంట్‌పై ఆసక్తి చూపడం లేదు. నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్లకు డిమాండ్‌ ఉన్నప్పటికీ నాసిక్‌ ముద్రణాలయానికి ఇండెంట్‌ పెట్టకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కాగ కొరత కారణంగా బహిరంగ మార్కెట్‌లో పాత స్టాక్‌కు డిమాండ్‌ పెరిగినట్లయింది. 

నాసిక్‌లోనే ముద్రణ 
మహారాష్ట్రలోని నాసిక్‌ ముద్రణాలయంలో నాన్‌ జ్యుడీషియల్, రెవెన్యూ స్టాంపులు ముద్రిస్తారు. స్టాంప్స్‌ అండ్‌ రిజి్రస్టేషన్ల శాఖ నాసిక్‌ ముద్రణాలయానికి అవసరమైనంత ఇండెంట్‌ పంపించి నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌లను తెప్పిస్తోంది. జిల్లా రిజిస్ట్రార్ల ఇండెంట్‌ ప్రకారం వాటిని సరఫరా చేస్తోంది. రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ శాఖ నాసిక్‌ నుంచి స్టాక్‌ తెప్పించిన ప్రతిసారి ముందస్తుగా 20 శాతం వరకు సరుకు నిల్వ చేసి మిగితాది జిల్లా రిజి్రస్టార్‌లకు సరఫరా చేస్తోంది. స్టాక్‌ అయిపోక ముందే ఇండెంట్‌ పెట్టి తెప్పించుకోవడం ఆనవాయితీ. తాజాగా స్టాక్‌ పూర్తయినా ఇండెంట్‌ ఊసే లేకుండా పోయింది. 

గ్రేటర్‌లో రూ.20 విలువగల నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్స్‌ స్టాక్‌ ఇలా..

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌    స్టాక్‌ 
హైదరాబాద్‌ ఆర్వో  262 
కూకట్‌పల్లి  3000 
బాలానగర్‌ 146 
శామీర్‌ పేట 400 
కీసర   437 
చేవేళ్ల  1717 
ఇబ్రహీంపట్నం  13  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top