
హైదరాబాద్‌లో వైఎస్సార్ జయంతి వేడుకల్లో మాజీ జడ్జీలు, మాజీ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు
వైఎస్సార్ లేకపోవడం తెలుగు ప్రజల దురదృష్టం
వైఎస్సార్ అభిమానుల ఆత్మీయ సమావేశంలో పలువురు వక్తలు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లలా భావించి పాలన అందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పలువురు వక్తలు కొనియాడారు. వైఎస్సార్ 76వ జయంతి సందర్భంగా వైఎస్సార్ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని బుట్ట కన్వెన్షన్ సెంటర్‌లో ‘దైవమే మానవ రూపేణా’ పేరుతో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశంలో పలువురు మాజీ న్యాయమూర్తులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, సీనియర్ జర్నలిస్టులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయలేనట్లుగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసిన గొప్ప పరిపాలనాదక్షుడు వైఎస్సార్ అని కీర్తించారు. పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్‌ను జాతీయ స్థాయిలో రెండుసార్లు నిలబెట్టింది వైఎస్సార్ అని, ఆయన బతికుంటే ప్రధాని స్థాయికి ఎదిగేవారన్నారు.
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్య కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పేదల ప్రాణాలు కాపాడేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిత్యం భారీగా నిధులు విడుదల చేసేవారన్నారు. వైఎస్సార్ లేకపోవడం తెలుగు ప్రజల దురదృష్టమన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూæ వైఎస్సార్ హయాంలోనే పులిచింతల పూర్తి చేశారని, పోలవరానికి నిధులు తీసుకొచ్చారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వైఎస్సార్ ఘనతేనని కొనియాడారు.
సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ వైఎస్సార్ దగ్గర్నుంచి ప్రతిఒక్కరూ నేర్చుకోవాల్సింది ఒక్కోటి ఉంటుందన్నారు. వైఎస్సార్ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేసిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భాను, రిటైర్డ్ ఐజీ హనుమంతరెడ్డి, ఏసీబీ మాజీ డైరెక్టర్ మల్లారెడ్డి, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ మాజీ వీసీ రాఘవరెడ్డి, వైఎస్సార్ కుటుంబ స్నేహితుడు కొండా రాఘవరెడ్డి తదితరులు ప్రసంగించారు.
సామాజిక న్యాయానికి పర్యాయ పదం
బడుగు, బలహీన వర్గాల కోసం పరితపించి సుపరిపాలన అందించిన వైఎస్సార్‌ను ప్రజలు మరువలేరు. అట్టడుగు వర్గాలను అభివృద్ధి పరచాలన్న సంకల్పంతో పాలన సాగించారు. రాజ్యాంగానికి అనుగుణంగా అసమానతలు తగ్గించేందుకు ప్రయత్నించారు. దివంగత వైఎస్సార్ పాలనలో అందిన విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సామాజిక న్యాయానికి పర్యాయ పదం వైఎస్సార్. – జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి
వైఎస్సార్ మహనీయుడు
మానవతా విలువలుగల మహనీయుడు వైఎస్సార్. సరికొత్త అలోచనలను ప్రోత్సహించే వైఎస్సార్ ప్రజా సమస్యల పరిష్కార మార్గాలపై దృష్టి సారించే వారు. పేదల అభ్యుదయం కోసం నిరంతరం ఆలోచించేవారు. – అజేయ కల్లం, మాజీ సీఎస్

హైదరాబాద్ తాగునీటి సమస్య తీర్చారు
హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య లేదంటే అందుకు కారణం వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవే. సుదూర ప్రాంతాల నుంచి నగరానికి కృష్ణా, గోదావరి జలాలను తీసుకొచ్చారు. – కె.ఎస్.జవహర్‌రెడ్డి, మాజీ సీఎస్
సమస్యలకు పరిష్కారం ఆయన నైజం
రైతులను ఆదుకోవడానికి వైఎస్సార్ సరికొత్తగా ఆలోచించేవారు. ప్రజా సమస్యలు వినడం, ఆ సమస్యలకు పరిష్కారం చూపడం ఆయన నైజం. అందువల్లే లక్షలాది మందికి ఆయన మేలు చేయగలిగారు. – కె.ఐ.వరప్రసాదరెడ్డి, శాంతా బయోటెక్ చైర్మన్
ఏపీ భవన్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలు
సాక్షి నెట్‌వర్క్/న్యూఢిల్లీ: వైఎస్ రాజశేఖరరెడ్డి నేటి తరానికి ఆదర్శనీయుడని అఖిల భారత రైతు సంఘాల అధ్యక్షుడు మదన్‌మోహన్ రెడ్డి కొనియాడారు. అన్ని వర్గాల వారు ఆదరించే స్థానాన్ని ఆయన సంపాదించుకున్నారని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మంగళవారం వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మదన్‌మోహన్ రెడ్డి, వైఎస్సార్ అభిమానులు సదానంద రెడ్డి, వసంత, సంజయ్‌లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కాగా, చెన్నై ఐటీ వింగ్ ఆధ్వర్యంలో చెన్నైలోని ‘టెక్ టవర్’లో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహానేత చిత్రపటం వద్ద నివాళులర్పించి, కేక్ కట్ చేశారు. రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆర్కే రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వైఎస్సార్‌సీపీ చెన్నై ఐటీ వింగ్ సేవాదళ్ అధ్యక్షుడు హుస్సేన్, ఏపీ ఐటీ వింగ్ అధ్యక్షుడు సునీల్, సేవాదళ్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా పార్టీ సింగపూర్ విభాగం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటరెడ్డి పాలేనికి చెందిన సుబ్బారామమ్మ గుండె ఆపరేషన్ నిమిత్తం రూ.60 వేలు సాయం అందించింది.