
ఇంటింటికి తిరిగి స్టీల్ సామాన్లు ఇచ్చి పాతబట్టల కొనుగోలు
వాటిని అంగట్లో విక్రయం
పంట చేల చుట్టూ కట్టేందుకు చీరల కొనుగోలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వ్యాపార రంగం ఎంత అభివృద్ధి చెందినా అంగళ్లకు మాత్రం ఆదరణ తగ్గలేదు. వారానికోసారి జరిగే అంగడి (వారపు సంత)లో తమకు అవసరమైన అన్ని వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. కూరగాయల నుంచి నిత్యావసర వస్తువులు, చెప్పులు, బట్టలు, అలంకరణ వస్తువులు.. ఇలా ప్రతీది అంగళ్లలో దొరుకుతాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రతి గురువారం జరిగే అంగడికి వేలాది మంది జనం వస్తుంటారు. పట్టణ ప్రజలే కాకుండా.. చుట్టుపక్కల మండలాల నుంచి కూడా వచి్చ.. తమకు అవసరమైనవన్నీ కొనుగోలు చేస్తారు.
కామారెడ్డిలో మరో ప్రత్యేకత ఏమిటంటే వాహనాల అంగడి కూడా ఉంటుంది. పశువులు, మేకలు, గొర్రెల అంగడి కూడా నిర్వహిస్తారు. దీంతో అంగడికి ఆదరణ ఏటేటా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. కాగా అంగట్లో పాత బట్టలకు భలే గిరాకీ కనిపిస్తోంది. అంగడిలో పాత బట్టల దందాను గమనిస్తే అనేక విషయాలు తెలిశాయి. నిరుపేదలు చాలామంది పాత బట్టలు కొనుగోలు చేస్తారని చెప్పారు. పిల్లలు, పెద్దలకు కావలసిన దుస్తులు పాతవి కొనుగోలు చేయడానికి చాలా మంది వస్తారు. రూ.10 నుంచి రూ.100 దాకా ధరలు ఉంటాయి. అమ్మేవారు ధర చెప్పగానే.. తమకు ఇంతకు కావాలంటూ బేరమాడి కొనుగోలు చేస్తారు.
చీరలకు భలే డిమాండ్
వానాకాలం పంటలు సాగవుతున్న సమయంలో పాత చీరలకు భలే డిమాండ్ ఉంది. చాలా మంది రైతులు అంగడికి వచ్చి చీరలు కొనుగోలు చేస్తున్నారు. పంట చేను చుట్టూరా రక్షణ కోసమంటూ చీరలు కడుతుంటారు. చిరిగిపోయిన చీరలు, దెబ్బతిన్న చీరలు ఒక్కొక్కటి రూ.10 నుంచి రూ.30 దాకా అమ్ముతున్నారు. ఒక్కొక్క రైతు ఇరవై, ముప్ఫయ్ చీరలు కొనుగోలు చేçస్తారన్నారు. మార్కెట్‌కు చీరల మూటలు ఎక్కువగా వస్తున్నాయి. స్థానికులతో పాటు నిజామాబాద్ నుంచి కూడా ట్రాలీ ఆటోలు, వ్యాన్ల నిండా చీరల మూటలు నింపుకొచ్చి అమ్ముతున్నారు.
స్టీల్ సామాన్లకు పాత బట్టలు కొనుగోలు
పల్లెలు, పట్టణాల్లో ఇంటింటికీ తిరుగుతూ.. వస్తుమారి్పడి దందా చేస్తారు. పాత బట్టలు ఇస్తే స్టీల్ పాత్రలు ఇస్తారు. చాలా ఇళ్లల్లో తొడుక్కోకుండా మూలన పడేసిన బట్టలను వీరికి అమ్ముతారు. అలా సేకరించిన బట్టలన్నింటినీ ముల్లెలు కట్టుకుని అంగళ్లకు తీసుకెళ్తారు. స్టీల్ సామాన్లకు పాత బట్టలు కొనుగోలు చేసిన వారు అంగళ్లలో అమ్ముతూ ఎంతో కొంత సంపాదించుకుంటారు. కొందరు పాతబట్టలు మంచిగా ఉంటే.. వాటిని శుభ్రం చేసి ఎక్కువ ధరలకు విక్రయిస్తుంటారు. మంచిగా ఉండే డ్రెస్సులు రూ.50 నుంచి రూ.100 దాకా అమ్ముతుంటారు. మామూలువి అయితే అంతకన్నా తక్కువకు ఇస్తారు.
రోజుకోచోట..
సాధారణంగా అంగళ్లు (వారపుసంతలు) రోజుకో చోట జరుగుతాయి. పెద్ద గ్రామాల్లో జరిగే అంగళ్లకు ఎక్కువగా బట్టలు తీసుకువెళ్లి అమ్ముతుంటారు. కామారెడ్డి అంగట్లో ప్రతి వారం వేలాది పాత బట్టలు అమ్ముడుపోతాయి. ఎక్కడెక్కడి నుంచో తీసుకువచ్చి అమ్ముతుంటారు. అంగట్లో ఓ వైపున పాత బట్టల దందా నడుస్తుంది. ఇతర ప్రాంతాల్లో వేరే రోజుల్లో జరిగే అంగళ్లకు కూడా వెళ్తారు. అక్కడ కూడా అమ్ముతుంటారు. పాత బట్టల దందా దశాబ్దాలుగా నడుస్తోంది. చాలామంది తాతల కాలం నుంచి దందా చేస్తున్నామని చెబుతున్నారు. పాత బట్టల దందా కొందరికి ఉపాధి ఇస్తుండగా, మరికొందరి అవసరం తీరుస్తుంది.