పెంగ్విన్లు ఏలియన్లా?

Scientists Says Penguin Birds Might Be Aliens - Sakshi

ఏలియన్స్‌ అంటే భూమి అవతల ఎక్కడో గ్రహాల్లోనో, సుదూర సౌర వ్యవస్థల్లోనో ఉన్నాయని అనుకుంటున్నాం. కానీ ఏలియన్స్‌ ఎప్పుడో భూమ్మీదికి వచ్చి ఉంటాయని, ఇప్పటికీ వాటి అవశేషాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఆ ఏలియన్స్‌ ఏమిటో తెలుసా..? మంచు ప్రాంతాల్లో తిరిగే పెంగ్విన్‌ పక్షులట. మరి 
ఈ విశేషాలు ఏమిటో చూద్దామా?

ఉండటమే చిత్రంగా..
భూమి ఉత్తర, దక్షిణ ధృవాల్లోని మంచు ప్రాంతాల్లో జీవించే పక్షులు పెంగ్విన్లు. మామూలుగానే అవి చిత్రంగా ఉంటాయి. పేరుకు పక్షులే అయినా ఎగరలేవు. నిటారుగా రెండు కాళ్లపై నిలబడతాయి, అలాగే నడుస్తాయి. నీటిలో బుడుంగున మునుగుతూ, తేలుతూ వేగంగా ఈదుతాయి. గుంపులు గుంపులుగా జీవిస్తాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. భూమ్మీద ఏ జీవిలోనూ లేని ఓ ప్రత్యేకమైన రసాయన పదార్థం పెంగ్విన్లలో ఉన్నట్టు తాజాగా గుర్తించడం ఆసక్తి రేపుతోంది.

శుక్రగ్రహంలోని రసాయనం
యూకేకు చెందిన లండన్‌ ఇంపీరియల్‌ కాలేజీ ప్రొఫెసర్‌ డేవ్‌ క్లెమెంట్స్‌ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు ఫాక్లాండ్‌ ప్రాంతంలోని గెంటూ రకం పెంగ్విన్లపై కొద్దిరోజులుగా పరిశోధన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటి విసర్జితాలను పరిశీలిస్తుండగా.. ‘ఫాస్పైన్‌’ అనే రసాయనం ఆనవాళ్లు లభించాయి. భాస్వరం, హైడ్రోజన్‌ మూలకాల సమ్మిళితం అయిన ఈ రసాయనం.. సాధారణంగా భూమ్మీది ఏ జీవిలోనూ ఉండదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గత ఏడాదే శుక్రగ్రహ వాతావరణంలో ‘ఫాస్పైన్‌’ జాడను కనిపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

హా 6.1 కోట్ల కిలోమీటర్ల దూరంలోని శుక్రుడిలో ఉన్న రసాయనం పెంగ్విన్ల విసర్జితాల్లో ఉండటం అంటే.. అవి బహుశా మరో ప్రపంచానికి చెందిన జీవులు (ఏలియన్లు) అయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అసలు పెంగ్విన్లలో ఈ రసాయనం ఎలా ఉత్పత్తి అవుతోందన్న దానిని పరిశీలిస్తున్నామని ప్రకటించారు.

ఫాస్పైన్‌.. వెరీ డేంజర్‌
ఫాస్పైన్‌ ప్రమాదకర వాయువు. అత్యంత విషపూరితమైనది. పీల్చుకుంటే నిమిషాల్లోనే ప్రాణాలు తీస్తుంది. వేగంగా మండిపోయే స్వభావం ఉంటుంది. దీనిని పారిశ్రామికంగా తయారు చేస్తారు.

కీటక నాశనులు, ఎలుకల మందు వంటివాటి తయారీలో వినియోగిస్తారు. కొన్ని పరిశ్రమల్లో మంటలకు ఇంధనంగా, సెమీకండక్టర్ల తయారీ ప్రక్రియలో వినియోగిస్తారు.

ఏలియన్ల జాడ తెలుసుకోవచ్చా?
పెంగ్విన్ల జీవన విధానం, వాటి శరీరంలోని రసాయనాలను పరిశీలించడం ద్వారా.. భవిష్యత్తులో ఏలియన్ల జాడను గుర్తించేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

గతంలో ఎప్పుడో గ్రహాంతర వాసులు భూమ్మీదికి వచ్చి వెళ్లి ఉంటారని.. ఆ క్రమంలోనే పెంగ్విన్ల వంటి ప్రత్యేక జాతులు అభివృద్ధి చెంది ఉంటాయని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top