సౌర కుటుంబంలోనే ఎలియన్స్‌! | Scientists Identify Aliens In Solar Family | Sakshi
Sakshi News home page

సౌర కుటుంబంలోనే ఎలియన్స్‌!

Jul 8 2021 2:46 AM | Updated on Jul 8 2021 2:50 AM

Scientists Identify Aliens In Solar Family - Sakshi

కొన్ని వందేళ్ల ఏళ్ల తర్వాత.. సరదాగా అలా అంతరిక్షంలోకి టూర్‌కు వెళ్లొచ్చే టెక్నాలజీ వచ్చేసింది.. చంద్రుడి మీదకు, అంగారకుడి (మార్స్‌) మీదకు వెళ్లినవాళ్లు.. ఇంకాస్త లాంగ్‌ టూర్‌ వేద్దామని శనిగ్రహం దాకా వెళ్లారు.. దాని ఉపగ్రహాల్లో ఒకటైన ఎన్సలాడెస్‌పై దిగారు.. అక్కడ వారిని ఏలియన్స్‌ బంధించాయి.. మనుషులు ఎలాగోలా తప్పించుకుని వెనక్కి వచ్చేశారు. ఇదంతా హాలీవుడ్‌ సినిమా కథలా ఉన్నా.. భవిష్యత్తులో నిజం కూడా కావొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎన్సలాడెస్‌ మీద జీవం ఉండే అవకాశాలు ఎక్కువని చెప్తున్నారు. మరి ఈ సంగతులేమిటో తెలుసుకుందామా?     – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

మనం ఒంటరి వాళ్లం కాదు 
కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు.. పెద్ద సంఖ్యలో గ్రహాలు.. ఇంత విశాల విశ్వంలో మనం ఒంటరి వాళ్లమేనా? భూమి అవతల ఎక్కడైనా జీవం ఉందా? ఎప్పటి నుంచో తొలిచేస్తున్న ప్రశ్నలివి. అందుకే సౌర కుటుంబంలోగానీ, బయట ఇంకెక్కడైనాగానీ జీవం ఉందేమో అన్న దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. జీవం ఉండటానికి అనుకూలమైన పరిస్థితులు ఏమాత్రమైనా ఉన్నాయా అన్నది పరిశీలిస్తూనే ఉన్నారు. ఈ కోవలోనే నాసా ప్రయోగించిన కాస్సిని వ్యోమనౌక అందించిన సమాచారంతో ఎన్సలాడెస్‌ మీద జీవం ఉండే అవకాశం ఉందని తాజాగా అంచనా వేశారు. 

ఎన్సలాడెస్‌ ఏంటి? 
భూమికి చంద్రుడు ఉన్నట్టే ఇతర గ్రహాలకు కూడా ఉపగ్రహాలు ఉన్నాయి. అలా శనిగ్రహానికి ఉన్న 82 ఉపగ్రహాల్లో ఒకటి ఎన్సలాడెస్‌. దీని మీద 32.9 గంటలకు ఒక రోజు గడుస్తుంది. మన చంద్రుడిలో ఏడో వంతు ఉండే ఈ ఉపగ్రహం వ్యాసార్థం (డయామీటర్‌) సుమారు 500 కిలోమీటర్లు. దీని ఉపరితలం మొత్తం 30 కిలోమీటర్ల మందమైన మంచు పొరతో కప్పబడి ఉందని, మంచుకు, మట్టి ఉపరితలానికి మధ్య మంచి నీళ్లు ఉన్నాయని నాసా శాస్త్రవేత్తలు కాస్సిని వ్యోమనౌక సహాయంతో కొన్నేళ్ల కిందే తేల్చారు. ఎన్సలాడెస్‌ ఉత్తర ధ్రువంలోని వేడినీటి ఊటల నుంచి భారీగా నీటి ఆవిరి అంతరిక్షంలోకి ఎగజిమ్ముతున్నట్టు గుర్తించారు. ఆ నీటి ఆవిరిలో మిథేన్‌ ఉందని తేల్చారు. దీనిపై అరిజోనా, పారిస్‌ సైన్సెస్‌ అండ్‌ లెట్రెస్‌ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. తాజాగా ఆ వివరాలను వెల్లడించారు.  

మిథేన్‌.. జీవం ఉనికికి సాక్ష్యం
సౌర కుటుంబంలోగానీ, అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు వేటిలోగానీ సహజంగా మిథేన్‌ వాయువు ఉండదు. ఇది జీవక్రియల్లో భాగంగానే వెలువడుతుందని, జీవజాలం ఉన్నచోట మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎన్సలాడెస్‌ నుంచి మిథేన్‌ గ్యాస్‌ విడుదలవడానికి అక్కడ మెథనోజెన్స్‌గా పిలిచే సూక్ష్మజీవులు ఉండటమే కారణమని అంచనా వేస్తున్నారు. ‘‘భూమ్మీద సముద్రాల అడుగున ఈ మెథనోజెన్స్‌ ఉంటాయి.

అవి డైహైడ్రోజన్, కార్బన్‌డయాౖక్సైడ్‌ను ఉపయోగించుకుని మిథేన్‌ వాయువును ఉత్పత్తి చేస్తాయి. ఎన్సలాడెస్‌ నుంచి విడుదలవుతున్న నీటి ఆవిరిలో డైహైడ్రోజన్, కార్బన్‌ డయాక్సైడ్‌తోపాటు మిథేన్‌ కూడా గణనీయ స్థాయిలో ఉంది. ఎన్సలాడెస్‌ పై దట్టమైన మంచుపొర, దాని కింద లోతున నీళ్లు ఉన్నాయి. అంటే భూమ్మీద సముద్రాల అడుగున ఉండేలాంటి పరిస్థితే అక్కడా ఉంది. ఈ లెక్కన సూక్ష్మజీవులు ఉండే అవకాశాలు ఎక్కువే.. ’’ అని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్‌ రెజిస్‌ ఫెర్రీర్‌ వెల్లడించారు. కాస్సిని గుర్తించిన వాయువుల ఆధారంగానే కాకుండా.. ఎన్సలాడెస్‌పై ఉండే వాతావరణం, రసాయనిక పరిస్థితులను గణిత మోడళ్ల ఆధారంగా విశ్లేషించి ఈ అంచనాకు వచ్చామని తెలిపారు. 

సూక్ష్మజీవులు ఉంటే చాలా? 
భూమ్మీద కూడా జీవం మొదలైంది సూక్ష్మజీవుల నుంచే.. మొదట్లో భూమి వాతావరణం, నేలపొరల్లో పరిస్థితులకు అనుగుణంగా ఏర్పడిన రసాయనిక సమ్మేళనాల నుంచే జీవ పదార్థం పుట్టింది. తొలుత ఏర్పడిన ఏకకణ జీవులు క్రమంగా అభివృద్ధి చెందుతూ.. ఇంత విస్తారమైన జీవజాలం రూపొందింది. ఇప్పుడు ఎన్సలాడెస్‌పై కూడా సూక్ష్మజీవులు ఉండి ఉంటే.. అక్కడ భవిష్యత్తులో జీవం అభివృద్ధికి అవకాశం ఉన్నట్టేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  

యురోపాపైనా పరిశోధనలు 
సూర్యుడి చుట్టూ తిరుగుతున్న గ్రహాలు, వాటి ఉపగ్రహాల్లో..భూమి,ఎన్సలాడెస్‌తోపాటు గురుగ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహం యురోపాపై కూడా మంచు, నీళ్లు ఉన్నాయి. అక్కడ కూడా జీవం ఉండవచ్చన్న దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement