కొండముచ్చు అంటే హీరో లెక్క.. కానీ, వాటికి ఎంత కష్టమొచ్చింది!

The scene is reversed to scare the monkeys - Sakshi

కొండముచ్చు అంటే హీరో లెక్క..  ఇంతోటి మనం కూడా ఏమీ చేయలేని కోతుల సమస్యకు అది చిటికెలో పరిష్కారం చూపేది..  రంగంలోకి దిగిందంటే.. ఎలాంటి అల్లరి కోతులైనా తోకలు ముడిచి, పారిపోవాల్సి వచ్చేది..  

ఇదంతా నిన్నమొన్నటి సంగతి..
మరి ఇప్పుడు..  సీను రివర్సైంది.. కొండముచ్చులకే కష్టమొచ్చింది..  వీటిని చూస్తే భయపడే కోతులే..  వీటిని భయపెట్టడం మొదలుపెట్టాయి..  

సాక్షి, హైదరాబాద్‌: కొండెంగలు, కోతులు ఒకే రకం జాతికి చెందినవైనా... కొండమచ్చులు అడవుల్లోపలే ఉంటే.. కోతులు మాత్రం రహదారులకు దగ్గరగా ఉండడంతో పాటు ఊర్లు, పట్ట ణాల్లో ఎక్కువగా సంచరిస్తాయి. ఈ రెండింటి మధ్య జాతివైర మనేది ఏదీ లేకపోయినా కోతుల కంటే ఎక్కువ బరువు, సైజులో రెండు, మూడింతలు పెద్దగా ఉండే.. కొండముచ్చులు నల్లటి ముఖాలు, పొడవాటి తోకలతో ఒకింత భయం గొలి పేలా ఉంటాయి. దీంతో వీటికి కోతులు భయపడతాయనే అభి ప్రాయం ఎప్పటి నుంచో స్థిరపడింది. దీనికి తగ్గట్టుగానే గతంలో చాలా సందర్భాల్లో ఊళ్లలో కోతులను భయపెట్టి తరిమేసేందుకు కొండముచ్చులను ఉపయోగించారు.

ఇప్పుడూ రాష్ట్రంలో కోతుల బెడద ఎక్కువున్న గ్రామాల్లో అదే పద్ధతిని ఉపయోగి స్తున్నారు. అయితే, మొదట్లో కొండముచ్చులను చూసి కొన్ని చోట్ల కోతులు వెనక్కు తగ్గినా.. మారిన కాలమాన పరిస్థితులు, మారిన కోతుల ఆహార అలవాట్లు, సొంతంగా కష్టపడకుండానే ఆహారం సంపాదించే మార్గాల కోసం జనావాసాలపై పడడం వంటి పరిణామాలతో వాటి స్వభావా ల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో కోతులు వాటికి భయపడడం మానే శాయి. ఇంతటితో ఆగకుండా కొండ ముచ్చులనే భయపెట్టే పరిస్థితులు ఏర్పడడంతో గ్రామ స్తులు తలలు పట్టుకుంటు న్నారు.

పైగా.. కొన్ని చోట్ల రెండింటి మధ్య ‘ఫ్రెండ్‌షిప్‌’ మొద లవడంతో సమస్య సంక్లిష్టంగా మారింది. కోతులకు తోడు కొత్తగా కొండెంగలు కూడా తిష్ట వేయడంతో ఈ రెండింటి బారి నుంచి ఎలా బయటపడాలో తెలియక గ్రామప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఇదిలా ఉండగా.. కోతులను భయ పెట్టేందుకు కొండెంగలను తీసుకురావడాన్ని వన్యప్రాణి హక్కుల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వన్య ప్రాణి చట్టాలను ఉల్లంఘించి వాటిని తీసుకురావడానికి బదులు కోతుల బెడద నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచిస్తున్నారు.

ఈ జిల్లాల్లో సమస్య ఎక్కువ..
కోతులతో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లడంతో పాటు, ఇళ్లపైకి గుంపులుగా దాడి చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య ప్రధానంగా...ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లో ఉంది. వివిధ గ్రామపంచాయతీల పరిధిలో కోతుల నియంత్రణకు కొండెంగలను ఉపయోగిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం కొత్తపల్లి లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కొండముచ్చులను పెంచారు.

కోతుల సమస్య కొంత నియంత్రణలోకి రావడంతో చుట్టుపక్కల ఊళ్ల వారు కూడా వాటిని తీసుకెళ్లి కొంతకాలం ఆయా ఊళ్లలో తిప్పుకున్న సందర్భాలున్నాయి. కరీంనగర్‌ జిల్లాలో పలుచోట్ల పాఠశాలల్లో విద్యార్థులకు రక్షణగా కొండముచ్చులను పెంచారు. కరీంనగర్‌ జిల్లా అల్గునూరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ ప్రతిభా గురుకుల కేంద్రం కాలేజీలో వీటి సేవలను వినియోగించారు.

వాటిని తేవడం చట్టవిరుద్ధం...
‘‘వన్యప్రాణి సంరక్షణ చట్టంలో భాగంగా షెడ్యూల్‌–1 జాతికి చెందిన కొండముచ్చులను (లంగూరు) తీసుకురావడం చట్టవ్యతిరేకం. అడవుల్లోని కొండెంగలను పట్టి జనావాసాల్లోకి తీసుకురావడాన్ని చట్టం అనుమతించదు. వాటిని తీసుకొస్తే కోతుల సమస్య పరిష్కారమవుతుందని ప్రజలు భావించడం హేతుబద్ధం కాదు. బలవంతంగా తీసుకొచ్చి బంధించి పెడితే తప్ప. మనుషులున్న చోట అవి ఎక్కువగా ఉండవు’’ – అటవీశాఖ వైల్డ్‌ లైఫ్‌ విభాగం ఓఎస్‌డీ ఎ.శంకరన్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top