
సాక్షి, కాళేశ్వరం: తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారుజామున మాధవానంద సరస్వతీ స్వామి పుష్కరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సరస్వతీ నది వద్ద మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక పూజలు చేశారు. త్రివేణి సంగమం వద్ద పుష్కర్ స్థానం ఆచరించి కుటుంబ సమేతంగా ప్రత్యేక అర్చనలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు దంపతులు.

ఇక, కాళేశ్వరాలయం నుంచి మంగళ వాయిద్యాలతో నదికి వెళ్లి గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ నిర్వహిస్తారు. పుష్కరునికి చీర, సారెతో ఒడి బియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. తర్వాత భక్తులందరూ పుష్కర సంకల్ప స్నానం చేస్తారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు కొనసాగనున్నాయి. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ తొలిసారి సరస్వతీ పుష్కరాలు జరుగుతున్నాయి. రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
పుష్కరాలకు సీఎం రేవంత్‌రెడ్డి
సరస్వతీ పుష్కరాల్లో కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సరస్వతీ ఘాట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ పుణ్యస్నానం ఆచరిస్తారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పుష్కరాలకోసం దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.

పుష్కరాల పవిత్రతను కాపాడాలి
సరస్వతీ నది పుష్కరాల పవిత్రతను కాపాడుకోవడా నికి అందరూ చేతులు కలపాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగను న్న సరస్వతీ నది పుష్కరాలను పురస్కరించుకుని కాలుష్య నియంత్రణ బోర్డు రూపొందించిన పోస్టర్‌ను బుధవారం మంత్రి ఆవిష్కరించారు.