అందరి సెంటిమెంట్‌ అబంగాపురం

Sagar By polls 2021 All Parties Campaingh Sentiment From Abangaouram - Sakshi

త్రిపురారం : నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో చిట్టచివరి గ్రామమైన అబంగాపురం నుంచి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ సెంటిమెంట్‌ను ప్రతి ఎన్నికల్లో సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి 40 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గ కేంద్రానికి అబంగాపురం గ్రామం చిట్టచివరి ఊరుగా ఉండంతోపాటు ఈశాన్య దిక్కుగా ఉంది. ఈ గ్రామంలో పూర్వకాలం నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. జానారెడ్డి ప్రతి ఎన్నికల్లో ఈశాన్య దిక్కున ఉన్న అబంగాపురం గ్రామంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రాంభించడం నాటి నుంచి నేటి వరకు కొనసాగుతోంది. సాగర్‌ నియోజకవర్గంలోని అబంగాపురం గ్రామం త్రిపురారం మండలంలో ఉండేది. కానీ మండలాల పునర్విభజన సందర్భంగా ఈ గ్రామాన్ని మాడుగులపల్లి మండలంలోకి మార్చారు. అయినప్పటికీ సాగర్‌ నియోజకవర్గంలోనే కొనసాగుతూ చిట్టచివరి ఊరుగా ఈశాన్య దిక్కున ఉంది.

జానారెడ్డి సెంటిమెంట్‌ను 2018 ఎన్నికల్లో దివంగత నేత నోముల నర్సింహయ్య కూడా కొనసాగిస్తూ అబంగాపురం గ్రామంలో ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించి టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నోముల నర్సింహయ్య మరణానంతరం జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆయన తనయుడు నోముల భగత్‌యాదవ్‌ కూడా ఎన్నికల ప్రచారాన్ని తన తండ్రి ప్రారంభించిన గ్రామం నుంచే ప్రారంభించడం విశేషం. ఇదే సెంటిమెంట్‌ను బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ రవికుమార్‌నాయక్‌ కూడా పాటిస్తూ అబంగాపురం గ్రామంలో ఆంజనేయస్వావిుకి పూజలు నిర్వహించి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కొన్ని రోజుల కిందట జానారెడ్డి గెలుపును కాంక్షిస్తు ఆయన తనయుడు కుందూరు రఘువీర్‌రెడ్డి కూడా ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించి కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top