Bathukamma: ఈ ఏడాది సద్దుల బతుకమ్మ వేడుకలు రెండు రోజులు ఎందుకంటే?

Saddula Bathukamma Festival different dates in different areas - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉత్సాహంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు ముగింపుదశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఏడు రోజుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ వేడుకలను ముగించుకున్న తెలంగాణ ఆడపడుచులు వెన్నముద్దల బతుకమ్మ సంబరానికి సిద్దమవుతున్నారు. 

అయితే ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో సద్దుల బతుకమ్మను నిర్వహించుకుంటున్నారు.  బతుకమ్మ ముగింపు ఉత్సవాల ముగింపు వేడుక అయిన సద్దుల బతుకమ్మ పండుగ  కొన్ని ప్రాంతాలు నేడే నిర్వహిస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో రేపు (గురువారం) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ విద్వత్సభ, జ్యోతిష్య పండితులు, పూజారులు వేర్వేరు తేదీలు ప్రకటించడంతో స్థానిక సాంప్రదాయం ప్రకారం నిర్వహించుకునేందుకు ఆయా ప్రాంతాల వాసులు రడీ అవుతున్నారు. 

దుర్గాష్టమినాడే సద్దుల బతుకమ్మగా పండితులు నిర్ణయించగా,  కొండపాక, వేములవాడల్లో ఏడు రోజులు నిర్వహిస్తారని, కొన్ని ప్రాంతాల్లో 9, మరికొన్ని ప్రాంతాల్లో 11, 13 రోజులు ఆడతారని తెలంగాణ విద్వత్సభ అధ్యక్షుడు చంద్రశేఖర సిద్ధాంతి పేర్కొన్నారు.అయితే తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడాల్సిందే అని తీర్మానించుకున్న వారు గురువారం సద్దుల బతుకమ్మను నిర్వహించుకోనున్నారు. ఇక  హైదరాబాద్‌లో దుర్గాష్టమినాడే (నేడే) బతుకమ్మ ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఎంఎల్‌సీ కవిత కూడా ఈ మేరకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెపుతూ ట్వీట్‌ చేశారు.

ఇక బతుకమ్మ పండుగలో 8వ రోజును 'వెన్నముద్దల బతుకమ్మ'గా బతుకమ్మను ఆరాధిస్తారు. ఈరోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు, మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆట, పాటలతో బతుకమ్మ ఆడి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఈరోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడతారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top