వైఎస్‌ కుటుంబాన్ని కొట్టేందుకు... నాపై ఐదు సీబీఐ కేసులు పెట్టారు.. | Sabitha Indra Reddy allegation against the Congress party | Sakshi
Sakshi News home page

వైఎస్‌ కుటుంబాన్ని కొట్టేందుకు... నాపై ఐదు సీబీఐ కేసులు పెట్టారు..

Mar 27 2026 3:44 AM | Updated on Mar 27 2026 3:44 AM

Sabitha Indra Reddy allegation against the Congress party

కాంగ్రెస్‌ పార్టీ పై సబితా ఇంద్రారెడ్డి ఆరోపణ 

తనను సభలో ‘దొరసాని’అనడంపై అభ్యంతరం  

వాళ్లు ఉన్నత వర్గాలు..  తాము అడవి బిడ్డలమని మంత్రి సీతక్క ఘాటు విమర్శ 

సబిత, సీతక్క మధ్య వాగ్వాదం 

సాక్షి, హైదరాబాద్‌: ‘నేను కాంగ్రెస్‌లో ఉన్నన్ని రోజులు పార్టీకి సేవ చేసిన. పార్టీ నాకు మంత్రి పదవి ఇచ్చింది. సోనియా గాందీకి, ఆ రోజు సీఎంగా ఉన్న వైఎస్‌ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్‌కి .. మొన్న మంత్రిపదవి ఇచ్చిన కేసీఆర్‌కు థ్యాంక్స్‌. పార్టీ మంచి చేసిందని చెప్పుకున్నప్పుడు పార్టీ చేసిన నష్టం కూడా చెప్పుకుంటాం. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కొట్టడానికి నాపై ఐదు సీబీఐ కేసులు పెట్టలేదా? అసెంబ్లీలో సీఎం రేవంత్‌ నాపై మాట్లాడే వరకు నేను కాంగ్రెస్‌ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఆవేదనతోనే మాట్లాడుతున్న. నిజాయితీగా ఉన్నందుకే కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నం’అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సభ్యులు పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్‌ పద్దులపై శాసనసభలో గురువారం రాత్రి జరిగిన చర్చలో మంత్రి సీతక్క చేసిన విమర్శలకు స్పందిస్తూ సబిత పైవిధంగా స్పందించారు. ‘ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు మంత్రి సీతక్క మొన్న నా మీద పడ్డారు. ఇప్పుడు సునీతా రెడ్డిపై పడ్డారు. నేను తనకు పోటీ కాదు. తను కాంగ్రెస్‌లో.. నేను బీఆర్‌ఎస్‌లో ఉన్నాం. మొన్న హరీశ్‌రావు మాట్లాడుతున్నప్పుడు.. నేను అయ్యో అన్నందుకే నన్ను దొరసాని అన్నారు. కేసీఆర్‌ కుటుంబాన్ని, సబితమ్మను తిడితే సీఎం సంతోషపడతారేమో’అని సబిత ఘాటుగా విమర్శించారు.  

బీఆర్‌ఎస్‌ వారికి ఇష్టం లేదు: సీతక్క  
అంతకు ముందు మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పల్లెల్లో నీటి సరఫరా జరగడం లేదని అసత్య ఆరోపణలు చేశారంటూ సబితను తప్పుబట్టారు. ‘నాలాంటి వాళ్లు పంచాయతీరాజ్‌ శాఖను నిర్వహించడం వారికి ఎట్లానూ ఇష్టం లేదు. ఆదివాసీల నుంచి మంత్రి కావడం బీఆర్‌ఎస్‌ వారికి ఏమాత్రం ఇష్టం లేదు..’అని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ కేసులు పెట్టిన తర్వాత కూడా సబిత కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యే అయ్యారని, ఆ తర్వాత ఆమెను ఓడించడానికి ప్రయత్నించిన వారి పార్టీలో చేరారని విమర్శించారు. 

సబిత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాలను బీఆర్‌ఎస్‌ వారు విమర్శిస్తున్నప్పుడు ఆమె.. అవును.. అవును అని మద్దతు తెలపడంతోనే ఆవేశం వచ్చి ఆ రోజు ..‘అయ్యో దొరసాని’అన్నానని సీతక్క వివరణ ఇచ్చారు. సబితకు తనపై ద్వేషం ఉండొచ్చని, ఆమె బీఆర్‌ఎస్‌లోకి పోవడంతో తనకు మంత్రి పదవి వచి్చందని ఆమె భావిస్తుండవచ్చని సీతక్క పేర్కొన్నారు. 

‘ఆమె కేటగిరీ వేరు, నా కేటగిరీ వేరు, ఆమె రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. వాళ్లది హైదరాబాద్‌ సిటీ. వాళ్లు ఉన్నత వర్గాలు. మేము అడవి బిడ్డలం. మాకు ఎక్కడ కూడా వాళ్లతో పోలిక లేదు’అని సబితను ఉద్దేశించి సీతక్క వ్యాఖ్యానించగా, కులం ప్రస్తావన ఎందుకు? అని బీఆర్‌ఎస్‌ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సబిత స్పందిస్తూ తాము వ్యవస్థలో లోపాలు ఎత్తిచూపుతామని, కులం, మతం చూడమని స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement