తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ | RTC workers call off strike in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ

Apr 25 2026 6:37 AM | Updated on Apr 25 2026 8:36 AM

RTC workers call off strike in Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. శనివారం ఉదయం షిఫ్ట్‌ నుంచే బస్సులు నెమ్మదిగా రోడ్డెక్కడం ప్రారంభించాయి. ఆర్టీసీ జేఏసీ సంఘాలతో నిన్న రాత్రి దాకా మంత్రుల సబ్‌ కమిటీ భేటీ జరిపింది. కీలకమైన మూడు డిమాండ్లు సహా అన్నింటికీ ప్రభుత్వం అంగీకరించింది. ఆ చర్చలు ఫలవంతం కావడంతో విధులకు హాజరవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు.

తొలుత 32 డిమాండ్లపై ఆర్టీసీ సంఘాల నేతలు సచివాలయంలో ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. అనంతరం  మంత్రుల సబ్‌ కమిటీతో భేటీ అయ్యి చర్చించారు. కొన్నింటిపై సులువుగానే సమ్మతి రాగా, ప్రధాన డిమాండ్లపై మంత్రుల నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2021, 2025 వేతన సవరణలు, ఆర్టీసీలో కార్మీక సంఘాల పునరుద్ధరణ.. ఈ మూడు డిమాండ్లపై ప్రతిష్టంభన  నెలకొంది. దీంతో ఏకంగా 13 గంటలపాటు చర్చలు జరిగాయి. 

కొద్దిసేపు మంత్రులు, కార్మిక సంఘాల నేతలు విడివిడిగా వాళ్లలో వాళ్లే చర్చించుకున్నారు. ప్రధాన డిమాండ్లపై సయోధ్య కుదరకపోవటం, వేతన సవరణ ఫిట్‌మెంట్‌ శాతం మీద ఏకాభిప్రాయం రాకపోవటంతో చర్చల్లో అర్ధరాత్రి వరకు ప్రతిష్టంభన కొనసాగింది. అర్ధరాత్రి సమయంలో వీటికి మంత్రులు ఓకే చెప్పారు. 

గత ప్రభుత్వ హయాంలో మూడొంతులు పూర్తయిన... ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు అంగీకరించారు. 2021 వేతన సవరణకు సంబంధించి ఏడు శాతంతో మొదలై చివరకు 10 శాతం మేరకు మంత్రులు ప్రతిపాదించిన ఫిట్‌మెంట్‌కు కార్మీక సంఘాల నేతలు సమ్మతించారు. కార్మిక సంఘాలను పునరుద్ధరించి ఎన్నికలు జరిపేందుకు కూడా మంత్రులు అంగీకరించారు. మిగతా డిమాండ్లను ఆర్టీసీ బోర్డు, ఎండీ ఆధ్వర్యంలో పరిష్కరిస్తారని మంత్రులు పేర్కొనటంతో కార్మిక సంఘాల సమ్మె విరమణకు అంగీకరించాయి. చివరకు రాత్రి 12.30కు సయోధ్య కుదరటంతో సమ్మె విరమణ ప్రకటన చేశారు. దీంతో మూడు రోజులపాటు బస్సుల్లేక అవస్థలు ఎదుర్కొన్న ప్రయాణికులకు ఊరట లభించినట్లైంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement