Telangana: ఆర్టీసీ కీలక నిర్ణయం.. వారికి ఉద్యోగాలకు ఓకే!

RTC OK to give Alternative job to Descendants of RTC Employees - Sakshi

అనారోగ్యంతో ‘అన్‌ఫిట్‌’ అయినవారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం 

మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ స్కీమ్‌ పునరుద్ధరణ

సాక్షి, హైదరాబాద్‌:  అనారోగ్యం, శారీరక సమస్యల కారణంగా విధులకు హాజరుకాలేని ఆర్టీసీ ఉద్యోగుల వారసులకు ప్రత్యామ్నాయ ఉద్యోగం ఇచ్చేందుకు ఆర్టీసీ ఓకే చెప్పింది. ఈ మేరకు సదరు ఉద్యోగి భార్య/భర్త/పిల్లలకు ఉద్యోగం కల్పించే ‘మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ స్కీమ్‌’ను పునరుద్ధరించింది. అయితే తొలి మూడేళ్ల పాటు తాత్కాలిక పద్ధతిన నియమించి, నిర్ణీత వేతనం (కన్సాలిడేటెడ్‌ పే) ఇస్తామని.. పనితీరు బాగుంటే ఆ తర్వాత పూర్తి స్థాయి నియామకం చేస్తామని ప్రకటించింది. 

మూడేళ్ల కింద ఆగిపోయి..
ఆర్టీసీలో 2019కి ముందు వరకు ‘మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ స్కీమ్‌’ అమల్లో ఉండేది. కోవిడ్, ఆర్థిక ఇబ్బందులు, నష్టాల నేపథ్యంలో ఆర్టీసీ దాన్ని నిలిపేసింది. ఇటీవల డీజిల్‌ సెస్, ఇతర మార్గాల్లో ఆదాయం పెరగడంతో ఈ పథకాన్ని పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆర్టీసీలో ఇలా ఉద్యోగాల కోసం 255 మంది ఎదురుచూస్తున్నారు. మరోవైపు విధుల్లో ఉండగా చనిపోయిన ఉద్యోగుల స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగమిచ్చే కారుణ్య నియామకాల పథకానికి (బ్రెడ్‌ విన్నర్‌ స్కీం) కూడా ఆర్టీసీ ఇటీవలే అవకాశం కల్పించింది. అయితే గతంలో ఈ రెండు స్కీముల కింద నేరుగా నియామకాలు చేపట్టేవారు. కానీ ఇప్పుడు తాత్కాలిక, కన్సాలిడేటెడ్‌ పే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. 

మూడేళ్ల తర్వాత పనితీరు బాగుంటుంటేనే.. 
అన్‌ఫిట్, కారుణ్య నియామకాలకు సంబంధించి తొలి మూడేళ్ల పాటు తాత్కాలిక నియామకాలు, కన్సాలిడేటెడ్‌ పే (స్థిరమైన మొత్తం చెల్లింపు) పద్ధతిలో జీతం చెల్లింపు విధానాన్ని ఆర్టీసీ అమల్లోకి తెచ్చింది. ఈ మూడేళ్లలో వారి పనితీరుకు సంబంధించి 38 అంశాలను పరిశీలిస్తారు. వీటిలో సానుకూలత పొంది, మూడేళ్లపాటు ఏటా కనీసం 240 పనిదినాలు విధులకు హాజరైన వారిని మా త్రమే పూర్తిస్థాయి నియమకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. వారి అర్హతలను బట్టి గ్రేడ్‌–2 డ్రైవర్, గ్రేడ్‌–2 కండక్టర్, శ్రామిక్, ఆర్టీసీ కానిస్టేబుల్‌ పోస్టుల్లో నియమిస్తారు. గ్రేడ్‌–2 డ్రైవర్‌కు నెలకు రూ.19 వేలు, గ్రేడ్‌–2 కండక్టర్‌కు రూ.17 వేలు, మిగతా రెండు పోస్టులకు రూ.15 వేల చొప్పున కన్సాలిడేటెడ్‌ పేను ఖరారు చేశారు. 

సీనియారిటీ ప్రకారం ఉద్యోగం 
సంస్థలో రిటైర్మెంట్ల ఆధారంగా ఖాళీలు ఏర్పడే కొద్దీ వీరికి పోస్టింగ్‌ ఇస్తారు. ఇప్పటికే ఎంపికై పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న వారిని ముందుగా నియమిస్తారు. మిగతావారిలో ముందు అన్‌ఫిట్‌ అయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ముందు పద్ధతిలో ఎంపిక చేస్తారు. అయితే విధి నిర్వహణలో ఉండి యాక్సిడెంట్లలో గాయపడి, అన్‌ఫిట్‌ అయినవారి కుటుంబ సభ్యులకు మాత్రం సీనియారిటీతో సంబంధం లేకుండా తొలుత పోస్టింగ్‌ ఇవ్వనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top