నమ్మకంగా నయవంచన | Robberies and Murders Under the Guise of Caregivers and Caretakers | Sakshi
Sakshi News home page

నమ్మకంగా నయవంచన

May 17 2026 12:38 AM | Updated on May 17 2026 12:38 AM

Robberies and Murders Under the Guise of Caregivers and Caretakers

సపర్యల పడగ నీడలో వయో వృద్ధులు 

కేర్‌ గివర్స్, కేర్‌ టేకర్స్‌ ముసుగులో దోపిడీలు, హత్యలు  

వివిధ రకాల ఏజెన్సీల ద్వారా సహాయకులుగా చేరుతున్న వైనం  

కొన్నాళ్లు నమ్మించి, రెక్కీ నిర్వహించి అదను చూసి ఘాతుకాలు 

పనిలో పెట్టుకునే ముందు పలు జాగ్రత్తలు తప్పనిసరి అనే సూచనలు

సాక్షి, హైదరాబాద్‌: ఒంటరి వృద్ధ జంటల్ని, ఒకవేళ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నా..వారు ఇంట్లో లేని సమయంలో వృద్ధుల్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వృద్ధులకు అవసరమైన సపర్యలు చేసేందుకు ఇళ్లల్లో పని మనుషులుగా, కేర్‌ గివర్స్‌గా, కేర్‌ టేకర్స్‌గా చేరుతున్న ఇతర రాష్ట్రాలవారు, నేపాల్‌ వంటి దేశాలకు చెందినవారిలో కొందరు నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారు. ఆభరణాలు దొంగిలించి పరారవుతున్నారు. ఈ క్రమంలో అవసరమైతే వృద్ధుల ప్రాణాలు తీస్తున్నారు. హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. పోలీసులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నా ఇలాంటి వారి విషయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 

పుట్టగొడుగుల్లా ఏజెన్సీలు 
వయో వృద్ధులకు వైద్య సహాయకులను, వ్యక్తిగత సేవకులను అందజేసే నెపంతో ఊరూ పేరు లేని కేర్‌ గివర్స్‌ ఏజెన్సీలు నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఏ విధమైన చట్టబద్ధత, గుర్తింపు లేని ఇలాంటి సంస్థల ద్వారా అటెండెంట్లు, పని మనుషులుగా చేరుతున్న వారు దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతుండటం గమనార్హం. గ్రేటర్‌ హైదరాబాద్‌లో అన్ని విధాలుగా చట్టబద్ధమైన గుర్తింపు కలిగిన కేర్‌ గివింగ్‌ ఏజెన్సీలు 80 వరకు ఉన్నట్లు అనధికార అంచనా. కానీ ఏ గుర్తింపు లేని సంస్థలు మాత్రం వందల సంఖ్యలోనే ఉన్నట్లు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

వణికించిన ఉదంతాలు 
పదవీ విరమణ చేసిన పోలీసు ఉన్నతాధికారి భార్యను నేపాలి ముఠా హతమార్చి దోపిడీకి పాల్పడిన ఘటన మరిచిపోకుండానే జవహర్‌నగర్‌ పరిధిలోని కౌకూర్‌ గోల్ఫ్‌ ఎన్‌క్లేవ్‌లో ఇలాంటిదే మరో ఉదంతం చోటుచేసుకుంది. పని మనుషులుగా చేరిన నేపాలీ భార్యాభర్తలు కొంతకాలం నమ్మకంగా ఉంటున్నట్టు నటించి పక్కా పథకం ప్రకారం వృద్ధ దంపతులను బంధించి ఇల్లంతా దోచుకెళ్లారు.

ఈ సంఘటనలో ఆ నేపాలీ గ్యాంగ్‌ను వృద్ధ దంపతులు ఏవిధంగానూ ప్రతిఘటించక పోవడంతో వారు బతికి బట్టకట్టారు. ఇటీవల కొద్ది రోజుల వ్యవధిలోనే జరిగిన ఈ సంఘటనలే కాకుండా నగరంలో తరచుగా ఎక్కడో ఒకచోట ఇలాంటివి చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తెలిసిన వారి ద్వారా లేదా రకరకాల ఏజెన్సీల ద్వారా పని మనుషులు, కేర్‌ టేకర్లు, అటెండెంట్లుగా చేరుతున్నవాళ్లు కొన్ని సందర్భాల్లో రెండు, మూడు సంవత్సరాల పాటు నమ్మకంగా పని చేసి ఆ తర్వాత దురాగతాలకు పాల్పడుతున్నారు. 

ఏజెన్సీల ద్వారా చేరి.. 
వయోభారం, అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమైన వృద్ధులకు డైపర్లు మార్చడం, స్నానం చేయించడం, వేళకు మందులు ఇవ్వడంతో పాటు నర్సింగ్‌ విధులు నిర్వహించేందుకు కేర్‌ గివర్స్‌ను నియమించుకుంటారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండేవారు, 12 గంటల పాటు పని చేసేవారు, లేదా ఉదయం, సాయంత్రం మాత్రమే వచ్చి సపర్యలు చేసేవారు ఏజెన్సీల ద్వారా అందుబాటులో ఉంటూ అవసరమైన వారివద్ద విధుల్లో చేరుతున్నారు.

ఇందుకోసం రూ.15000, రూ.25000, రూ.30,000 చొప్పున ఏజెన్సీలు వసూలు చేస్తున్నాయి. హెల్పేజ్‌ ఇండియా సంస్థ అధ్యయనం ప్రకారం గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 10 లక్షల మంది ఒంటరి వయోధికులు లేదా వృద్ధులైన భార్యాభర్తలు ఈ రకమైన సేవలను వినియోగించుకుంటున్నారు. పిల్లలు విదేశాల్లో ఉన్న కొందరు వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం పొందుతుండగా, మరి కొందరు ఇళ్లల్లోనే పని మనుషులను ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. వీరిలో కొందరు నమ్మక ద్రోహులుగా మారుతున్న వారి బారిన పడుతున్నారు.  

పోలీసులు ఓ కన్నేసి ఉంచాలి 
సపర్యల విషయం అలా ఉంచితే నిస్సహాయులైన వయో వృద్ధులను ఈ ‘పని మనుషులు’అనేక విధాలుగా వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు, ఫిర్యాదులు అనేకం ఉన్నాయని హెల్పేజ్‌ ఇండియా ప్రతినిధి శ్యామ్‌ వెల్లడించారు. ఒంటరి వయోధికులు ఉండే ఇళ్లపై పోలీసులు ప్రతిరోజూ ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని, వృద్ధుల వద్ద తమ ఫోన్‌ నంబర్లను అందుబాటులో ఉంచాలని ఆయన సూచిస్తున్నారు.  

అమలుకు నోచని సంక్షేమ చట్టం 
⇒ మెయింటెనెన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌ (2007) ప్రకారం వృద్ధుల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించారు. ఈ చట్టంలోని సెక్షన్‌ 21 (2) ప్రకారం వృద్ధులకు సేవలు అందించే గృహ సేవకులు, కేర్‌ గివర్లు, అటెండెంట్లు, ఏజెన్సీలు, ఇతర సంస్థలు స్థానిక పోలీస్‌స్టేషన్‌ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి పత్రాన్ని తీసుకోవాలి.  

 నగరంలో ప్రస్తుతం వృద్ధుల సంరక్షణ, హోమ్‌ నర్సింగ్, హోమ్‌ కేర్‌ సేవలు అందించేందుకు అనేక ప్రైవేట్‌ సంస్థలు పనిచేస్తున్నాయి. వీటిపై ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదు. వీరికి సంబంధించి ఎలాంటి గణాంకాలు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. 
⇒   చాలావరకు హోమ్‌ కేర్, హోమ్‌ హెల్త్‌ కేర్‌ సంస్థలుగా పనిచేస్తున్నాయి. అయితే ఇలాంటి ఏజెన్సీల కోసం ప్రత్యేకంగా నియంత్రణ చట్టం లేదా లైసెన్సింగ్‌ వ్యవస్థ వంటివి లేకపోవడం గమనార్హం. 

అలాంటి వారికి ఇవి తప్పనిసరి.. 
⇒  ఇళ్లల్లో పనిచేసే గృహ కారి్మకులు మొదలుకొని కేర్‌ గివర్స్‌ వరకు ఎవరైనా సరే వయోధికుల కోసం విధుల్లో చేరాలంటే తప్పనిసరిగా పోలీస్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేసుకొని ఉండాలి. 
⇒ చట్టం ప్రకారం ప్రతి కేర్‌ గివర్‌కు ఆధార్‌ గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ, వైద్యులు అందించే ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ వంటి అర్హతలకు సంబంధించిన పత్రాలు ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. 

⇒ కొన్ని పేరొందిన సంస్థలు మాత్రమే కఠినమైన ధ్రువీకరణలు కలిగి ఉంటుండగా.. చిన్న స్థాయి ఏజెన్సీలు లేదా వ్యక్తిగతంగా కేర్‌ గివర్లను పంపించే వారు ఈ నిబంధనలను పూర్తిగా బేఖాతరు చేస్తున్నారు. 
⇒ కుటుంబసభ్యులు కేర్‌గివర్ల పూర్తి ఆధారాలతో పాటు ఫొటోలు కూడా తీసుకుని పెట్టుకోవాలి. అలాగే సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడం మంచిది. 
⇒ కేర్‌గివర్లు లేదా వ్యక్తిగత సేవకులకు డెబిట్, క్రెడిట్‌ కార్డులు, పిన్‌ నంబర్లు, చెక్కులు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. మెడికల్‌ రిపోర్ట్‌లు, ఆస్తి పత్రాలను జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి.

తస్మాత్‌ జాగ్రత్త 
ఎవరిని పడితే వారిని పనిలో పెట్టుకోకూడదు. సాధారణంగా దోపిడీలు, దొంగతనాలే లక్ష్యంగా పనిలో చేరేవారు 6 నెలల పాటు రెక్కీ నిర్వహిస్తారు. ఇంటి పరిసరాలను, ఇంటికి వచ్చి వెళ్లేవారిని గమనిస్తారు. ఏ సమయం అనుకూలమైందో నిర్ధారించుకుంటారు. ఆ తర్వాత ఏ మాత్రం అనుమానం రాకుండా అవసరమైతే తమ ముఠా సభ్యులతో కలిసి పంజా విసురుతారు. దోపిడీలు, హత్యలకు పాల్పడుతారు. గత పదేళ్లుగా ఇలాంటి సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 
– గురజాడ శోభ, తెలంగాణ స్త్రీ సేవా సంస్థ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement