మద్యం మత్తు, అతి వేగం, బైక్‌ను ఢీకొన్న కారు.. పోలీసులపై చిందులు తొక్కిన మందుబాబులు

Road Accident At Kondapur, Drunk driver rash Behave with Police - Sakshi

సాక్షి, గచ్చిబౌలి: మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. కొండాపూర్‌ రాఘవేంద్రకాలనీలో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ జి సురేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అమెరికాలో ఇంజనీరింగ్‌ చదివి ఇటీవలే నగరానికి వచ్చిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును డ్రైవ్‌ చేస్తూ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడమే కాకుండా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసుల పై చిందులు వేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొత్తపేటకు చెందిన కే.విజయ్‌(30), ఘట్‌కేసర్‌కు చెందిన సూర్య(28)లు గురువారం సాయంత్రం విధులు ముగించుకొని కొండాపూర్‌ ప్రాంతానికి వచ్చారు. కారు ఢీకొన్న ఘటనలో గాయపడ్డ విజయ్, సూర్యలను స్థానికులు  ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న ఇద్దరు యువకులు నిహాల్, లోహిత్‌లుగా గుర్తించారు. మత్తులో ఉన్న వీరు పోలీసులపై తిరగబడడంతో వీరిని గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని కొత్తపేటకు చెందిన లోహిత్, కొండాపూర్‌కు చెందిన నిహాల్‌రెడ్డి ఇద్దరు స్నేహితులుగా గుర్తించారు.

అమెరికాలో వీరిద్దరు బీటెక్‌ పూర్తి చేసి ఇటీవలే నగరానికి వచ్చారు. కాగా వీరు ఇరువురు గురువారం జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో మద్యం తాగి సాయంత్రం కొండాపూర్‌లోని నిహాల్‌ ఇంటికి వస్తున్న సమయంలో వాహనం అదుపుతప్పి వీరి ముందు బైక్‌పై వెళ్తున్న విజయ్, సూర్యల వాహనాన్ని ఢీకొట్టారు. వీరికి డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షలు చేయగా కారు నడుపుతున్న నిహాల్‌కు 234 ఎంజీ, లోహిత్‌కు 501ఎంజీ వచ్చింది. వీరు మద్యంతోపాటు మత్తు పదార్థాలను తీసుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారుపై పార్లమెంటు సభ్యుడి స్టిక్కర్‌ ఉండడం చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో కారు నడిపిన ఇద్దరిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top