దేశానికి పాఠాలు నేర్పే దిశగా.. | Replicate Telangana Schemes At National Level: KTR | Sakshi
Sakshi News home page

దేశానికి పాఠాలు నేర్పే దిశగా..

Feb 21 2022 3:43 AM | Updated on Feb 21 2022 8:14 AM

Replicate Telangana Schemes At National Level: KTR - Sakshi

హార్వర్డ్‌ ఇండియా వర్చువల్‌ సదస్సులో మంత్రి కేటీఆర్‌. చిత్రంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌  

సాక్షి, హైదరాబాద్‌: మానవ వనరులు, థింక్‌ ఫోర్స్‌ను సరిగ్గా ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో మౌలిక వసతులు కల్పించినప్పుడే భారతదేశ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ అమలు చేస్తున్న విధానాలను దేశవ్యాప్తంగా విస్తరించాలని, అప్పుడే దేశం గణనీయ పురోగతిని సాధిస్తుందని పేర్కొన్నారు. ‘2030 నాటికి భారతదేశ అభివృద్ధి’అనే అంశంపై ఆదివా రం జరిగిన హార్వర్డ్‌ ఇండియా సదస్సులో కేటీఆర్‌ వర్చువల్‌ విధానంలో మాట్లాడారు.

భారతదేశం నుంచి ప్రపంచం గర్వపడే ఉత్పత్తులు రావాల్సిన అవసరముందని, ఈ దిశగా ఇన్నోవేషన్‌ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీహబ్, వీహబ్, అగ్రిహబ్‌ వంటి ఇంక్యుబేటర్లను మంత్రి కేటీఆర్‌ ప్రస్తావించారు. ‘ఒకప్పుడు బెంగాల్‌ ఆలోచించినది, తరువాత భారతదేశం ఆలోచిస్తుంది’అనే నాను డి ఉండేది. కానీ, ఈ రోజు తెలంగాణ ఆలోచించి, చేసింది.. రేపు భారతదేశం చేస్తుంది’అనే విశ్వాసం తనకు ఉందని పేర్కొన్నారు. ‘భారతదేశం మరింత వేగంగా, విప్లవాత్మకంగా ముందుకు పోవాలంటే కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది.

ప్రపంచంలో కాటన్‌ ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశంగా భారత్‌ ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్‌ ,శ్రీలంకల కన్నా తక్కువ దుస్తులను ఎందుకు ఉత్పత్తి చేస్తోంది.. ఇతరదేశాల నుంచి దిగుమతి చేసుకునే ధరలకన్నా భారతదేశంలో తయారుచేసే మెడికల్‌ పరికరాల ధరలు ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి.. వియత్నాం, తైవాన్‌ లాంటి చిన్నదేశాలు తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్నాయి, ఇందులో మనదేశాన్ని అడ్డుకుంటున్న పరిస్థితులు ఏమిటి.. దేశంలోని నదులు నిండా నీళ్లు పారుతున్నప్పటికీ ఎండిపోతున్న బీడు భూములు ఎందుకున్నాయి.. ఇలాంటి ప్రశ్నల గురించి దేశంలోని ప్రభుత్వాలు, మేధావులు, విద్యావేత్తలు ఆలోచించాలి’అని అన్నారు.  

ఏడేళ్లలో తెలంగాణ మున్ముందుకు... 
దేశంలోనే అతితక్కువ వయసు గల తెలంగాణ రాష్ట్రం ఏడేళ్లలో అనేక కార్యక్రమాల్లో దేశానికి పాఠాలు నేర్పేదిశగా ముందుకు వెళుతోందని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు, టీఎస్‌ ఐపాస్, పట్టణ ప్రకృతి వనాల వంటి కార్యక్రమాలను ఇప్పటికే కేంద్రంతోపాటు అనేక రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకొని, తమ తమ రాష్ట్రాల్లో ప్రారంభించాయని కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగం ఐటీ, హెల్త్, ఎడ్యుకేషన్‌ వంటి రంగాల్లో అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. కేటీఆర్‌ ప్రసంగానికి మంచి స్పందన లభించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement