రాచకొండ పోలీసు కమిషనరేట్‌ మరింత బలోపేతం!

Rachakonda Police Commissionerate: Maheswaram Zone, 763 New Posts Come up - Sakshi

కొత్తగా మహేశ్వరం జోన్‌; ఐదు ఠాణాలు

ట్రాఫిక్‌కు జాయింట్‌ సీపీ; రెండు కొత్త ట్రాఫిక్‌ జోన్లు

ఎస్‌ఓటీ జోన్లూ రెండు; ఎస్‌బీకి అదనపు బలగాలు

కొత్తగా 763 పోస్టులకు ప్రభుత్వం మంజూరు

సాక్షి,హైదరాబాద్: పట్టణీకరణ, కొత్త ప్రాంతాల ఏర్పాటుతో రాచకొండ పోలీసు కమిషనరేట్‌ శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 5,116 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించిన రాచకొండలో 44 లక్షల మంది జనాభా నివాసం ఉంటోంది. ఏటేటా జనాభా, ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఠాణాలు, ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్లు, పోలీసుల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాచకొండకు కొత్తగా 763 పోలీసు పోస్టులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం రాచకొండలో ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి, భువనగిరి జోన్లు, ఒక్కో ట్రాఫిక్, ఎస్‌ఓటీ జోన్‌లతో కార్యాకలాపాలు సాగిస్తుంది. తాజా నిర్ణయంతో అదనంగా ఒక శాంతి భద్రతల జోన్, రెండు ట్రాఫిక్‌ జోన్లు, రెండు స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. 

కొత్తగా మహేశ్వరం జోన్‌: 
ఎల్బీనగర్‌ జోన్‌ నుంచి ఇబ్రహీంపట్నం డివిజన్‌ను వేరు చేసి కొత్తగా రానున్న మహేశ్వరం డివిజన్‌తో కలిపి కొత్తగా మహేశ్వరం జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. 
పోస్టులు: డీసీపీ–1; అదనపు డీసీపీ–1, పీసీ–2, జేఏ–1 

► ఇబ్రహీంపట్నం డివిజన్‌ నుంచి మహేశ్వరం, కందుకూరు పోలీసు స్టేషన్లు, వనస్థలిపురం డివిజన్‌ నుంచి పహాడీషరీఫ్, బాలాపూర్‌ ఠాణాలను వేరు చేసి కొత్తగా మహేశ్వరం డివిజన్‌ను ఏర్పాటు చేయనున్నారు. 
పోస్టులు: ఏసీపీ–1; పీసీ–2 

► ఇప్పటికే ఉన్న ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి, భువనగిరి జోన్‌లతో పాటు కొత్తగా రానున్న మహేశ్వరం జోన్‌కు ఒక్కో అదనపు డీసీపీలను నియమించనున్నారు. 

ఐదు కొత్త ఠాణాలు.. 
ప్రస్తుతం 43 శాంతి భద్రతలు, రెండు మహిళా పోలీసు స్టేషన్లు ఉండగా.. కొత్తగా మరో ఠాణాలను ఏర్పాటు చేయనున్నారు. చర్లపల్లి, నాగోల్, హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మా సిటీ, పోచారం ఐటీ కారిడార్‌ స్టేషన్లుతో పాటు ఉప్పల్‌లో మహిళా ఠాణా రానుంది. అలాగే ప్రస్తుతం ఉన్న కీసర, అబ్దుల్లాపూర్‌మెట్, బాలాపూర్‌ ఠాణాలను నవీకరించనున్నారు. యాదాద్రిలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కేవలం గట్టు కోసమే ప్రత్యేకంగా ఏసీపీ ర్యాంకు అధికారిని మంజూరు చేశారు. యాదాద్రి టెంపుల్‌ పీఎస్, రాయగిరి పీఎస్‌లు ఆయన పరిధిలో ఉంటాయి. 

రెండు ఎస్‌ఓటీ జోన్‌లు.. 
ప్రస్తుతం రాచకొండలో ఒకటే ఎస్‌ఓటీ జోన్‌ ఉంది. కొత్తగా ఎల్బీనగర్‌–మహేశ్వరం, మల్కాజ్‌గిరి–భువనగిరి ఎస్‌ఓటీ జోన్లు రానున్నాయి. 
పోస్టులు: డీసీపీ–2, అదనపు డీసీపీ–1, ఏసీపీ–1, ఇన్‌స్పెక్టర్లు–2 

► స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ) విభాగాన్ని కూడా బలోపేతం చేయనున్నారు. ఎస్‌బీకి కొత్తగా డీసీపీ ర్యాంకు అధికారి రానున్నారు. అదనంగా ఒక డీసీపీ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, 3 ఎస్‌ఐలు, ఐదుగురు ఏఎస్‌ఐలు, 5 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 16 మంది కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.  

నాలుగు కంట్రోల్‌ రూమ్‌లు.. 
రాచకొండలో కొత్తగా నాలుగు జోనల్‌ కంట్రోల్‌ రూమ్‌లు రానున్నాయి. ఒక్కో కంట్రోల్‌ రూమ్‌కు ఒక ఏఎస్‌ఐ, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లుంటారు. వీటితో పాటు ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌)లో 70 మంది, ఐటీ, క్లూస్, సీసీఎస్‌ వంటి ఇతరత్రా విభాగాలలో 75 మంది, ఐడీ స్టాఫ్‌లో 13 అదనపు పోస్టులను భర్తీ చేయనున్నారు. 

ట్రాఫిక్‌లో రెండు జోన్లు, జాయింట్‌ సీపీ.. 
ఏటేటా వాహనాల సంఖ్య, రద్దీ పెరగడంతో ట్రాఫిక్‌ నియంత్రణ ఇబ్బందిగా మారింది. దీంతో ఈ విభాగాన్ని కూడా విస్తరించనున్నారు. కొత్తగా రాచకొండ ట్రాఫిక్‌కు జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు (సీపీ)ను పోస్టును భర్తీ చేయనున్నారు. కొత్తగా రానున్న రెండు ట్రాఫిక్‌ జోన్ల మధ్య సమన్వయం, విధుల కేటాయింపు, ట్రాఫిక్‌ నియంత్రణ అంశాలను జాయింట్‌ సీపీ పర్యవేక్షిస్తారు. ఆయనతో పాటు రెండు పీసీలు, ఒక జేఏ పోస్టులు కూడా మంజూరయ్యాయి. 

కొత్తగా రెండు ట్రాఫిక్‌ జోన్‌లు: 
► ప్రస్తుతం రాచకొండ మొత్తానికీ ఒకటే ట్రాఫిక్‌ జోన్‌ ఉంది. కొత్తగా ఎల్బీనగర్‌–మహేశ్వరం, మల్కాజ్‌గిరి–భువనగిరి రెండు జోన్‌లను ఏర్పాటు చేయనున్నారు. 
పోస్టులు: డీసీపీ–1, అదరపు డీసీపీ–1, పీసీలు–2 

► కొత్తగా మహేశ్వరం ట్రాఫిక్‌ డివిజన్‌ను కూడా రానుంది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ట్రాఫిక్‌ ఠాణాలను కలిపి ఈ డివిజన్‌ ఉంటుంది. 
పోస్టులు: ఏసీపీ–1, పీసీ–1 

► ప్రస్తుతం ఎనిమిది ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్లు ఉండగా.. అదనంగా మరో నాలుగు ఠాణాలు రానున్నాయి. కొత్తగా ఘట్‌కేసర్, జవహర్‌నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్‌ స్టేషన్లను ఏర్పాటు, యాదాద్రి ట్రాఫిక్‌ పీఎస్‌లను నవీకరించనున్నారు.  (క్లిక్: సంచలనాల సమాహారం.. ‘ఫామ్‌హౌస్‌–ఈడీ’ కేసుల వరకు ఎన్నెన్నో..)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top