PV Narasimha Rao: ఇంతింతై వటుడింతై అన్నట్లుగా..

PV Narasimha Rao Birth Anniversary Celebrations In Telangana - Sakshi

సాక్షి, మంథని(జగిత్యాల): ఇంతింతై వటుడింతై అన్నట్లుగా..  లక్నేపల్లి అనే ఒక కుగ్రామంలో పుట్టి, రాజకీయ పరమపదసోపానంలో ఒక్కో మెట్టును అధిగమించి భారత ప్రధానిగా అత్యున్నత స్థానాన్ని అధిష్టించిన అపర చాణక్యుడు పీవీ నరసింహారావుకు నేడు శత జయంతి. 1921 జూన్‌ 28లో జన్మించిన పీవీ 1957లో మొట్టమొదటిసారిగా మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు. ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలు ఈ ప్రాంత ప్రజల మదిలో కదలాడుతూనే ఉన్నాయి. పీవీ శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. 

మంథని నుంచే ప్రారంభం
విద్యాభ్యాసం అనంతరం న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించేందుకు వచ్చిన పీవీ, స్వామి రామానంద తీర్థ శిష్యరికంలో మొదట 1952లో కరీంనగర్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేసి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అటు తర్వాత 1957లో మొదటిసారిగా మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వరుసగా 1962, 1967, 1972 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.

ఉన్నత విద్యాశాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రిగా సేవలందించిన ఆయనను కాంగ్రెస్‌ అధిష్టానం 1972లో ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయడంతో 1977 వరకు పనిచేశారు. ఆ తర్వాత హన్మకొండ నుంచి రెండు సార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా గెలిచారు. 1984లో హన్మకొండ, మహారాష్టలోని రాంటెక్‌ నుంచి ఎంపీగా పోటీ చేయగా హన్మకొండలో ఓటమి చవిచూసినా, రాంటెక్‌లో విజయం సాధించారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించిన ఆయన అపార అనుభవాన్ని గడించారు.

ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు
గాడితప్పిన భారత ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు నూతన సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రపంచ ముఖచిత్రంలో మన దేశ ఖ్యాతిని నిలబెట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ. 1991లో భారత ఆర్థిక నిల్వలు తరిగిపోయి ప్రధాని చంద్రశేఖర్‌ హయాంలో బంగారం నిల్వలను విదేశాల్లో తనఖా పెట్టాల్సిన పరిస్థితుల్లో  ప్రధానిగా పగ్గాలు చేపట్టిన పీవీ ఆర్థిక నిపుణుడు మన్మోహన్‌సింగ్‌కు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించాడు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నూతన ఆర్థిక సంస్కరణలకు తెర తీశారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడమే కాకుండా అభివృద్ధి చెందేందుకు దోహద పడ్డాడు. కేంద్రీయ విద్యాలయాలు. భూసంస్కరణలు, వన్యప్రాణి సంరక్షణ చట్టాలు లాంటి అనేక సంస్కరణలకు రూపకర్త అయిన పీవీ చిరస్మరణీయుడు.    

ప్రధానిగా పీవీ 
1991లో రాజీవ్‌ గాంధీ హత్యానంతరం రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్న పీవీని ప్రధాని పదవి వెతుక్కుంటూ వచ్చింది. దేశంలో కాంగ్రెస్‌ సంపూర్ణ మెజార్టీ రావడంతో ప్రధానిగా పీవీ పేరునే పార్టీ పెద్దలు ప్రతిపాదించారు. పీవీనే ప్రధాని పదవికి అర్హుడని ఏకగ్రీవంగా మద్దతు తెలుపడంతో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆరు నెలల్లో కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేసి, 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1991 నుంచి 1996 వరకు ప్రధానిగా పనిచేశారు. ప్రధానిగా దేశంలో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించిన పీవీ ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. 
చదవండి: Jagananna Colonies: 3 రోజుల్లో లక్షల ఇళ్లు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top