తెలంగాణ: ‘సెకండ్‌ వేవ్‌’.. ఆందోళనొద్దు! | Public Health Director Srinivasa Rao Addresses Press Conference On COVID19 | Sakshi
Sakshi News home page

తెలంగాణ: ‘సెకండ్‌ వేవ్‌’.. ఆందోళనొద్దు!

Mar 28 2021 1:49 AM | Updated on Mar 28 2021 11:45 AM

Public Health Director Srinivasa Rao Addresses Press Conference On COVID19 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సెకండ్‌ వేవ్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు జి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తే సెకండ్‌ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చన్నారు. శనివారం హైదరాబాద్‌లో వైద్యవిద్య విభాగం సంచాలకుడు రమేశ్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

వ్యాక్సినేషన్‌కు పెద్దగా స్పందన రావట్లేదు...
‘రాష్ట్రంలో కోటి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల సంఖ్య పెంచాం. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రజల నిర్లక్ష్య ధోరణితోనే పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఏడాదిగా చాలా పాఠాలు నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలి. మాస్కు లు ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం, చేతులను శుభ్రం చేసుకోవడంతో వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ప్రజల నుంచి స్పందన పెద్దగా రావట్లేదు. రాష్ట్రానికి ఇప్పటివరకు 24.49 లక్షల వ్యాక్సిన్‌ డోసులు రాగా వాటిలో దాదాపు 12 లక్షలు విని యోగించాం. సగటున 1% వేస్టేజీ ఉంటుంది. కానీ రాష్ట్రంలో కేవలం 0.7 శాతమే ఉంది. ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్ల పైబడిన వారంతా వ్యాక్సిన్‌ వేసుకోవాలి.

వ్యాక్సిన్‌ వేసుకున్నాక కరోనా వచ్చినా ప్రమాదకర పరిస్థితి మాత్రం ఉండదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ. 250 చెల్లించి టీకా తీసుకోవచ్చు. కొన్ని ఆస్పత్రులు రూ. 150 మాత్రమే తీసుకుంటున్నాయి. రూ.100 సర్వీసు చార్జీని వసూలు చేయట్లేదు. ప్రస్తుతం హోలీ, ఉగాది, ఈస్టర్, రంజాన్‌ మాసం ప్రారంభం నేపథ్యంలో ప్రజలు గుమిగూడే పరిస్థితులు ఉంటాయి. వాటికి దూరంగా ఉండటమే మంచిది. 60 ఏళ్లు దాటిన వారు, పిల్లలు ఈ వేడుకలకు దూరంగా ఉండాలి. పిల్లలకు వైరస్‌ వ్యాప్తి చెందితే ప్రమాదం కానప్పటికీ ఎక్కువ మందికి మ్యుటేషన్‌ అయ్యే అవకాశాలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో నిఘా బృందాలు పనిచేస్తున్నాయి. కేసులు ఎక్కువగా ఉన్నచోట మైక్రో కంటైన్మెంట్‌ ప్రాంతాలుగా గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం’అని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వివరించారు.

బాధితుల్లో ఎక్కువగా లక్షణాలు కనిపించట్లేదు: డీఎంఈ రమేశ్‌రెడ్డి
ఒకరికి కరోనా వస్తే ఆ వ్యక్తి నుంచి 8–9 మందికి వ్యాపిస్తుందనే అంచనా ఉందని వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి తెలిపారు. పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువ మందికి లక్షణాలు ఉండట్లేదని వివరించారు. కరోనా బారినపడి లక్షణాలు తీవ్రమైన కేసుల్లో మాత్రం దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతున్నాయని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ కేసులు ఆస్పత్రుల్లో ఇప్పటికీ కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగినప్పటికీ అన్ని రకాల ఏర్పాట్లతో యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. బాధితులు నేరుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సంప్రదించాలని, మండల స్థాయి ఆస్పత్రుల్లోనూ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకోవద్దని, ప్రభుత్వ ఆస్పత్రులకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల సిబ్బంది వేలాది కేసులకు చికిత్స చేసిన అనుభవం ఉందని గుర్తుచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement