ఆక్సిజన్‌పై అబద్ధాలు

Private Hospitals highly Fee On Oxygen Over COrona - Sakshi

మణికట్టు నుంచి రక్త నమూనా తీయని అనేక ప్రైవేటు ఆసుపత్రులు

ఆక్సిజన్‌ స్థాయి తక్కువగా చూపే మోచేయి నుంచి శాంపిల్‌ తీస్తున్న వైనం

అనవసర మందులు, ఆక్సిజన్‌ బెడ్లు, వెంటిలేటర్ల పేరుతో భారీ దోపిడీ

సర్కారుకు ఫిర్యాదులు  

హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి నాలుగు రోజుల క్రితం ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ జ్వరం, దగ్గు వంటి సాధారణ లక్షణాలతో వెళ్లాడు. అతని ఆక్సిజన్‌ లెవల్స్‌ను తెలుసుకునేందుకు అతని చేతి నుంచి రక్తం తీసుకున్నారు. పరీక్షించి చూడగా అతని రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు 65 శాతం మాత్రమే ఉన్నాయి. దీంతో పరిస్థితి సీరియస్‌గా ఉందని, ఆసుపత్రిలో చేరాలని అతన్ని భయపెట్టారు. దీంతో రూ. లక్షలు చెల్లించి ఆసుపత్రిలో చేరాడు. పల్స్‌ ఆక్సీమీటర్‌లో అతని ఆక్సిజన్‌ లెవల్స్‌ సాధారణంగానే కనిపిస్తున్నప్పటికీ ఎందుకిలా జరిగింది? అసలెక్కడ లోపముంది? 

సాక్షి, హైదరాబాద్ ‌: కరోనా వైరస్‌ ప్రధానంగా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి ఊపిరితిత్తులకు సక్రమంగా ఆక్సిజన్‌ అందుతోందా లేదా అనేది తెలుసుకోవడం అత్యంత కీలకమైన అంశం. కాబట్టి ఎవరికి వారు పల్స్‌ ఆక్సీమీటర్లను కొనుక్కొని ఆక్సిజన్‌ స్థాయిలను తెలుసుకుంటున్నారు. అలా రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను బట్టే రోగి పరిస్థితి తీవ్రంగా ఉందా లేదా అనేది తెలుస్తుంది. సాధారణంగా 95 కంటే తక్కువగా ఉంటే అలర్ట్‌ కావాలి. 90లోపు వస్తే డాక్టర్‌ వద్దకు వెళ్లాలి. 85 నుంచి తక్కువవుతూ 65% వరకు చేరుతుందంటే రోగి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పరిగణించి ఆక్సిజన్‌ పెడతారు. 65% వరకు వచ్చిందంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు లెక్క. కానీ ఈ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు 65% వరకు ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయినా ఎలా సాధారణంగా ఉండగలిగాడు? ఎలాంటి తీవ్రమైన లక్షణాలు లేకుండానే కేవలం రిపోర్ట్‌ ఆధారంగానే అతన్ని బెడ్‌పై పడుకోబెట్టారు. అసలేం జరుగుతోందంటే... 

తప్పుడు పరీక్షలు... తప్పుడు రిపోర్టులు 
సాధారణ రక్త పరీక్షల కోసం మోచేయి భాగం నుంచి రక్త నమూనాలు తీస్తారు. వాటి ద్వారా పూర్తి రక్త పరీక్షలు నిర్వహిస్తారు. కానీ రక్తంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ను పరీక్షించాలంటే మణికట్టు వద్ద ఉండే నాడి నుంచి రక్త నమూనాలను తీయాలి. మోచేయి భాగం నుంచి తీసిన రక్త నమూనాలతో ఆక్సిజన్‌ లెవల్స్‌ను పరీక్షిస్తే అత్యంత తక్కువగా 65–70 మధ్య మాత్రమే వస్తాయి. నాడి వద్ద నుంచి తీసే రక్త నమూనాల ద్వారానే ఆక్సిజన్‌ స్థాయులు సరిగ్గా తెలుస్తాయి. కానీ చాలా ఆసుపత్రులు బాధితులను భయపెట్టి తమ బెడ్లను నింపుకొని రూ. లక్షలు గుంజేందుకు మోచేయి పైభాగం నుంచి తీసిన రక్త నమూనాల ద్వారానే ఆక్సిజన్‌ లెవల్స్‌ను గుర్తిస్తున్నట్లు బాధితుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి. 

ప్లాస్మా థెరపీ అంటూ మరో మోసం... 
కరోనా చికిత్స పేరుతో అనేక ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా ప్రజలను మోసం చేస్తున్నాయి. రోగులు అప్పులపాలై రోడ్డున పడేలా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొందరు రోగులకు ప్లాస్మా అవసరమని, ప్రస్తుతం అది అందుబాటులో లేదని, దాతలు దొరకడం లేదని చెప్పి ఆ పేరుతో రూ. లక్షలు గుంజుతున్నాయి. కొన్నిసార్లు వెంటిలేటర్‌పై ఉన్న రోగులకు ప్లాస్మా చికిత్స చేస్తున్నట్లు అనేక ఆసుపత్రులపై ఆరోపణలున్నాయి. వాస్తవానికి వెంటిలేటర్‌పై ఉన్న వారికి ప్లాస్మా థెరపి చేసినా ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కానీ రోగులు, వారి కుటుంబ సభ్యుల భయాన్ని ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. అలాగే సాధారణ ధరలకు రెమిడిసివిర్‌ ఇంజెక్షన్లు తెప్పించి వాటిని రోగులకు అత్యవసరం పేరిట బ్లాక్‌లో కొన్నట్లు చెప్పి డబ్బులు గుంజుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధిక ధరలున్న మరికొన్ని మందులను కూడా ఇలాగే వాడుతూ ఎక్కువ బిల్లులు వేస్తున్నాయి. ఇక కొందరు రోగులకు నెగెటివ్‌ వచ్చినా వారికి రిపోర్టులు వెంటనే ఇవ్వకుండా చికిత్స పేరిట అనేక ఆసుపత్రులు మోసం చేస్తున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top