
లేబొరేటరీ, లైబ్రరీ, జాబ్ ట్రైనింగ్ పేరుతో వసూళ్లు
డబ్బులు చెల్లించినా రశీదులు ఇవ్వని యాజమాన్యాలు
ఆధారాలు లేకుండా ఏమీ చేయలేమంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు లేబొరేటరీ, లైబ్రరీ ఫీజులు భారీగా పెంచాయి. ఒక్కో కాలేజీ ఒక్కో రకంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ విషయాన్ని కొంతమంది విద్యార్థులు ఇటీవల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆధారాలు లేకుండా కాలేజీలను తామూ కట్టడి చేయలేమని అధికారులు అంటున్నారు. అదనంగా కట్టించుకునే ఫీజులకు కాలేజీ యాజమాన్యాలు ఎలాంటి రశీదులు ఇవ్వడం లేదని విద్యార్థులు తెలిపారు. అదనపు ఫీజులు కట్టకపోతే క్లాసుకు హాజరైనా అటెండెన్స్ ఉండదని, ఫలితంగా పరీక్ష రాసే అవకాశం కోల్పోతారని బెదిరిస్తున్నట్టు విద్యార్థులు వాపోతున్నారు.
అసలు కన్నా...కొసరే ఎక్కువ
లైబ్రరీ, లేబొరేటరీ ఫీజు కింద అదనంగా ఏటా రూ.12 వేల వరకూ తీసుకోవాలని ప్రభుత్వం గతంలో జీఓ ద్వారా పేర్కొంది. కొన్నేళ్లుగా ఈ ఫీజులో ఎలాంటి మార్పూ లేదు. కానీ కొన్ని కాలేజీలు లైబ్రరీ, లేబొరేటరీ ఫీజు కింద గతేడాది రూ.20 వేల వరకూ వసూలు చేశాయి. ఈ ఏడాది నుంచి ఈ ఫీజును ఏకంగా రూ. 30 నుంచి రూ. 50 వేల వరకూ పెంచారు. క్యాంపస్ నియామకాలకు శిక్షణ ఇచ్చేందుకు కాలేజీలు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నాయి.ఏటా రూ.30 నుంచి రూ.60 వేల వరకూ విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థికి స్కిల్ నేర్పించడం కాలేజీల బాధ్యత. అవేమీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
కఠినచర్యలు తప్పవు
నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఆధారాలతో తమకు ఫిర్యాదు చేస్తే, ఆ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఉద్యోగం కోసం శిక్షణ పేరుతో డబ్బులు తీసుకుంటున్నారని ఇటీవల జేబీఐటీ కాలేజీలపై ఎస్టీ కమిషన్‌కు ఓ విద్యార్థి ఫిర్యాదు చేశారు. ఆ కాలేజీకి ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. – డాక్టర్ కె.వెంకటేశ్వరరావు, జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్